Thursday, January 1, 2015

శివలింగ విశిష్టత

సంధ్యాద్యనుష్ఠానాలు ముగించుకొని, శివపురాణ శ్రవణానికి విచ్చేసిన శౌనకాది మహర్షులు సూత పౌరాణికుని పరివేష్ఠించి "మహాతత్త్వ విదుడవైన రోమహర్షణా! పౌరాణిక శ్రేష్ఠా! ఎంత తెలిసినట్టు అనిపించినా, ఇంకా ఎంతో కొంత తెలుసుకోదగ్గది మిగిలిపోయే శివతత్త్వం మరొక్కసారి ఆనతీయ వలసిందిగాను; లింగరూపుడైన ఆ పరమేశ్వరుని వివిధ విశేషాలను తెలియజేయ వలసిందిగాను మా కోరిక" అన్నారు.

అందుకు సూత పౌరాణికులు చిరుదరహాస రేఖలు చిందించి "లెస్సగా వచించారు. నిజమే!

శివ శివేతి శివేతి వా!
భవ భవేతి భవేతి వా!
హర హరేతి హరేతి వా!
భజ మనః శివ మేవ నిరంతరమ్‌ !!
అని శ్రుతి ప్రమాణాం. దీని అర్ధం మీకు తెలిసినదే!

'శివ' అనే రెండక్షరాల చేత చెప్పబడే పరతత్త్వం సమస్త జగత్తుకు ఆధారం. నిత్య సుఖప్రదం. త్రిగుణాతీతం. విశ్వ సంరక్షకం. సర్వకారణ కారకం.

అంతేకాదు! సర్వం శివమయం జగత్‌. కనుక సచ్చిదానంద స్వరూపం - పరమైశ్వర్య స్వరూపం. నిర్మలం, నిర్వికల్పం, నిరంజనం అయిన పరమార్ధ తత్త్వం.

ఒక విలక్షణ విశిష్ట అనంత అగణిత అఖిలస్ధల వ్యాప్తమైన సత్య సుందర వాస్తవ వస్తువే శివశబ్ద వాచ్యం. ఆది మధ్యాంతాలు లేనిది - నామరూపాలకు అతీతమైనది.

స్థూల - సూక్ష్మ ప్రపంచాని కంతటికీ అధిష్ఠానమై, దానిని భాసింపజేసే నడిపించే నిరామయ శక్తి సమన్విత విశ్వైక మూలం శివజ్యోతి.

అణువులలో అణువై ; మహత్తులలో మహత్తై ; విభిన్నములలో అభిన్నమై ; అనేకములలో ఏకమై ; విశ్వమయమై ; విశ్వాతీతమై ; దృశ్యమై ; అదృశ్యమై ; అద్వైతమై నట్టి సాక్షీభూత చైతన్యం శివశబ్దార్ధం.

ఈ యావద్వివరణ యొక్క అవాజ్మానస గోచరతత్త్వానికి ప్రతీక శివలింగం.

పరమేశ్వరుని నిరాకార రూపానికి భక్తుల - సాధకుల సాధన కోసం ఓ సహకారిగా నిరూపింపబడిన సూచిక ఈ 'నిరాకారాకారం'

శివలింగ విశిష్టత - 'లింగ' శబ్ద విచారము

లింగం అనేది ఒక చిహ్నం అని ఇంతకు ముందే వివరించాను కదా!
సర్వాధారుడైన జగత్ప్రభునకు ఏ ఆకారం లేదనీ - ఎటువంటి అవయవాలూ ఉండవనీ - సర్వాంతర్యామి అనీ - సర్వ వేదమయుడనీ - చరాచర ప్రపంచ స్వరూపుడనీ చెప్పడానికి గుర్తుగా ఉన్న తత్త్వం శివలింగమన్న మాట! మనకు ప్రధానంగా కనబడేవి - పరంపరగా ఊహించబడేవి పంచభూతాలే! వీటిలో భూమిని పీఠంగాను - అకాశాన్ని లింగంగాను ; పంచభాతాలను అంతర్లీనంగా కలిగింది కనుక 'లింగం' అని నిర్వచించారు.

"ఆకాశం లింగం ఇత్యుక్తం
పృథివీ తస్య పీఠికా !!
ఆలయః సర్వదేవానాం
లయనాత్‌ లింగముచ్యతే !!"

లింగం ఆకాశమనీ - భూమి దాని పీఠమనీ - ఇది సర్వదేవతలకు స్థానం అనీ - సర్వం ఇందులోనే లయమవుతున్నది కనుక లింగం అనీ ప్రమాణం!

లీనం = మన మామూలు నేత్ర దృష్టికి కనిపించని దానిని (అనగా - లోపల ఐక్యమై ఉండుదానిని);

గమయతి = తెలియజేయు (చిహ్న రూపమున) చున్నది కనుక లింగం అయినది అని శ్రుతి వాక్యం.

అంతేకాదు ! లయించిన జగత్తును మళ్ళీ సృష్టించేది అని కూడా అంతరార్ధం ఉన్నది. అంటే...ఆ పరమేశ్వరుడే, జగత్కారణుడనీ - సృష్టి స్థితి లయాలు చేసేవాడనీ తెలియగలరు."

No comments:

Post a Comment