Wednesday, December 11, 2013

నవరాత్రి ఉత్సవాలు ఎందుకు జరపాలి!?

దసరా అంటే దన్+హరా అని; అంటే సీతాపహరణ గావించిన రావణాసురుని శ్రీరాముడు పదితలలను నరికి సంహరించిన సందర్భంగా జరుపుకునే విజయోత్సవంగా కూడా దీనిని వ్యవహరిస్తూ ఉంటారు. సరిగా వానిని ఆశ్వీయుజమాసం నవమి తిధినాడు సంహరించినాడు. అందువల్ల దీనిని “దసరా వైభవం” గా దశమినాడు జరుపుతూ ఉంటారు.

ఇక దేవినవరాత్రి పూజలు చేయుట, అనునది అనాదికాలంగా వస్తున్న శాస్త్రవిధి. “అశ్వనీ” నక్షత్రంలో కలసివచ్చిన పూర్ణిమమాసమే “ఆశ్వీయుజమాసం” అవుతుంది. ఈ మాసమందు ‘దేవీనవరాత్రుల’ను శరన్నవరాత్రులని పిలుస్తూ శుద్ధపాడ్యమి తిథితో ప్రారంభించి తొమ్మిది రోజులు ఈ నవరాత్రులు వైభవంగా చేస్తారు.

ప్రథమాశైలపుత్రి, ద్వితీయా బ్రహ్మచారిణీ 
తృతీయాచంద్రఘంటీతి, కూష్మాండేతి చతుర్థికీ 
పంచమా స్కందమాతేతి షష్టాకాత్యాయనేతి చ
సప్తమా కాళరాత్రిచ అష్టమాచాతి భైరవీ
నవమా సర్వసిద్ధిశ్చాత్ నవదుర్గా ప్రకీర్తితా.

మూర్తులు వేరైనా మూలపుటమ్మ ఒకరే! అలంకారాలు వేరైనా అమ్మదయ అందరిపట్ల ఒకటే! హిందువులు అత్యంత ప్రీతిపాత్రంగా ఎంతో వైభవంగా నిర్వహించే పండుగలలో ఈ “దసరావైభవం” ఒకటి. ఇది పదిరోజులు పండుగ అయినప్పటికి దేవిని రోజుకో అవతారంగా అలంకరించి అమ్మవారికి అర్చనలుచేసి, నవవిధ పిండివంటలతో నివేదనలుచేస్తూ విశేష పూజలతో పాటు శ్రీలలితా సహస్రనామ పారాయణ నిత్యము గావిస్తూ “శరన్నవరాత్రులు” గా వ్యవహరిస్తారు. శ్రవణానక్షత్రయుక్త ‘దశమి’ తిథిన విజయదశమితో ఈ దసరావైభవాలు పూర్తిచేస్తారు. దసరాకు మరోపేరు “దశహరా” అంటే! పది పాపాలను హరించేది అని అర్థం చెప్తారు దైవజ్ఞలు.


ఈ దేవి నవరాత్ర్యుత్సవాలు జరపడంల్లోకూడా మంచి అంతరార్థం ఉన్నదట! శరదృతువుకు ముందు వర్షరుతువు ఉంటుంది. బహుళంగా కురిసిన వానలవల్ల, చీమలు, దోమలు, కీటకాలు పెరుగుతాయి. ఈ ఋతువులో ప్రజలు రోగబాధలతో మరింతగా బాధపడుతూ ఉంటారు. వీటికి “యమదంష్ట్రము”లని పేరు. దేవి మహిషాదిజంతువులను జయించడంల్లో అంతరార్థమిదే అని దేవీభాగవతం చెప్తోంది. కావున ఆరోగ్య ప్రాప్తికి ఈ రెండు రుతువులలోను నవరాత్ర్యుత్సవం జరుపవలెనని పేర్కొంది.

No comments:

Post a Comment