ద్రాక్షారామ, తూర్పు గోదావరి జిల్లా, రామచంద్రపురం మండలానికి చెందిన
గ్రామము. కాకినాడకి 32 కి.మీ దూరములోను, రాజమండ్రికి 60కి.మీ
దూరములోనున్నది. ద్రాక్షారామంలో గల శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ భీమేశ్వర
స్వామి వార్ల దేవాలయం అతి ప్రాచీన సుప్రసిద్ధ శైవ క్షేత్రం. ఈ ఆలయాన్ని
క్రీ.శ. 7,8 శతాబ్ధాల మధ్య తూర్పు చాళుక్యుల వంశానికి చెందిన చాళుక్య
భీముడు నిర్మించినట్టుగా శాసనాల ద్వారా తెలుస్తొంది.
ఇక్కడి మూలవిరాట్ శ్రీ భీమేశ్వర స్వామి స్వయంభుగా వెలసిన 14 అడుగుల
శివలింగం, శుద్ధ స్ఫటికాకార లింగం. ఈ శివ లింగాన్ని పూర్తిగా దర్శించు
కోవాలంటే మూడు అంతస్తులు ఎక్కి దర్శించు కోవాలి. ఈ మెట్ల దారిలో రాతి గోడకు
రంద్రాలున్నాయి గమనించ వచ్చు. గతంలో ఈ రంద్రాలలో వెలుగు కొకరకు రత్నాలు,
వజ్రాలు వుండేవని చెపుతారు. ఈయన దేవేరి శ్రీ మాణిక్యంబా అమ్మవారు యావత్భారత
దేశంలోనే ప్రసిద్ధి చెందిన అష్టాదశ శక్తి పీఠాలలో 12 వ శక్తిపీఠంగా
వెలసియున్నది. మన రాష్ట్రానికి త్రిలింగ దేశమని పేరు రావడానికి కారణమైన
క్షేత్ర త్రయంలో ద్రాక్షారామం ఒకటి. మిగిలిన రెండు క్షేత్రాలలో ఒకటి
కరీంనగర్ జిల్లాలోని కాళేశ్వరము కాగా, మరొకటి శ్రీశైలము. త్రిలింగ
క్షేత్రాలలో ఒకటిగా, అష్టాదశ శక్తిపీఠాలలో ద్వాదశ పీఠంగా, దక్షిణ కాశీగా,
వ్యాస కాశీగా ద్రాక్షారామానికి ప్రశస్తి ఉంది.
శాతవాహన రాజైన హాలుని కాలానికే ఈ ఆలయం ఉన్నట్లు లీలావతీ గ్రంథం అన్న ప్రాకృతభాషా కావ్యంలో పేర్కొన్నారు. ఈ ఆలయాన్ని, సామర్లకోట లోని భీమేశ్వరాలయాన్ని కూడా చాళుక్య రాజయిన భీముడు నిర్మించాడని చెబుతారు. అందుకే ఈ రెండు గుడులు ఒకే రీతిగా ఉండటమేగాక, రెంటి నిర్మాణానికి ఉపయోగించిన రాయికూడ ఒకటేరకంగా ఉంటుంది. ఈ క్షేత్రాన్ని గురించిన ప్రశంస శ్రీనాథకవి భీమేశ్వర పురాణంలో వివరించాడు. దుష్యంతుడు, భరతుడు, నలుడు, నహషుడు ఈ స్వామిని అర్చించారని వ్రాశాడు. తిట్టుకవి గా ప్రసద్ధి నందిన వేములవాడ భీమకవి " ఘనుడన్ వేములవాడ వంశజుడ, ద్రాక్షారామ భీమేశునందనుడన్.... " అని చెప్పుకొన్నాడు. పూర్వము తారకాసురుడు అను రాక్షసుడు శివుని గురించి ఘోరమైన తపస్సు చేయగా, శివుడు సాక్షాత్కరించెను. ఆ రాక్షసుడు శివుని యొక్క ఆత్మలింగాన్ని వరంగా కోరగా శివుడు ఆత్మలింగాన్ని ప్రసాదించెను. క్రూర స్వభావం కలిగిన ఆ తారకాసురుడు ఆ లింగ శక్తి వలన దేవతలను, ఋషులను, సత్పురుషులను నానా ఇబ్బందులు పెట్టుచుండగా ఆ బాధలు భరించలేక వీరంతా విష్ణుమూర్తిని ప్రార్థించగా, అపుడు విష్ణువు ఆ లింగం తొలగితేగాని ఆ రాక్షసుని శక్తి నశించదనీ, ఈశ్వరుడి అంశతో జన్మించిన వానితో తప్ప మరెవ్వరి వలనా తనకు మరణం లేకుండ వరం పొంది ఉన్నాడని చెప్పగా, మన్మధ ప్రేరేపణచేత పార్వతీ కల్యాణం, అనంతరం 'కుమార సంభవం' జరుగగా ఆ కుమారస్వామి రుద్ర గణములకు నాయకత్వం వహించి తారకాసురుడితో యుద్ధం చేయగా, కుమార స్వామి విసిరిన బాణం ఆ ఆత్మలింగానికి తగిలి అయిదు ముక్కలై భూమిమీద అయిదు చోట్ల పడెను. అవే పంచారామ క్షేత్రాలుగా అవతరించెను. ఈ ఆలయ ప్రంగణంలొ ఆలయం మొత్తం ఏక శిలలో సూక్ష్మ రూపంలో వున్నది గమనించ వచ్చు. అవి, అమరావతి.,భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామ, సామర్లకోట. ఇలా భూమి మీద పడిన ఆత్మలింగాలు కైలాసాన్ని చేరుకోవాలని ఎదగడం ప్రారంభించెను. అలా ఎదిగి పోతూ ఉంతే కలియుగం వచ్చేసరికి మానవులకు అభిషేకాలకు గాని, దర్శనానికి గాని అందకుండ పోతాయని ఒక్కోచోట పడిన ఆత్మలింగానికి ఒక్కొ దేముడు అవి ఎదిగిపోకుండా ప్రతిష్ట చేసి అభిషేకార్చనలు చేసెను. అవి:: అమరావతి: ఇక్కడ ఇంద్రుడు ప్రతిష్టించాడు కాబట్టి 'అమరేశ్వరస్వామి ' గా వెలిసెను. భీమవరం::ఇక్కడ చంద్రుడు ప్రతిష్టించాడు కాబట్టి 'సోమేశ్వరస్వామి ' గా వెలిసెను. పాలకొల్లు::ఇక్కడ శ్రీ రామచంద్రమూర్థి ప్రతిష్టించాడు కాబట్టి క్షీరారామలింగేశ్వరస్వామి ' గా వెలిసెను. సామర్లకోట::ఆత్మలింగాన్ని చేధించిన దోషం తనకు రాకూడదని కుమారస్వామే స్వయంగా ఇక్కడ లింగాన్ని ప్రతిష్టించెను కాబట్టి 'కుమారారామ భీమేశ్వరస్వామి 'గా వెలిసెను. ప్రతీ నిత్యం భక్తులు ఆంధ్ర రాష్ట్రం నుండే గాక ఇతర రాష్ట్రాల నుండి కూడా వచ్చి ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ భీమేశ్వర స్వామిని దర్శించుకుని వెళ్తుంటారు. యాత్రీకుల సౌకర్యార్ధము ఇచ్చట పైండా వారిచే నిర్మించబడిన అన్నసత్రం కలదు.
No comments:
Post a Comment