Sunday, July 15, 2012

భగవంతుని అవతారానికి కారణమేమి?



మనం ఉన్నటువంటి కాలానికి కలికాలమని పేరు, అంటే కలి రాజ్యం చేసేటటువంటి కాలం. ఇలాంటి కాలంలో ధర్మం చేద్దాం అనే బుద్ధి కలగటమే కష్టం. కలిగినా దాన్ని ఆచరించటానికి అనువైన వాతావరణాన్ని నిలబడనివ్వదు ఈ కాలం. అట్లాంటి కలిని దూరంగా ఉంచడం కష్టమే అయినా కలిని కూడా దూరంగా జరిపే భగవంతుడు ఉన్నాడు కనుక భగవంతుణ్ణి తోడు చేసుకోగలిగితే కలిని దూరం చేసుకున్నవాళ్ళం అవుతాం, సన్మార్గంలో ప్రయాణించగలుగుతాం అని శౌనకాది ఋషులంతా భగవంతుణ్ణి ప్రార్థిస్తే, భగవంతుని ఆదేశం మేరకు నైమిశారణ్యం చేరి అక్కడ సత్ర యాగాన్ని వెయ్యి సంవత్సరాలు జరపాలని సంకల్పించుకొని, అగ్నిహోత్రాది కార్యక్రమాలు, మిగతా సమయం వేదాధ్యయనం, మంత్రానుష్టానము చేసుకుంటూ ఉండేవారు.
ఒకనాడు భగవంతుని కథను శ్రవణం చేయాలని, నిపుణుడు మరియూ జ్ఞాన వృద్ధుడు అయినటువంటి సూతుడు అనే మహానుభావుణ్ణి ఆశ్రయించి, తమకు తెలుసుకోవాలనే వాటిని గురించి ప్రశ్న వేశారు. రోమహర్షణుడు అనే పౌరానికుడి కుమారుడు సూతుడు. ఆయన చాల గొప్ప జ్ఞానం కలవాడు, తత్వ రహస్యాలను చాలా స్పష్టంగా తెలుసుకున్నవాడు కనుక ఏది తెలిస్తే మనిషికి మానసిక ప్రశాంతతతో పాటు మనిషికి శ్రేయస్సు కూడా ఏర్పడుతుందో అట్లాంటి దాన్ని వివరించమని కోరారు. శాస్త్రాన్ని చదివే ఆయిస్సు మనకి లేదు, తెలిసిన ఏ కొద్దినైనా ఆచరించే శక్తి మన శరీరాల్లో లేదు, బుద్ధి కూడా సహకరించదు. ఆచరించేది కొండలు కొండలుగా ఉన్నది, ఆటంకాలు అంతకు మించి ఉన్నాయి. ఏది మేం చేయాల్సింది వివరించమని ప్రార్థించారు. జిజ్ఞాసువులైన వ్యక్తులకి, ప్రేమించినటువంటి వారికి అడగటం చేతకాకపోయినా జ్ఞానం కల మహానుభావులు తాము తత్వరహస్యాన్ని వివరించతగుని అనే సూక్తిని బట్టి మాకూ వివరించండి అని ప్రార్థించారు. ఏమిటి మీకు కావల్సించి అని అడిగాడు.

సూతజానాసు బద్రంతే భగవాన్ సాత్వతాం పతిః |
దేవక్యాం వసుదేవస్య జాతోయష్యసికీర్తయా ||

"సూతజానాసు బద్రంతే" నీవు చెప్పే జ్ఞానం చాలా విలువైనది కనుక, అది తెలిసిన నీలాంటి వారు లోకంలో క్షేమంగా ఉండాలి. లోకానికి ఉపకారం చేయదగిన వ్యక్తి ఏ ఒకడున్నా కొంత కొంత మంచిని చేర్చే అవకాశం ఉంటుంది. "భగవాన్ సాత్వతాం పతిః" భగవంతుడికి సాత్వతాం పతి అని పేరు, అంటే భక్తులందరిచేతా ఆరాధించబడే స్వామి. అట్లానే ప్రపన్నులందరిని రక్షించే స్వామి ఈ లోకంలో "దేవక్యాం వసుదేవస్య జాతః" దేవకీ వసుదేవుల వల్ల అవతరించాడు అని వింటున్నాం. ఆయన అవతారానికి ఏదో ఒక కారణం ఉంటుంది, ఏం చేయటానికి ఈ లోకానికి వచ్చాడు, ఏమి ఆయన చేసిన పనులు అర్థాత్ భగవంతుని దివ్యమైన చేష్టితముల గురించి, భగవంతుని కల్యాణ గుణములని గురించి వినాలనుకుంటున్నాం అని అన్నారు. 




No comments:

Post a Comment