Sunday, December 8, 2013

గణేశ్ మహరాజ్ కీ జై

హిందువులు ఏ కార్యక్రమం తలపెట్టినా తొలిసారిగా పూజించేది విఘ్నాధిపతి విఘ్నేశ్వరునే. మొట్టమొదటగా మనం స్మరించేది కూడా ఆయన్నే. పూర్ణకుంభం లాంటి ఆ దేహం, బాన వంటి కడుపు, పరిపూర్ణమైన ఈ జగత్తుకు గుర్తు. ఏనుగు తల, సన్నని కళ్ళు, మేధకు సంకేతాలు. వక్రతుండం ఓంకార ప్రణవ నాదానికి ప్రతీక. ఏనుగు లాంటి ఆకారాన్ని మోస్తున్నది ఒక చిన్న ఎలుక. అదే ఆత్మలోని చమత్కారం. ఆయన పొట్టను చుట్టి ఉండే నాగం (పాము) శక్తికి సంకేతం. నాలుగు చేతులు మానవాతీత సామర్ధ్యాలకు, తత్వానికి సంకేతం. చేతిలో ఉన్న పాశ, అంకుశాలు బుద్ధి, మనసులను సన్మార్గంలో నడిపించే సాధనాలకు ప్రతీకలు. మరో చేతిలో కనిపించే దంతం ఆయనదే.

వ్యాస భగవానుడు మహాభారతం రాయాలని సంకల్పించినప్పుడు తన దంతాన్నే విరిచి ఘంటంగా మార్చాడు వినాయకుడు. ఇదంతా విజ్ఞానం కోసం చేయవలసిన కృషికి, త్యాగానికి సంకేతం. మరొక చేతిలో మోదకం – ఉండ్రాయి ఉంటుంది. కొందరి ప్రకారం అది వెలగ కాయ. భక్తులు తక్కిన దేవతల ఎదుట తప్పులు చేసి ఉంటే క్షమించమని చెంపలు వేసుకుంటారు కానీ, వినాయకుని ఎదుట గుంజీలు తీయాలి. ఇలా ఎన్నో ప్రత్యేకతలు, నిగూఢ సంకేతాలు ఉన్న అధినాయకుడే మన వినాయకుడు.

కార్తవీర్యుని వధించిన అనంతరం పరశురాముడు తన గురువైన పరమశివుణ్ణి దర్శించుకోవాలని కైలాసం వెళ్ళాడు. ఆ సమయానికి శివపార్వతులు ఏకాంతంలో ఉన్నారు. బయట కాపలా కాస్తున్న గణపతి పరశురాముడిని లోనికి వెళ్ళకుండా అడ్డుకున్నాడు. పరశురాముడు ధిక్కరించడంతో గణేశుడు తన తొండంతో ఆయనను పైకెత్తి పడేశాడు. ఆగ్రహించిన పరశురాముడు తన చేతిలోని గండ్రగొడ్డలిని గణపతిపై ప్రయోగించడంతో ఒక దంతం ఊడి పడింది. ఆ చప్పుడుకు ఉలిక్కిపడిన పార్వతీ పరమేశ్వరులు బయటకు వచ్చారు. నెత్తురోడుతున్న బాలగణపతిని పార్వతి ఎత్తుకొని పరశురాముడిని తీవ్రంగా మందలించింది. తన వల్ల జరిగిన అపరాధాన్ని మన్నించమని పరశురాముడు వేడుకున్నాడు. ఒక దంతం పోగొట్టుకున్న ఆ నాటి నుంచి గణపతి ఏకదంతుడుగా పేరు పొందాడు.

విఘ్నేశ్వర కథ :
  సూత మహాముని శౌనకాది మునులకు విఘ్నేశ్వరోత్పత్తి, చంద్రదర్శన దోషకారణం దాని నివారణ చెప్పాడు. పూర్వం గజరూపం గల రాక్షసుడు శివుని గురించి ఘోర తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. గజాసురుండు పరమేశ్వరుని స్తుతించి, స్వామీ! నీవెల్లప్పుడు నా పొట్టలోనే ఉండాలని కోరాడు. భక్త సులభుడైన పరమేశ్వరుడు ఆతని కోర్కె దీర్చేందుకు గజాసురుని పొట్టలో ప్రవేశించి సుఖంగా ఉన్నాడు.

కైలాసంలో పార్వతీదేవి భర్త జాడ తెలియక అనేత చోట్ల అన్వేషిస్తూ కొంత కాలానికి గజాసురుని గర్భంలో శివుడు ఉన్నట్లు తెలుసుకొని రప్పించుకొనే మార్గం తెలియక పరితపిస్తూ విష్ణుమూర్తిని ప్రార్ధించింది. తన పతి విషయం చెప్పి, ‘మహాత్మా! నీవు పూర్వం భస్మాసురుని బారి నుండి నా పతిని రక్షించి నాకు ఇచ్చావు. ఇప్పుడు కూడ ఏదో ఒక ఉపాయంతో నా పతిని రక్షించు’ అని విలపించింది. శ్రీహరి పార్వతిని ఊరడించి పంపాడు. హరి బ్రహ్మాది దేవతలను పిలిపించి, గజాసుర సంహారానికి గంగిరెద్దు మేళమే మేవని నిశ్చయించి, నందిని గంగిరెద్దుగా అలంకరించి, బ్రహ్మాది దేవతల చేత కూడా తలొక వాద్యాన్ని ధరింపజేసి, తానూ చిరుగంటలు, సన్నాయిలు తీసుకొని గజాసుర పురానికి వెళ్ళాడు.


గంగిరెద్దును బ్రహ్మాండంగా ఆడిస్తుండగా గజాసురుండు విని వారిని తన వద్దకు పిలిపించుకున్నాడు. తన భవనం వద్ద కూడా గంగిరెద్దును ఆడించాలని ఆజ్ఞాపించాడు. బ్రహ్మాది దేవతలు వాద్యాలను పోటీ పడి మరీ గజాసురుణ్ణి ఆనందింపచేశారు. జగన్నాటక సూత్రధారి అయిన శ్రీహరి చిత్ర విచిత్రంగా గంగిరెద్దును ఆడించాడు. గజాసురుడు ఆనందంతో ‘మీకేమి కావాలో కోరుకోండి ఇస్తాను’ అన్నాడు. హరి వాని వద్దకు వెళ్ళి, ‘ఇది శివుని వాహనం నంది ‘, శివుని వెదికేందుకు వచ్చింది. కాబట్టి శివుని ఇచ్చివేయి’ అన్నాడు. ఆ మాటలకు గజాసురుడు నివ్వెరపోయి, అతనిని రాక్షసాంతకుడైన శ్రీహరిగా గుర్తించి, తనకు మరణమే నిశ్చయం అనుకొని తన గర్భంలో ఉన్న పరమేశ్వరుని ‘నా శిరస్సు త్రిలోక పూజ్యంగా చేసి, నా చర్మం నీవు ధరించు’ అ ప్రార్ధించి విష్ణుమూర్తికి అంగీకారం దెలిపాడు. నందిని ప్రేరేపించాడు. నంది తన కొమ్ముతో గజాసురుని పొట్టలను చీల్చి సంహరించింది. శివుడు గజాసుర గర్భం నుండి బయటికి వచ్చి విష్ణుమూర్తిని ప్రార్థించాడు. ‘దుష్టాత్ములకు ఇలాంటి వరాలు ఇవ్వకూడదు. ఇస్తే పాముకు పాలు పోసినట్లు అవుతుంద’ని ఉపదేశించి బ్రహ్మ ఇతర దేవతలను వీడ్కోలు పలికి తాను వైకుంఠానికి వెళ్ళాడు. శివుడు నందిని ఎక్కి కైలాసానికి వేగంగా వెళ్ళాడు.వినాయక జననం :
భర్త శంకరుడు వస్తున్న విషయం కైలాసంలో పార్వతీదేవి విని సంతోషంతో అభ్యంగన స్నానం చేస్తూ నలుగుపిండిని ఒక బాలునిగా చేసి, ప్రాణం పోసి, వాకిలి ద్వారం వద్ద కాపలా ఉంచింది. స్నానానంతరం పార్వతి సర్వాభరణాలు అలంకరించుకొంటూ పతి రాక కోసం నిరీక్షిస్తోంది. అపుడు పరమేశ్వరుడు లోపలికి వెళ్ళబోగా వాకిలి ద్వారం ఉన్న బాలుడు అడ్డగించాడు. శివుడు కోపించి త్రిశూలంతో బాలుని కంఠం నరికి లోనికి వెళ్ళాడు.
భర్తను చూసిన పార్వతీదేవి ఎదురెళ్ళి, అర్ఘ్య పాద్యాదులతో పూజించింది. వారిరువురూ ఆనందంతో ముచ్చటించుకుంటుండగా గుమ్మం వద్ద బాలుని సంహరించిన విషయం ప్రస్తావనకు వచ్చింది. తాను చేసిన పనికి చింతించి, తన వెంట తెచ్చిన గజాసుర శిరస్తును బాలునికి అతికించి ప్రాణంబ పోసి, ‘గజాననుడు’ అని పేరుపెట్టాడు. అతనిని పుత్ర ప్రేమతో ఉమామహేశ్వరులు పెంచుకొంటున్నారు. గజాననుడు తల్లిదండ్రులను పరమ భక్తితో సేవిస్తున్నాడు. తాను సులభంగా ఎక్కి తిరిగేందుకు అనింద్యుడు అనే ఒక ఎలుక రాజును వాహనంగా చేసుకొన్నాడు.

కొంతకాలానికి పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి పుట్టాడు. అతడు మహా బలశాలి. అతని వాహనం నెమలి. అతడు దేవతల సేనా నాయకుడై ప్రసిద్ధి చెందాడు.

వినాయకుని ఆధిపత్యం :
ఒకనాడు దేవతలు, మునులు పరమేశ్వరుని సేవిస్తూ విఘ్నాలకు ఒకరిని అధిపతిగా తమకు ఇవ్వాలని కోరారు. గజాననుడు తాను జ్యేష్ఠుడు కనుక ఆ ఆధిపత్యం తన ఇవ్వాలని, ‘గజాననుడు మరుగుజ్జు, అనర్హుడు, అసమర్ధుడు గనుక ఆధిపత్యం తనకే కావాలని’ కుమారస్వామి తండ్రిని వేడుకొన్నారు.
‘మీలో ఎవ్వరు ముల్లోకాల్లోని పుణ్య నదుల్లో స్నానంచేసి ముందుగా నా ముందుకు వస్తారో, వారికే ఆధిపత్యం ఇస్తా’నని చెప్పాడు. దీనికి సమ్మతించి కుమారస్వామి నెమలి వాహహనం ఎక్కి వాయు వేగంతో వెళ్ళాడు. అంత గజాననుడు చిన్నబోయి, తండ్రి దగ్గరకు వెళ్ళి, ప్రణామం చేసి ‘అయ్యా! నా అసమర్ధత తెలిసి కూడా ఇలా చెప్పడం భావ్యమా! మీ పాద సేవకుడను. నన్ను కటాక్షించి ఉపాయం చెప్పి రక్షించు’ అని ప్రార్ధించాడు. మహేశ్వరుడు దయాళుడై, ‘సకృత్ నారాయణేత్యుక్త్వా పుమాన్ కల్ప శతత్రయం గంగాది సర్వ తీర్దేషు స్నాతో భవతి పుత్రక ‘ – కుమారా! ఒకసారి ‘నారాయణ మంత్రం పటించు’ అనగా, గజాననుడు సంతసించి, అత్యంత భక్తితో ఆ మంత్రం జపిస్తూ కైలాసంలో ఉన్నాడు.
మంత్ర ప్రభావంతో అంతకు పూర్వం గంగానదికి స్నానానికి వెళ్ళిన కుమారస్వామికి గజాననుడు నదిలో స్నానమాడి ఎదురుగా వస్తున్నట్లు కనిపించింది. ఇలా మూడు కోట్ల యాభై లక్షల నదులలోనూ అలాగే చూచి కుమారస్వామి ఆశ్చర్యపోయాడు. కైలాసానికి తిరిగి వచ్చి తండ్రి సమీపంలో ఉన్న గజాననుని చూసి, నమస్కరించి, తన బలాన్ని నిందించుకుని, ‘తండ్రీ! అన్నగారి మహిమ తెలియక అలా అన్నాను, క్షమించు. ఈ ఆధిపత్యం అన్నగారికే ఇవ్వండ’ ని ప్రార్ధించాడు.
అనంతరం భాద్రపద శుద్ధ చతుర్ధి నాడు గజాననునికి విఘ్నాధిపత్యాన్ని శివుడు ఇచ్చాడు. ఆనాడు అన్ని దేశాల వారూ విఘ్నేశ్వరునికి తమ శక్తి కొద్దీ కుడుములు, అపూపములు తదితర పిండివంటలు, టెంకాయలు, పాలు, తేనె, అరటిపండ్లు, పానకం, వడపప్పు సమర్పించి పూజించారు. విఘ్నేశ్వరుడు సంతోషించి కుడుములు ఇతర పదార్థాలు తిని, కొన్ని వాహనానికి పెట్టి, కొన్ని చేతిలో పట్టుకొని మెల్లగా సూర్యాస్తమయం వేళకు కైలాసానికి వెళ్ళి తల్లిదండ్రులకు ప్రణామం చేయబోయాడు. పొట్ట భూమికి ఆనితే చేతులు భూమికి అందడంలేదు. బలవంతంబగా చేతులానిస్తే కాళ్ళు ఆకాశాన్ని జూస్తున్నాయి. ఇలా దండప్రణామం చేయడానికి వినాయకుడు ఎంతో శ్రమపడుతుండగా, శివుని శిరస్సుపైన ఉన్న చంద్రుడు చూసి వికటంగా నవ్వాడు. రాజు దృష్టి సోకితే రాళ్లు కూడా నుగ్గవుతాయన్న సామెత నిజమైననట్లు విఘ్నదేవుని పొట్ట పగిలి, అందులోని కుడుములు బయటపడ్డాయి. వినాయకుడు కూడా మరణించాడు. పార్వతి శోకిస్తూ చంద్రుని జూచి, ‘పాపాత్ముడా! నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించాడు. కనుక నిన్ను చూసిన వారు పాపాత్ములై నీలాపనిందలు పొందుతారు’ అని శపించించింది.

ఋషిపత్నులకు నీలాపనిందలు :
ఆ సమయంలో సప్త మహర్షులు యజ్ఞం చేస్తూ తమ భార్యలతో ప్రదక్షిణం చేస్తున్నారు. అగ్నిదేవుడు ఋషిపత్నులను చూచి మోహించి, శాప భయంతో అశక్తుడై క్షీణిస్తుండగా, అది అగ్ని భార్య స్వాహాదేవి గ్రహించి, అరుంధతీ రూపం తప్ప తక్కిన ఋషిపత్నుల రూపం తానే దాల్చి పతికి ప్రియం చేసింది. అగ్నిదేవునితో ఉన్న వారు తమ భార్యలే అని ఋషులు శంకించి తమ భార్యలను విడిచిపెట్టారు. పార్వతీ శాపానంతరం ఋషిపత్నులు చంద్రుని చూడడం వల్ల వారికి అలాంటి నీలాపనింద వచ్చింది.
దేవతలు, మునులు ఋషిపత్నుల ఆపద పరమేష్ఠికి తెలిపారు. ఆతడు సర్వజ్ఞుడు అయినందున అగ్నిహొత్రుని భార్యే ఋషిపత్నుల రూపంలో వచ్చారని తెలిపి సప్తఋషులను సమాధానపరిచాడు. వారితో కూడా బ్రహ్మ కైలాసానికి వెళ్ళి, ఉమామహేశ్వరులను సేవించి మృతుడై పడి ఉన్న విఘ్నేశ్వరుని బ్రతికించి సంతోషం కలిగించాడు.
‘ఓ పార్వతీ దేవీ! నీ శాపం వల్ల లోకాలన్నింటికీ కీడు వాటిల్లుతోంది, దానిని ఉపసంహరింపు’మని దేవాదులు ప్రార్ధించారు. దీనితో పార్వతి సంతోసించి, ‘ఏ దినం విఘ్నేశ్వరుని చూచి చంద్రుడు నవ్వాడో ఆ రోజున చంద్రుని చూడరాదని శాపావకాశం ఇచ్చింది. బ్రహ్మాదులు సంతోసించి తమ ఇళ్ళకు వెళ్ళి, భాద్రపద శుద్ధ చతుర్ధినాడు మాత్రం చంద్రుని చూడకుండా జాగ్రత్తగా ఉన్నారు.
శమంతక ఉపాఖ్యానం :
ద్వాపర యుగంలో ద్వారకలో నివసించే శ్రీకృష్ణుని నారదుడు దర్శించి, స్తుతించి సంతోషంగా మాట్లాడుతూ, ‘స్వామీ! సాయం సమయం అయింది. ఈనాడు వినాయక చతుర్ధి. పార్వతీదేవి శాపంతో చంద్రుని చూడకూడదు. కను నా ఇంటికి వెళతాను అనుమతి ఇవ్వండి!’ అని పూర్వ వృత్తాంతం అంతా శ్రీకృష్ణునికి తెలిపి, నారదుడు స్వర్గలోకానికి వెళ్ళాడు.
శ్రీకృష్ణుడు ఆనాటి రాత్రి చంద్రుని ఎవ్వరూ చూడరాదని పురంలో చాటింపు వేయించాడు. శ్రీకృష్ణుడు క్షీర ప్రియుడు కనుక తాను ఆకాశం వైపు చూడకుండా గోశాలకు వెళ్ళి పాలు పితుకుతూ, పాలలో చంద్రుని ప్రతిబింబాన్ని చూశాడు. ‘ఆహా! ఇక నాకు ఎలాంటి యపనింద రానున్నదో’ అని సంశయంతో ఉన్నాడు. కొన్నాళ్లకు సత్రాజిత్తు అనే రాజు సూర్య వరంతో శమంతకమణిని సంపాదించి, ద్వారకా పట్టణానికి శ్రీకృష్ణుని దర్శించేందుకు వచ్చాడు. శ్రీకృష్ణుడు అతనిని మర్యాద చేసి, ‘ఆ మణిని మన రాజుకకు ‘ ఇమ్మన్నాడు. అత ‘డది రోజుకు ఎనిమిది బారువుల బంగారం ఇచ్చేదని చెప్పాడు. ఇలాంటి మణిని ఎలాంటి బుద్ధిహీనుడైనా ఇవ్వ’డన్నాడు.


ఒకనాడు సత్తాజిత్తు తమ్ముడు ప్రసేనుడూ ఆ మణిని కంఠానికి ధరించుకొని వేట కోసం అడవికి వెళ్ళాడు. ఒక సింహం ఆ మణిని మాంసంముక్క అని భ్రమించి, ప్రసేనుణ్ణి చంపి ఆ మణిని తీసుకుపోతుండగా, ఒక భల్లూకం ఆ సింగాన్ని హతమార్చి మణిని తీసుకొని తమ కుమార్తెకు ఆట వస్తువుగా ఇచ్చింది. మరుసటి రోజు సత్రాజిత్తు తమ్ముని మరణ వార్త విని ‘మణి ఇవ్వలేదని కృష్ణుడే నా సోదరుని చంపి, రత్నాన్ని అపహరించాడనిని నగరంలో చాటించాడు. శ్రీకృష్ణుడు అది విని పాలలో చంద్రబింబాన్ని చూసిన దోష ఫలం అని భావించాడు. ఈ అపవాదను తొలగించుకునేందుకు బంధువులతో కలిసి అరణ్యానికి వెళ్ళి వెదికాడు. ఒకచోట ప్రసేన కళేబరం, సింగం కాలి జాడలు పిదప భల్లూకం కాలి గుర్తులు కనిపించాయి.ఆ దారిన వెళుతుండగా ఒక పర్వతగుహ ద్వారం చూసి, పరివారాన్ని అక్కడ విడిచి కృష్ణుడు గుహ లోపలికి వెళ్ళి అక్కడ బాలిక ఉయ్యాలపై కట్టి ఉన్న మణిని చూసి అక్కడికి వెళ్ళి, ఆ మణి చేతితో తీసుకొని వస్తుండగా, ఉయ్యాలలోని బాలిక ఏడ్వడం ప్రారంభించింది. దీనితో దాది చూసి వింత మనిషి వచ్చాడనుకొని కేకలు వేసింది.జాంబవంతుడు ఆగ్రహోదగ్రుడై వచ్చి శ్రీకృష్ణునిపై బడి అరుస్తూ, గోళ్ళతో గుచ్చుతూ, కోరలతో కొరుకుతూ, ఘోరంగా యుద్ధం చేశాడు. శ్రీకృష్ణుడు వానిని పడతోసి, వృక్షాలతో రాళ్లతో, చివరికి ముష్టిఘాతాలతో రాత్రింబవళ్లు ఎడతెగక ఇరువై ఎనిమిది రోజులు యుద్ధం చేశారు. జాంబవంతుడు బలం క్షీణించి శరీరం మొత్తం బాధలు వచ్చి భయంతో తన బలాన్ని హరించిన పురుషుడు రావణ సంహారి శ్రీరామచంద్రుడే అని తలచి, అంజలి ఘటించి, ‘దేవాది దేవా! ఆర్త జన పోషా! భక్తజన రక్షా! నిన్ను శ్రీరామచంద్రునిగా తెలుసుకున్నాను. ఆ కాలంలో నా మీద వాత్సల్యం చేత నన్ను వరం కోరుకోమనగా నా బుద్ధిమాంద్యంతో ద్వంద్వయుద్ధం చేయాలని కోరుకున్నాను. తరువాత అది జరుగుతుందని చెప్పారు. ఇప్పుడు నా కోరిక నెరవేర్చారు. నా శరీరమంతా శిథిలమైంది. ప్రాణాలు కడబట్టాయి. జీవితం మీద కోరిక నశించింది. నా అపరాధాలు క్షమించి కాపాడుమని ప్రార్ధించాడు. శ్రీకృష్ణుడు దయాళుడై, జాంబవంతుని శరీరమంతా తన చేతితో నిమిరి భయం తొలగించి, ‘భల్లూకేశ్వరా! శమంతకమణిని అపహరించినట్లు నాపై ఆరోపించిన అపనింద బాపుకొనేందుకు ఇలా వచ్చానని, మణిని ఇవ్వు. నేను వెళతానన్నాడు. జాంబవంతుడు శ్రీకృష్ణునికి మణితో పాటు తమ కుమార్తె జాంబవతిని కూడా కానుకగా ఇచ్చాడు. తన ఆలస్యానికి పరితపిస్తూ బంధు మిత్ర సైన్యాలకు ఆనందం కలిగించి, కన్యారత్నంతో, మణితో శ్రీకృష్ణుడు పురం చేరి సత్రాజిత్తును పిలిపించి, పిన్న పెద్దలందరికకీ విషయం అంతా చెప్పాడు. శమంతకమణిని సత్రాజిత్తుకు అందజేశాడు. ‘అయ్యో! లేనిపోని నింద మోపి తప్పు చేశానని’ మణి సహితంగా తన కూతురు సత్యభామను భార్యగా సమర్పించి, తప్పు క్షమించమని వేడుకొన్నాడు. శ్రీకృష్ణుడు సత్యభామను తీసుకొని మణి వద్దని మరలా ఇచ్చాడు. శ్రీకృష్ణుడు శుభ ముహూర్తంలో జాంబవతీ సత్యభామలను పెళ్ళి చేసుకొన్నాడు. అక్కడికి వచ్చిన దేవాదులు, మునులు స్తుతించి, ‘మీరు సమర్ధులు గనుక నీలాపనింద బాపుకున్నారు. మాకేమి గతి’ అని ప్రార్ధించారు. శ్రీకృష్ణుడు దయాళుడై, ‘భాద్రపద శుద్ధ చతుర్ధిని పొరపాటున చంద్రు దర్శిస్తే ఆనాడు గణపతిని యథావిధిగా పూజించి, ఈ శమంతక మణి కథను విని అక్షింతలు శిరస్సుపై చల్లుకొంటే నీలాపనింద పొందరని తెలిపాడు. దేవాదులు సంతోసించి తమ నివాసాలకు వెళ్ళారు. ఇలా సూత మునీంద్రుడు గణాధిపతి శాపమోక్షం విషయాలను శౌనకాది మునులకు వినిపించి వారిని వీడ్కొని సొంత ఆశ్రమానికి వెళ్ళాడు.



No comments:

Post a Comment