Saturday, December 14, 2013

నారాయణుని ఉపదేశం -శ్రీ దేవీ భాగవతం

శచికి బృహస్పతి హితవు

పాలకుడు పాతకుడైతే, పాలితులు తమకు ఎక్కడ హితవు లభిస్తుందో అది వెతుక్కుంటూ వెళ్లిపోవడం సహజంగా జరిగేదే! మన్మధావేశితుడై మూర్ఖుడైపోయిన నహుషునికి ఎంత చెప్పినా ఏమీ ప్రయోజనం లేదని అర్థమైపోయింది వారందరికీ. అంగీరసుడు తప్పక ఈ దుర్మార్గాన్ని అంతమొందించే మార్గం చెప్పగలడని అందరూ కలిసి ఆయనను సంప్రదించారు.

దేవతలకు ఆచార్యుడు బుద్ధికి బృహస్పతి అయిన ఆ సురగురువు చాలా సేపు యోచించి, “నహుషుడి ఆతృతకు ప్రస్తుతానికి అడ్డుకట్ట వేయగల మార్గం అయితే చెప్పగలను. కాని అది వాయిదా వేయడానికీ తాత్కాలికంగా అతడ్ని నిలువరించడానికీ సాధ్య పడుతుంది తప్ప, అతని పీడ శచీదేవికి పరిపూర్ణంగా తప్పిస్తుందని చెప్పజాలను” అన్నాడు. ఏదోలా ముందీ గండం గడచి గట్టెక్కితే, నిదానించి ఇంకొక మంచి ఆలోచనతో నహుషుడి నాశనం గురించి యోచించవచ్చు! ఇక అట్టే కాలం ఇతడ్ని పదవిలో కొనసాగనివ్వడం శిష్టులకు క్షేమం కాదు” అని బృహస్పతి చెప్పిన చొప్పున చేయడానికి అందరూ సమాయత్తమయ్యారు.

బృహస్పతితో కూడి దేవతలూ – మునులూ తన వద్దకు రావడం వారితో శచీదేవి కూడా ఉండడం నహుషుడికి మహదానంద సంధాయకంగా తోచింది. ఇంద్రాణి మీదికి వలపు చూపుల తూపులు రువ్వుతూ “రా! శచీ! రా! ఇప్పుడు కదా నేను పరిపూర్ణ ఇంద్రుడినైనాను. ఇక నా హృదయ రాజ్యానికీ మన్మధసామ్రాజ్యానికీ దేవేరివి నీవే” అంటూ నవ్వులొలకబోశాడు.

లోలోపల చీదరించుకుంటూ, సిగ్గుతో చితికిపోతూ “అది అలా ఉంచు నరపతీ! నువ్వు ఒక విషయం విస్మరిస్తున్నావు. నా భర్త కనిపించకుండా పోయాడే తప్ప, కాలగతి చెందలేదు. ఏ స్త్రీ అయినా పతి బ్రతికి ఉండగా పరపురుషుని కన్నెత్తి అయినా చూడజాలదు. అది జారిణో స్వైరిణో అయితే తప్ప, అట్టి స్థితి నాకు కల్పించకు! అది నీకే అప్రతిష్ట. ముందీ శచీపతి గురించి పూర్తి సమాచారం సేకరించు! అతడికి కనపడే అవకాశం లేదని నిర్ధారించుకో! అది నీకూ నాకూ ఇద్దరికీ క్షేమదాయకం. ఎందుకంటే, కాలం కర్మం కూడివచ్చి భవిష్యత్తులో నా భర్త తిరిగి వచ్చాడనుకో, వచ్చేవాడెంత శక్తియుతుడై తిరిగి వస్తాడో! ఏ తపోదీక్ష బూని ఏ వరాలను గొనివస్తాడో ఎవరికి ఎరుక? అట్టి దేవేంద్రుడు బలోపేతుడై తిరిగొచ్చాడనుకుందాం! నీతో కులుకుతున్నానని శాపాలు నాకూ – తన భార్యని లోబర్చుకున్నందుకు ప్రతాపాలు నీకూ రుచి చూపిస్తే ఇద్దరికీ ఇక్కట్లే! నేను చెప్పినది కాదని ఎవరైనా ఖండిస్తారేమో ….ఇందరిలో ఒక్కర్ని చూపించు!” అని ప్రశ్నార్థకంగా చూసింది శచీదేవి.

నహుష చక్రవర్తి వికటంగా నవ్వేసి “అమరాధిపుడైన నాకు ఇంక ఎదురేమున్నదీ? నీ భర్త ఇంకా వుండడం కల్ల. అది నీవు నీ పతిపట్ల గల అనురాగం చేత గ్రహించలేకపోతూన్నావు. అతడిక బ్రతికిలేడు గాక లేడు! లేడు గనుకనే దేవతలు నాకు పట్టం గట్టారు. నీవింకా ఆ సంగతి జీర్ణించుకోలేక ఎదురు తెన్నులు చూస్తున్నావల్లే వుంది.

అయినప్పటికీ నేను నిన్ను సంతోషపరిచే ప్రయత్నం తప్పకచేస్తాను . దేవేంద్రుని గురించి నేడే దశ దిశలకూ గూఢచారులను పంపుతాను. వారు ఏడేడు పధ్నాలుగు లోకాలూ గాలించి, అణువణువూ శోధించి అతడి అవశేషాలేం మిగిలి వున్నా నాకు నివేదిస్తారు. అది నువ్వు చూశాకనే నిన్ను చేపడతాను” అని కొంతకాలం ఆగడానికి ఒప్పుకున్నాడు. అప్పటికప్పుడే భూలోకాన్నుంచి తనకు నమ్మకస్తులైన గూఢచారుల్ని పిలిపించి ఇంద్రుడినైనా – అతడి అవశేషాలనైనా జాడ కనుక్కోమని ఆజ్ఞ జారీచేశాడు. శచీదేవిని ఆమె మందిరానికి క్షేమంగా చేర్చమని అక్కడున్న ఋషుల్ని ఆదేశించాడు. అంతేకాదు – ఆమె సంక్షేమం చూసుకోవడమే వారికి వృత్తిగా చేసి, జపతపాలు కొన్నాళ్ళు కట్టి పెట్టవలసిందని కూడా ఆదేశించాడు. ‘ఔరా! అల్పుడా! ఆమె సదా కుశలమే! నీ కన్నుపడ్డాకనే, ఆమె కుశలానికి దూరమైంది. మేము ఎటూ ఆమె సంక్షేమం చూస్తూనే ఉన్నాం! నువ్వు ఏదో ఇప్పుడు కొత్తగా మాకేం ఆజ్ఞ లివ్వనక్కర్లేదు. అల్పునికి అధికారం అప్పగించాం చూడు! మేం చేసిన అపరాధం అదీ! దుర్మర్గుడా! దేవేంద్రుని జాడ కనుగొనడం ఇన్నాళ్ళుగా మా వశం కాలేదు. నీ మానవానుచరుల వల్ల అయ్యేదేనా? ఏదైతే అది అయిందిలే! నీకు రోజులు దగ్గర కొచ్చాయి. మా ప్రయత్నాలు మేమూ చేస్తున్నాం! అవి ఫలించి మేమే దేవేంద్రుని కనుక్కోగలిగితే, నీ పని హుళక్కే” అనుకుంటూ ఇంటిదారి పట్టారు అందరూ.

నారాయణుని ఉపదేశం

నహుష చక్రవర్తి సదనం నుంచి అలా బయటపడిన దేవతలంతా వైకుంఠానికి పోయి శ్రీమన్నారాయణుని సందర్శించి, విష్ణువును పలువిధాల స్తుతించారు. బ్రహ్మ హత్యాపాతకానికి వెరచి అతడెటకో కానరాని చోటకు నిష్క్రమించాడని వివరించారు. అసలానాడు ఇంద్రుడు నువ్విచ్చిన సలహా ప్రకారమే చేశాడు గాని, స్వతంత్రించి చేశాడా? ధర్మ సూక్ష్మాలు మాకు అర్థంకానివైపోయాయి. ఏది ఏమైనా మాకందరికీ దిక్కు నీవే వాసుదేవా! అంటూ మొరపెట్టుకున్నారు. చిద్విలాసంగా దేవతలందర్నీ చూశాడు శ్రీహరి.

“నిజమే! సూక్ష్మాతి సూక్ష్మ ధర్మ రహస్యాలు అందరికీ అర్థంకావు. అవి అలా ఉంచండి! ఏదోలా దేవేంద్రుని జాడ నేను కనుక్కుంటాను. మీరా పాకశాసనునిచేత అశ్వమేధ యాగం చేయించండి. ఆ హయమేధం వల్ల జగదాంబ ప్రీతిపాత్రురాలు కాగలదు” అని ఊరడించి, దేవేంద్రునికి బ్రహ్మహత్యాదోషం తొలగిపోగల మార్గం ఉపదేశించాడు.


దేవతలకు దేవేంద్రుడు కనిపించే మార్గం సుగమం చేశాడు. అవిశ్రాంతంగా వెతుకుతూన్న దేవతలకు, ఎట్టకేలకు దేవేంద్రుడొక తామరతూడులో దాగుకొని కనిపించాడు. అటుపైన క్షణమైనా ఆలసించక విష్ణుదేవుని పలుకులను అతనికి వినిపించి హయమేధం సాంగోపాంగంగా నిర్వహింపజేశారు. దీనితో అతడు తిరిగి పవిత్రుడైనాడు. ఎప్పటిలాగానే తన తేజస్సుతో ఉజ్వలంగా ప్రకాశించసాగాడు. కాని స్వర్గంలో నహుషుడో ఇంద్రుడిలా వెలిగిపోతూండడంతో – ‘ఒక వొరలో రెండు కత్తులు ఇమడవన్న’ సామెత ప్రకారం స్వర్గానికి వెళ్ళలేక ఆ తామర తూడునే నివాసంగా మల్చుకొని అక్కడే ఉండసాగాడు. తాము నిర్వర్తించాల్సినట్టి కార్యం నెరవేరినందున దేవతలు ఆనందంతో, అమరపురిని చేరారు.

No comments:

Post a Comment