Thursday, August 29, 2013

శ్రీశైలం క్షేత్రం - స్థల పురాణం

మొన్న నాల్గవతేదీ తిథులప్రకారం నాజన్మదిన సందర్భంగా శ్రీశైలాన్ని దర్శించుకున్నాము. ఆసమయంలో మేము చెప్పుకున్న కథలన్నీ ఒకచోట పొందుపరుద్దామని ఇక్కడ రాస్తున్నాను.

ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన మల్లిఖార్జున లింగము, అమ్మవారి కంఠం( గ్రీవం ) పడిన స్థానం కనుక అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన భ్రమరాంబికా శక్తి పీఠము శ్రీశైలంలో ఒకే ఆవరణలో వెలిశాయి. శ్రీశైల స్థల పురాణం మేరకు శ్రీమల్లి కార్జున స్వామి ఆలయం 10వ శతాబ్దానిదనీ, భ్రమరాంబాలయం 16వ శతాబ్దానిదని ఆధునిక చరిత్రకారులు చెప్తున్నప్పటికీ ఇది చాలా ప్రాచీన మైనది. శ్రీశైల స్థల పురాణమంతయు స్కాందపురాణములోని “శ్రీశైల ఖండము” అనుపేర గలదు.  


ఈ ప్రాంతంలో శిలాదుడనే మహర్షి శివుని గురించి ఘోర తపస్సు చేయగా పరమశివుడు ఆ మహర్షి తపమునకు మెచ్చి ప్రత్యక్షమై వరము కోరుకోమని అడిగెను.అప్పుడు శిలాదుడు స్వామి నాకు నీ వరం చేత పుత్రుడు పొందేలా వరం ప్రాసాదించు అని కోరుకున్నాడు.ఆ వర ప్రభావంచేత శిలాదుడికి నందీశ్వరుడు,పర్వతుడనే ఇద్దరు కుమారులు జన్మించారు.వీరిలో పర్వతుడు స్వామి వారి గురించి మరలా తపస్సు చెయ్యగా స్వామి ప్రత్యక్షమయ్యి నీకు సాయుజ్య ముక్తి నిస్తున్నాను అని వరమివ్వగా, పర్వతుడు స్వామికి నమస్కరించి పరమేశ్వరా! "నీవు నన్ను పర్వతంగా మార్చి నా మీదే నువ్వు కొలువుండేలా, నాయందు ముక్కోటి దేవతలు, సర్వ తీర్థములు, సమస్త ఓషధులు వసించేలా" వరం ప్రసాదించు అని అడిగెను. అదివిని శంకరుడు ఎందుకు అలాంటి వరం కోరుకొంటున్నావు అనగా నేనొక్కడిని తరించడంకాదు, ఇక్కడికి వచ్చిన ప్రతిభక్తుడూ తరించేందుకు అనువుగా ఈవరాన్ని కోరుతున్నాను. ఈ తీర్థాలలో స్నానమాడిన వారికి సమస్త పాపాలూ నశించాలి, ఇక్కడ లభించే ఓషధులతో ఎటువంటి రోగమైనా నశించాలి, శ్రమకోర్చి వచ్చిన వారందరూ నీ దర్శనాన్ని,అనుగ్రహాన్నీ పొందాలి. అందుకనే ఈవరంకోరుతున్నాను అని పర్వతుడు తెలుపగా బొళా శంకరుడు సంతోషించి వరం ప్రసాదించాడు. శివుడు లింగరూపంలో అక్కడ అవతరించాడు. ఇక్కడ పరమేశ్వరుడు మల్లిఖార్జునిగా,పార్వతీ దేవి భ్రమరాంబికా దేవిగా స్వయంభువులుగా వెలిసారు.


మల్లికార్జున నామ ప్రశస్తి :
స్వామి వారిని మల్లిఖార్జునుడు అని పిలవడానికి ఒక పురాణగాధ ఉన్నది. పూర్వం తలిదండ్రులపై కోపించిన కుమారస్వామి కైలాసం నుండి వచ్చి క్రౌంచ పర్వతం చేరాడు. ఆ పర్వతమే నేడు శ్రీశైలం అయినది. కుమారస్వామి వచ్చి ఉన్నచోట మద్దిచెట్టుకు మల్లెతీగ అల్లుకుని ఉన్నది. కుమారునికోసం వచ్చిన శంకరుడు ఆచెట్టు క్రిందనే లింగ రూపంలో వెలిశాడు కనుక స్వామిని “మల్లికార్జునుడు” అంటారు. అర్జున వృక్షం అంటే మద్ది చెట్టు.

మరొక కథ కూడా ఉన్నది : పూర్వం చంద్రవంశపు రాజు అయిన చంద్రగుప్తుని కుమార్తె చంద్రావతి శివుని పరమ భక్తురాలు. ఎపుడూ శివునిని ద్యానిస్తూ గడిపేది. ఆమె భక్తికి మెచ్చిన పరమశివుడు సతీ సమేతుడై సాక్షాత్కరించి ఏమి వరము కావలెనో కోరుకోమ్మని అడగగా అంత చంద్రావతి స్వామీ! నేను మీ శిరముపై ఉంచిన మల్లెపూల దండ ఎన్నటికీ వాడి పోకుండా ఉండేలా వరం ప్రాసాదించమని కోరింది.అపుడు ఆ దండను శివుడు గంగ,చంద్రవంకల మద్య ధరిస్తాడు. శిరమున మల్లెపూల దండ ధరించాడు కావున స్వామి వారికి మల్లిఖార్జునుడు అనే పేరు వచ్చిందని అంటారు.

వృద్ధ మల్లిఖార్జునుడు : పూర్వం అమ్మవారు తపమాచరించి పరమేశ్వరుని ఇక్కడకు వచ్చి తనను వివాహమాడవలసినదిగా ప్రార్థించారు. అందుకు స్వామివారు ఒక వృద్ధుని రూపంలో వచ్చి ప్రత్యక్షమౌతారు. అమ్మవారు స్వామీ ఏమిటి ఈ అవతారం అని ప్రశ్నించగా నేను అనాదినుండీ ఉన్నవాడను నారూపం ఇదే! ఇష్టమైనచో వివాహమాడుము అని తెలుపుతారు. అందుకు అమ్మ మాహాదేవా! మీ తత్వం నాకు తెలియనిది కాదు. మీ మనోహరత్వం నాకు బాగా తెలుసును మీరు ఏరూపంలో ఉన్నా నాకు ఆమోదమే అని తెలిపి స్వామిని వివాహం చేసుకుంటారు. అలా వచ్చిన స్వామే వృద్ధ మల్లిఖార్జునుడు. నేటికీ లింగ రూపంలో ప్రథాన ఆలయానికి కుడివైపున ఉన్నారు.

భ్రమరాంబికా నామ ప్రశస్తి :
పూర్వం అరుణాసురడు అనే రాక్షసుడు ఈ ప్రపంచాన్ని పరిపాలించేవాడు. అతను చాలా కాలం పాటు గాయత్రీ మత్రం జపిస్తూ బ్రహ్మ కోసం తపస్సు చేసి ద్విపదాలచే మరియు చతుష్పదాలచే మరణం లేకుండా వరం పొందాడు. ఈవరం తో భయపడిన దేవతలు ఆదిశక్తిని ప్రార్ధించారు. అమ్మవారు ప్రత్యక్షమయి అరుణాసురుడు తన భక్తుడని గాయత్రీ మంత్రం జపిస్తున్నంతవరకు అతనిని ఎవరూ ఏమీ చేయలేరని చెపుతుంది. తర్వాత దేవతలు పధకం ప్రకారం దేవతల గురువు అయిన బృహస్పతి ని అరుణాసురని దగ్గరికి పంపిస్తారు. అరుణాసురడు దేవ గురువు బృహస్పతి రాక గురించి ఆశ్చర్యం వ్యక్త పరుచగా, బృహస్పతి అందుకు నమాధానంగా ఇద్దరం ఒకే అమ్మవారిని గాయత్రీ మంత్రంతో పూజ చేస్తున్నమని, కాబట్టి ఈరాక లో వింత ఏమి లేదని చెపుతాడు. అందుకు అరుణాసురుడు దేవతలు పూజ చేసే అమ్మవారిని నేను ఎందుకు పూజ చేయాలని అహంకరించి గాయత్రి మంత్రం జపాన్ని మానేస్తాడు. దానికి కోపించిన అమ్మవారు అరుణాసురుని సంహరించడానికి వెళతారు. ఆదిశక్తి ఎంతసేపు యుద్ధం చేసినా అరుణాసురుని చంపలేక పోతుంది. చివరికి అతని వరప్రభావమని తలచి షట్పదిఅయిన భ్రమర ( తుమ్మెద ) రూపం ధరించి అసంసాఖ్యకంగా భ్రమరాలని సృష్టిస్తుంది. ఆ భ్రమరాలు అరుణాసురుడి సైన్యాన్ని సంహరిస్తాయి. అమ్మవారు పేద్ద తుమ్మెదగా వచ్చి అరుణాసురుని సంహరిస్తుంది. అరుణాసురుని సంహరించిన తరువాత భ్రమరాంబ దేవతలకోరిక మేరకు శ్రీశైలం నివాసయోగ్యమని తలచి తనంతట తానుగా వచ్చి “భ్రమరాంబికాదేవి”గా ఇక్కడవెలసింది. ఈ గాథ వైవస్వత మన్వంతరంలో జరిగింది. ఐతే అంతకు ముందు ఏనాడో ఈ క్షేత్రం వెలసి ఉంది. ఆనాడు “అర్థనారీశ్వరీ దేవియే” మహాశక్తిగా, క్షేత్ర దేవతగా మల్లికార్జునునితో పాటు వెలసి ఉంది. ఇందుకు నిదర్శనంగా అర్థనారీశ్వరీ దేవాలయం మల్లికార్జున స్వామి ఆలయానికి ప్రక్కనే ఉంది. అంతేకాదు. అర్థనారీశ్వరీదేవియే మహాదేవి అయినట్లు, క్షేత్ర దేవత అయినట్లు శ్రీశైల మహాసంకల్పం కూడా ''... అర్థనారీశ్వరీ భ్రమరాపరమేశ్వరీ ముఖ్యదశ కోటి మహాశక్తి స్థానానాం...'' అనడంలో నిరూపిత మయింది.

" ఆయన్ని దర్శించుకుంటే జన్మాంతరం కైలాస లోకానికి వెళ్లినప్పుడు ఈ జీవి శ్రీశైలాన్ని దర్శించాడా లేదా అని ప్రశ్నవేస్తారట. అప్పుడు సాక్షిగణపతి మనకు సాక్షిగానిలబడి వచ్చాడని తెలుపుతాడట. అందువలన శ్రీశైలం వచ్చిన వారు "సాక్షిగణపతి" ని తప్పక దర్శించి గోత్రనామాలు తెలుపుకోవాలి.

కుమ్మరి కేశప్పకు అటిక(కుండ పెంకు)లో శివుడు బంగారు లింగరూపంలో ప్రత్యక్షమైన ప్రదేశం "హటకేశ్వరం". ఇక్కడ అగస్త్యుడు తపస్సుచేశాడని ప్రతీతి. ఆదేవాలయానికి ప్రదక్షిణలు చేస్తే సంతానం లేనివారికి సంతానం కలుగుతుందని ప్రతీతి. ఆదిశంకరులు తపస్సు చేసిన ప్రదేశ "ఫాలధార-పంచధార" ఇక్కడే శంకరులు సౌందర్యలహరి, శివానందలహరి రచించారట. ఇచట శంకరులను చంపడానికి గజదొంగ ఒకడు ప్రయత్నించ బోతే నృసింహస్వామి సింహంగా వచ్చి అతనిని హతమార్చారు. "శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ నవిద్యతే" "శిఖరేశ్వరం" మీదున్న నంది మీద నువ్వులు పోసి నందిని తిప్పి నందికొమ్ములలో నుండి శ్రీశైల దేవాలయ శిఖరాన్ని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదు. శ్రీశైలం కొండలన్నిటిలోనూ ఈ శిఖరేశ్వరం అత్యంత ఎత్తైనది.

No comments:

Post a Comment