Sunday, July 15, 2012

యజ్ఞుడు, ఋషభ దేవుడు, పృథుచక్రవర్తిగా తరువాతి అవతారాలు


తతః సప్తమ ఆకూత్యామ్ రుచేర్ యజ్ఞో భ్యుజాయత |
స యామాద్యైః సురగణైర్ అపాత్ స్వాయంభువాంతరమ్ ||

ఏడవ అవతారం యజ్ఞుడు. రుచి ఆకుతి అనే దంపతులకి జన్మించాడు. ఆ దంపతులే తరువాత దేవకీ వసుదేవులవుతారు వారికి కృష్ణుడు జన్మించాడు. ఆకుతి అనే ఆవిడ మొదటి మనువు యొక్క కుమార్తె. ఇది స్వాయంభువ మన్వంత్రం మొదలయ్యాక ఎత్తిన అవతారం.

అష్టమే మేరుదేవ్యామ్ తు నాభేర్ జాత ఉరుక్రమః |
దర్శయన్ వర్త్మ దీరాణామ్ సర్వాశ్రమ నమస్కృతమ్ ||

ఆయన ఎనిమిదవ అవతారంగా నాభీ అనే  మహానుభావుడి ద్వారా మేరు దేవి అనే ఆవిడకి జన్మించాడు. ఋషభ దేవుడు అని ఆయనకి పేరు. బ్రహ్మచర్యం వానప్రస్తం సన్యాసం కానీ అన్ని రకాల ఆశ్రమాల వారిచేత నమస్కరించబడే యోగ్యత కల మహనీయుడు. లోకంలో ఉండే జ్ఞానులంతా ఎట్లా ప్రవర్తించాలో మార్గ నిర్దేశం చేసిన మహనీయుడు.

ఋషిభిః యాచితో భేజె నవమమ్ పార్థివమ్ వపుః |
దుగ్దెమామ్ ఓషదీర్ విప్రాః తేనాయమ్ స ఉశత్తమః ||

ఆయన యొక్క తొమ్మిదవ స్వరూపం పృథు అనే చక్రవర్తిగా అవతరించాడు. ఈ పృథు చక్రవర్తి కాలంలోనే ఈ భూమికి రూపకల్పన చేసాడు. అంతకు ముందు చాలా మంది రాజులు పాలించినట్లు తెలుస్తుంది కానీ ఇప్పుడు మనం చూసేలా గ్రామాలు, పట్టణాలు అనేలా వ్యవస్థ ఉన్నది అని తెలియదు. ఈ పృథు చక్రవర్తి కాలంలోనే గ్రామాలు ఎట్లా ఉండాలి, పట్టనాలు ఎట్లా ఉండాలి, జంతువులు ఎక్కడ ఉండాలి అనే ఈ వ్యవస్థను అంతా చేసిన మహానుభావుడు. ఆయన ఈ వ్యవస్థ చేసిన తరువాతనే ఈ భూమికి పృథ్వీ అనే పేరు వచ్చింది. అంతకు ముంది ఈ భూమికి అజనాభం అనే పేరు ఉండేది. ఋషులంతా ప్రార్థన చేస్తే వారి ప్రార్థనా ఫలితంగా ఈ అవతారాన్ని ఎత్తాడు. ఈయన తండ్రి ఒక దుష్టుడు, లోకాన్ని హింసించేవాడు అని ఋషులంతా శపించి సంహరించారు. ఆతరువాత ఆయన భుజాన్ని చిలికి పృథువుని సృజించారు. అట్లా వచ్చిన అవతారం. ఆయన కాలంలో మనుష్యులకి కావల్సిన ఆహారం, జంతువులకి కావల్సిన ఆహారం, రాక్షస యక్ష కిన్నర కింపురుష ఆయా ఆయా జాతులకి ఏయే ఆహారం కావాలో అవన్నీ లభించేట్టుగా భూమిని శాసించాడు. ఎవరి కావల్సినవి వారికి ఇచ్చేట్టుగా భూమిని తీర్చి దిద్దాడు. మనుష్యులు తినాల్సినవి ఓషదులు మాత్రమే అని నిర్ణయం చేసినది ఆయనే.



No comments:

Post a Comment