Friday, December 13, 2013

సంధ్యావందనం

గాయత్రి వేదమంత్రములన్నిటికీ తల్లి. ఈ మంత్రంఎనిమిదేసి అక్షరాలతో కూడిన మూడు పాదములు అంటే మొత్తం ఇరవై నాల్గు అక్షరములతో కూడినది. అందుకే దీనిని ‘‘త్రిపదగాయత్రీ’’ అంటారు. ఒక్కొక్కపాదం ఒక్కొక్క వేదంయొక్క సారం. అధర్వణ వేదమునకు వేరే గాయత్రి ఉన్నది. ఆ గాయత్రిని పొందడానికి ప్రత్యేకంగా వేరే ఉపనయనము చేసుకోవలసి ఉన్నది. ఈ త్రిపదా గాయత్రి ఋగ్యజస్సామ వేదముల సారము.

గాయత్రిని మూడు తరాలబాటు జపించడం మానివేసిన బ్రాహ్మణ కుటుంబం కులాన్ని కోల్పోతుంది. అట్టి కుటుంబం నివసించే ప్రదేశాన్ని అగ్రహారమని పిలవరాదు. గాయత్రిని వదిలి మూడు తరాలయినట్లు లేదు. ఇంకా అందరూ బ్రాహ్మణులుగా పిలవబడుతున్నారు. మూడు తరములు యజ్ఞం చేయకపోతే దౌర్బాహ్మణ్యం వస్తుందని శాస్త్రం. పతితుడైనా బ్రాహ్మణుడన్న పేరు పోలేదు. మళ్ళీ ప్రాయశ్చిత్తాదులు చేసుకొని, యజ్ఞాలు చేసి సద్బ్రాహ్మణుడవచ్చు.

గాయత్రి విషయమలా కాదు. మూడు తరములు గాయత్రిని జపించనివారికి తిరిగి బ్రాహ్మణులయ్యే అవకాశమే లేదు. వారు బ్రహ్మ బంధువులు మాత్రమే. ఇదే నియమం క్షత్రియ వైశ్యులకు కూడా వర్తిస్తుంది. ఎంత అనాచారమొచ్చిపడినా ఇంకా గాయత్రి అనే అగ్నికణం నివురుగప్పి మిణుకుమంటూనే ఉన్నది. ఆ నిప్పురవ్వను అలానే వదిలేస్తే ప్రయోజనము ఉండదు. దానిని పరిరక్షించి వృద్ధిచేస్తే, మహాగ్నిజ్వాలగా పరిణతి చెంది మనలను సంరక్షించుతుంది. అట్టి శక్తి దానికున్నది. ఆ పెన్నిధిని కాపాడుకొనే బాధ్యత మనకున్నది. ఆదివారాలైనా యజ్ఞోపవీతధారులందరూ సహస్ర గాయత్రీ జపం చేయాలి. ఆ గాయత్రీ జ్వాల ప్రకాశవంతంగా ఉండటానికి శౌచనియమాలను పాటించాలి. అశౌచమైన జనం అశౌచమైన ప్రదేశాలకు పోవడం వంటివి పరిహరించాలి. కర్మలోప ప్రాయశ్చిత్తం చేసుకొని కర్మిష్ఠులమయి కర్మశుద్ధంగా ఉండేట్లు జాగ్రత్తపడాలి. శరీరాన్ని మనస్సును పరిశుద్ధంగా ఉంచుకొన్నప్పుడే మంత్రశక్తి పెంపొందడానికి అనువుగా వుంటుంది. ఎంతటి కష్టకాలంలోనైనా సరే గాయత్రిని కనీసం పదిసార్లైనా జపించాలి.

 మూడు సంధ్యాకాలాల్లోనూ సంధ్యావందనం చేయవలసి ఉన్నది. ఉదయ సంధ్యలో జీవులన్నీ నిద్రలేస్తాయి. మనస్సు ప్రశాంతంగా ఉండి ఏకాగ్రతకు అనువుగా ఉంటుంది. సాయంకాలం జీవులు అంతా పడిన శ్రమ తరువాత ఇల్లు చేరి ప్రశాంతతను పొందుతాయి. సూర్యుడు నడినెత్తిన చేరిన సమయంలో ప్రకృతి నిశ్శబ్దంగా ఉంటుంది. ఈ సమయాలలో శాంతంగా వరుసగా గాయత్రి, సావిత్రి, సరస్వతీ దేవతలను ధ్యానించాలి.

ఉదయం విష్ణుప్రధానమైనది. మధ్యాహ్నం బ్రహ్మస్వరూపిణిగానూ, సాయంత్రం శివస్వరూపిణిగాను గాయత్రిని ధ్యానించాలి. ఈ మూడు కలిసి సమష్టి గాయత్రి. గాయత్రి అన్ని వైదిక మంత్రముల శక్తులను కలిగి ఉన్నది. ఇది మిగతా మంత్రములకు శక్తినిస్తుంది. గాయత్రీ అనుష్ఠానం చేయకుండా మరి ఏ ఇతర మంత్రముల జపం చేసినా అవి పూర్ణ్ఫలితాన్నీయజాలవు. సంధ్యావందనములో గాయత్రీ జపము, అర్ఘప్రదానము ముఖ్యమైనవి. మిగతావన్నీ అంగాలు. లేవలేని స్థితిలో కూడా కనీసం అర్ఘ్యత్రయ ప్రదానం, గాయత్రీ జపం (కనీసం పదిసార్లయినా) వదలకూడదు. ఈ రెండే ముఖ్యమైనవి కాబట్టి, మిగతావి వదిలేస్తే కాలక్రమంలో ఈ రెండూ కూడా వదిలేస్తాము. ప్రముఖ విద్వాంసులొకరు.

 సంధ్యావందనం విధివత్తుగా సకాలంలో చేయాలి. మహాభారత యుద్ధంలో సంధ్యాకాలంలో యుద్ధంలో ఉండవలసి వచ్చిన వీరులు, సకాలంలో మన్నుతో అర్ఘ్యమిచ్చారని చెప్పబడి ఉంది. ఒకరికి విపరీతమైన జ్వరం కాస్తే, అతనికి పరిచర్య చేసేవారు అతని తరపున సంధ్యావందనం చేసి ఆ జలం అతనికి తీర్థంగా ఈయాలి. రోగి తాను సంధ్యవార్చలేని సందర్భంలో ఎవరికైనా తన తరఫున సంధ్యావందనం చేసి తీర్థమివ్వమని అర్థించాలి. ఆఫీసులకు వెళ్ళేవారికి కూడా ప్రాతః సాయంకాలములు సంధ్యావందనము చేయడం ఇబ్బంది కాదు. మధ్యాహ్నిక సంధ్యావందనం ఆఫీసులో ఉండటంవలన ముఖ్యకాలంలో చేయలేకపోతే సూర్యోదయమునకు 2 గం 24 నిల తరువాత చేయవచ్చు. దానిని సంగమ కాలమంటారు.

No comments:

Post a Comment