Thursday, January 1, 2015

ఏడు మహా నరకాలు - ఘోర శిక్షలు

నారదుని హితవుపై రవంత చింతించిన రవిసుతుడు ఆ ధనేశ్వరునకు ''ప్రేతపతి'' అనే తన దూతను తోడిచ్చి నరకాన్ని తరింపచేయవలసిందిగా ఆదేశించాడు. దూత , ధనేశ్వరుని తనతో తీసుకు వెళ్తూ మార్గమధ్యం లోని నరక భేదాలను చూపిస్తూ వాటి గురించి ఇలా వినిపించసాగాడు.

తప్తవాలుకం

''ఓ ధనేశ్వరా! మరణించిన వెంటనే పాపకర్ములు ఇక్కడ కాలిన శరీరాలతో దిక్కులు పిక్కటిల్లేలా రోదిస్తూ ఉంటారు. దీన్నే ''తప్త వాలుక నరకం'' అంటారు. అతిథులను పూజించనివారు, గురువులను, అగ్నిని, బ్రాహ్మణులను, గోవులను, వేదవిదులను, యజమానిని, కాళ్ళతో తన్నినవారి పాదాలను యమదూతలు ఎలా కాలుస్తున్నారో చూడు..

అంధతామిత్రం
ఈ నరకంలో సూది మొనల్లాంటి భయకర ముఖాలు కలిగిన పురుగులు, పాపాత్ముల శరీరాలను తొలచివేస్తుంటాయి. ఇది పదహారు రకాలుగా కుక్కలు, గద్దలు, కాకులు మొదలైన పక్షి జంతు సమన్వితమై ఉంటుంది. పరుల రహస్యాల్ని బయటపెట్టే పాపాత్ములందరూ ఈ నరకంలోనే దండించబడుతూ ఉంటారు.
క్రకచం

ఇది మూడో నరకం. ఇక్కడ పాపాత్ములను నిలువుగా, అడ్డంగా, ఏటవాలుగా, సమూలంగా, అంగాంగాలుగా రంపాలతో కోస్తూ ఉంటారు.

అసిపత్రవనం

నరకాలలో నాలుగోది అసిపత్రవనం. భార్యాభర్తలను విడగొట్టే లేదా తల్లిదండ్రుల నుండి వారి సంతానాన్ని ఎడబాటు కలిగించే పాపులు ఈ నరకం చేరి నిలువెల్లా బాణాలతో, అసిపత్రాలతో హింసించబడతారు. రక్తం కారుతుండగా, వెంబడిస్తున్న తోడేళ్ళకు భయపడి శోకాలు తీస్తూ, పరుగులు తీస్తూ ఉంటారు. విపరీతమైన హింస తో కూడిన ఈ నరకం ఆరు రకాలుగా ఉంటుంది.

కూటశాల్మలి
పర స్త్రీలను, పరుల ద్రవ్యాన్ని హరించిన వాళ్ళు, ఇతరత్రా అపకారాలు చేసిన వాళ్ళు ''కూటశాల్మలి'' నరకం చేరతారు. ఇక్కడ 16 రకాలుగా దండిస్తారు.
రక్తపూయం

ఇది ఆరవ నరకం. ఇక్కడ దుర్మార్గులు తలకిందులుగా వేళ్ళాడుతూ యమకింకరులచేత హింసించబడుతుంటారు. తినకూడనివి తిన్నవారు, ఇతరులను నిందించినవారు, చాడీలు చెప్పినవారు ఈ నరకం చేరతారు.

కుంభీపాకం
మొట్టమొదట నీకు విధించబడినది, ఘోరాతిఘోరమైనది, నరకాలన్నిటిలోకీ నికృష్టమైనది కుంభీపాక నరకం. అగ్నికీలలు, దుర్గంధాలతో కూడి ఉంటుంది.
రౌరవం

నరకాలలో ఎనిమిదవది అయిన ఈ రౌరవం దీర్ఘకాలికం. ఇందులో పడినవారు కొన్ని వేల సంవత్సరాల దాకా బయటపడలేరు.

ధనేశ్వరా! మన ప్రమేయం లేకుండా మనకు అంటిన పాపాన్ని శుష్కమని, మనకు మనమై చేసుకున్న పాపాన్ని ఆర్ద్రమని అంటారు. ఆ రెండు రకాల పాపాలు కలిపి ఏడు విధాలుగా ఉన్నాయి. 1. అపకీర్ణం, 2. పాంక్తేయం, 3. మలినీకరణం, 4. జాతిభ్రంశం, 5. ఉపవీతకం, 6. అతిపాతకం, 7. మహాపాతకం
పైన చెప్పిన ఏడు రకాల నరకాల్లో ఆయా పాపాలు చేసినవారు శిక్షలు అనుభవిస్తూ, మగ్గుతున్నారు. కానీ, నువ్వు కార్తీక వ్రతస్తులైన వారి సాంగత్యం ద్వారా అమిత పుణ్యం కలిగిన వాడవు కావడం వల్ల ఈ నరకాలను కేవల దర్శనమాత్రంగానే తరించగలిగావు.
ఇలా చెప్తూ యమదూత అయిన ప్రేతాధిపతి అతన్ని యక్షలోకానికి చేర్చాడు.

అక్కడ అతడు యక్షరూపుడై కుబేరునకు ఆప్తుడై, ధన యక్షుడనే పేరును పొందాడు. విశ్వామిత్రుడు అయోధ్యలో ఏర్పరచిన ధనయక్షతీర్థం ఇతని పేరుమీదనే సుమా. అందువల్ల శ్రీకృష్ణుడు ''సత్యభామా! పాపహారిణి, శోకనాశిని అయిన ఈ కార్తీక వ్రత ప్రభావంవల్ల మానవులు తప్పనిసరిగా మోక్షాన్ని పొందగలరు అనడం ఏమాత్రం అతిశయోక్తి కాదు'' అని సత్యభామకు చెప్పి సాయంసంధ్యానుష్టానార్ధమై స్వీయ గృహానికి వెళ్ళాడని సూతుడు ఋషులకు ప్రవచించాడు.


No comments:

Post a Comment