Thursday, January 1, 2015

పాపపుణ్యాలు ఏర్పడు విధానం

కృతయుగంలో చేసిన పాపపుణ్యాలు గ్రామానికి, ద్వాపరయుగంలో చేసినవి వారివారి వంశాలకి చెందేవి. కలియుగంలో చేసిన కర్మఫలం మాత్రం ఆ కర్తకు ఒక్కడికే సిద్ధిస్తుంది.

సంసర్గ రహిత సమాయత్తములయ్యే పాపపుణ్యాలను గురించి చెప్తాను. ఫలాపేక్ష కలిగిన మానవుడు ఒక పాత్రలో భుజించడంవల్ల, ఒక స్త్రీతో రమించడం వల్ల కలిగే పాపపుణ్యాలను తప్పనిసరిగా, సంపూర్తిగా అనుభవిస్తున్నాడు. వేలాది బోధనలవల్ల యజ్ఞం చేయడం వల్ల పంక్తిభోజనం చేయడంవల్ల కలిగే పాపపుణ్యాల్లో నాల్గవ వంతును మాత్రమే పొందుతున్నాడు. ఇతరులు చేసిన పాపపుణ్యాలను చూడటంవల్ల, తలచుకోవడంవల్ల అందులోని వందన భాగాన్ని తాను పొందుతున్నాడు. ఇతరులను దూషించేవాడూ, త్రుణీకరించేవాడూ, చెడుగా మాట్లాడేవాడూ, చాడీలు చెప్పేవాడు... ఇతరుల పాపాలను తాను పుచ్చుకుని, పుణ్యాన్ని జారవిడుచుకుంటాడు.
తన భార్య, కొడుకు, శిష్యులు లేదా ఇతరుల చేత సేవలు చేయించుకున్నట్లయితే తప్పనిసరిగా వారికి తగినంత ద్రవ్యమును ఇచ్చి తీరాలి. అలా ఇవ్వనివారు తన పుణ్యంలో సేవానురూపమైన పుణ్యాన్ని ఆ ఇతరులకు జారవిడుచుకున్న వారవుతారు. పంక్తిభోజనాల్లో, భోక్తల్లో ఏ లోపం జరిగినా ఆ లోపం ఎవరికి జరిగిందో వారు యజమానుల పుణ్యంలో ఆరవ భాగాన్ని హరించిన వారవుతున్నారు. స్నాన, సంధ్యాదులు ఆచరిస్తూ ఇతరులను తాకినా ఇతరులతో పలికినా వారు తమ పుణ్యంలో ఆరవ వంతును ఆ ఇతరులు కోల్పోతారు. ఎవరి నుండి అయినా యాచన చేసి తెచ్చిన ధనంతో ఆచరించిన సత్కర్మ వల్ల కలిగే పుణ్యం దానమిచ్చిన వానికే చెందుతుంది. కర్తకు కర్మఫలం తప్ప మరేం మిగలదు. దొంగిలించి తెచ్చిన పర ద్రవ్యంతో చేసే పుణ్యకర్మ వల్ల పుణ్యం ఆ ధనం యజమానికె చెందుతుంది.

ఋణశేషం ఉండగా మరణించిన వారి పుణ్యంలో శేష రుణానికి తగినంత పుణ్యం ఋణదాతకు చెందుతూ ఉంది. పాపంగానీ, పుణ్యంగానీ ఫలానా పని చేయాలనే సంకల్పం కలిగినవాడూ, ఆ పని చేయడంలో తోడ్పడేవాడూ, దానికి తగినంత సాధన సంపత్తిని సమకూర్చినవాడూ, ప్రోత్సహించేవాడూ తలా ఒక ఆరవ వంతు ఫలాన్ని పొందుతారు. ప్రజల పాపపుణ్యాల్లో రాజుకు, శిష్యుఅ వాటిలో గురువుకు, కుమారుని నుండి తండ్రికి, భార్య నుండి భర్తకు ఆరవ భాగం చేరుతుంది. ఏ స్త్రీ అయితే పతిభక్తితో నిత్యం భర్తను సంతోషపెడుతుందో ఆ స్త్రీ తన భర్త చేసిన పుణ్యంలో సగభాగానికి అధికారిణి అవుతుంది. తన సేవకుడో, కొడుకో, మరి ఇతరులతోనో ఆచరింపచేసిన పుణ్యాల్లో తనకు ఆరవ వంతు మాత్రమే లభిస్తుంది. ఇలా ఇతరులు ఎవరూ మనకి దానం చేయకపోయినా, మనకు సంబంధం లేకపోయినా వివిధ జనసాంగత్యాల వల్ల పాపపుణ్యాలు మానవులకు ప్రాప్తిస్తాయి. అందువల్లనే సజ్జన సాంగత్యం చాలా ప్రధానమని గుర్తించాలి.

No comments:

Post a Comment