Friday, January 2, 2015

అసలీ పురాణమంటే అర్థమేమిటి?

పురాణాలలో సర్వశాస్త్రాలు ఇమిడి ఉన్నాయని పెద్దలంతా చెబుతూ ఉంటారు. అసలీ పురాణమంటే అర్థమేమిటి? పురాణాలు ఎన్ని ఉన్నాయి? వాటన్నిటినీ ఎవరితో పోల్చి చెబుతారు? అనే విషయాలను గురించి వివరించి చెబుతుంది ఈ కథా సందర్భం. పద్మపురాణం ఆది ఖండంలో దీనికి సంబంధించిన వివరణ ఉంది.

పురాణాలు మొత్తం పద్దెనిమిది. వీటికంటూ కొన్ని ప్రత్యేక లక్షణాలున్నాయి. ఈ పురాణాలన్నీ శ్రీ మహావిష్ణువు స్వరూపంతో సరిపోతాయి. అందుకే శ్రీమహావిష్ణువును పురాణ పురుషుడని అంటూ ఉంటారు. ఆ నారాయణుడి
1) హృదయం పద్మపురాణం
2) చర్మం వామన పురాణం
3) తొడలు భాగవత పురాణం
4) మెదడు మత్స్యపురాణం
5) పృష్ణభాగం కూర్మపురాణం
6) కుడికాలు చీలమండ వరాహ పురాణం
7) బొడ్డు నారదపురాణం వెంట్రుకలు స్కందపురాణం
9) ఎడమ భుజం శివపురాణం
10) కుడి భుజం విష్ణుపురాణం
11) ఎడమపాదం అగ్నిపురాణం
12) కుడిపాదం మార్కండేయ పురాణం
13) కుడిమోకాలు భవిష్యపురాణం అని పద్మపురాణంతోపాటు ఇతర పురాణాలు కూడా వివరించి చెబుతున్నాయి.

పురాణానికి కొన్ని ప్రత్యేక లక్షణాలున్నాయి. ఆ లక్షణాలున్నదే పురాణం అవుతుంది. ప్రధానంగా పురాణానికి అయిదు లక్షణాలను పేర్కొన్నారు. కాలక్రమంలో కొంతమంది పది లక్షణాలు కూడా ఉన్నాయని చెప్పారు.

అయిదు లక్షణాలలో
1) సర్గం
2) ప్రతిసర్గం
3) వంశం
4) మన్వంతరం
5) వంశాను చరితం
పురాణానికి ఈ అయిదు లక్షణాలు ఉంటాయని పురాణాలతోపాటు, నిఘంటువులు కూడా స్పష్టం చేస్తున్నాయి. అయితే ఈ అయిదు లక్షణాలు మనకున్న పద్దెనిమిది పురాణాలలో ఒక్కోదానిలో ఒక్కొక్క లక్షణం ఎక్కువగా, మరో లక్షణం తక్కువగా వర్ణితమై కనిపిస్తుంది. ఎక్కువ తక్కువుల మాటఎలాఉన్నా అయిదు లక్షణాలు మాత్రం ఉండి తీరాల్సిందే.

వీటిలో
1) మొదటిదైన సర్గం అనే దానికి అర్థం సృష్టి అని, ఈ సృష్టి అంతా ఎలా జరిగింది? పంచతన్మాత్రలు, పంచభూతాలు ఎలా ఉద్భవించాయి? అని వివరించటమే సర్గం.
2) రెండో లక్షణం ప్రతిసర్గం. సర్గానికి వ్యతిరేకం ప్రతిసర్గం. అంటే సృష్టి ఎలా లయమవుతుంది? ప్రళయాలు ఎన్ని రకాలు? అవి ఎలా ఏర్పడుతాయి? అని వివరించటమే ప్రతిసర్గం
3) మూడో లక్షణమైన వంశంలో సృష్టి ప్రారంభం నుంచి ఎంతమంది రాజులు, వారి వంశాలు, ఆవిర్భవించాయి. వారి వంశాలు వర్ణనతో పాటు రుషుల వంశాలకు సంబంధించిన విషయ వివరణలు ఈ లక్షణంలో కనిపిస్తాయి.
4)నాలుగో లక్షణం మన్వంతరం. ఇది కాలగణనాన్ని చెబుతుంది. పద్నాలుగు మన్వంతరాల విషయాలు, వాటి అధిపతులు, వారికి సంబంధించిన విషయాలన్నీ దీనిలో వస్తాయి.
5)అయిదో లక్షణమే వంశాను చరితం. దీనిలో సృష్టి మొదలైన దగ్గర నుంచి పాలించిన రాజులు, చక్రవర్తుల, రుషుల వంశ చరిత్రలు వర్ణితమవుతాయి.

ఇలా ఈ అయిదు ప్రధాన లక్షణాలు తొలినాళ్ళ నుంచి అంతా పురాణాలకు ఉంటాయని, ఉండాలని చెబుతూ వస్తున్నారు. కాలక్రమంలో కొంతమంది ఈ అయిదు లక్షణాలను పది లక్షణాలుగా చేసి అలాంటి పది లక్షణాలు పురాణాలకు ఉండాలని చెప్పారు. సర్గ, విసర్గ, వృత్తి, రక్షణ, అంతరాలు, వంశం, వంశాను చరితం, సంస్థ, హేతువు, అపాశ్రయం అనే పది లక్షణాలను అనంతర కాలంలో వచ్చిన వారు పేర్కొన్నారు.

1) సర్గ అంటే ఇక్కడ కూడా సృష్టి అనే అర్థం.
2) విసర్గ అంటే జీవుల సృష్టి అని అర్థం చెబుతారు.
3) వృత్తి అనే పదానికి మనిషి తన జీవితాన్ని సాగించటానికి ఏ ఏ వస్తువులను వాడుతారో వాటిని గురించిన విషయాల వివరణ.
4) రక్షణ అంటే భగవంతుడు ధర్మ రక్షణకోసం అవతరించే తీరు అని అర్థం.
5) అంతరాలు అంటే మన్వంతరాల వివరణ.
6) వంశం అంటే రాజుల, రుషుల, వంశాల వివరణ.
7) వంశాను చరితం అంటే రాజుల, రుషుల వంశ క్రమంలో ఉన్న అన్ని తరాల చరిత్ర వివరణ. సంస్థ అంటే ప్రళయానికి సంబంధించిన వివరణ.
9) హేతువు అని అంటే జీవుడి జనన మరణాలకు మధ్యన ఉన్న కర్మ సంబంధమైన విషయం. జీవుడు చేసే కర్మను బట్టే అతడి జీవితమైనా, సృష్టి అయినా అంతమవుతుందని చెప్పే విషయానికి సంబంధించిన వివరణ.
10) అపాశ్రయం అని అంటే పరబ్రహ్మం అని అర్థం. ఆ పరబ్రహ్మ శక్తినే అపాశ్రయ శక్తి అని అంటారు. దానికి సంబంధించిన వివరాలు దీంట్లో ఉంటాయి.

ఈ పది లక్షణాలు భాగవతం ద్వితీయ స్కందంలో మళ్ళీ కొద్దిపాటి తేడాతో కనిపిస్తున్నాయి. సర్గ, ప్రతిసర్గ, స్థానం, పోషణం, ఊతయం, మన్వంతరం, ఈశాను కథ, నిరోధం, ముక్తి, ఆశ్రయం... ఈ పది లక్షణాలు పేర్లలో తేడా ఉన్నా అర్థం మాత్రం ఒకటేనని పురాణజ్ఞలు వివరించి చెబుతున్నారు.

No comments:

Post a Comment