దీపం
లేని ఇల్లు ప్రాణం లేని శరీరం వంటిదే. మామూలుగా ప్రమిద అనేది మట్టితో
చేసినదై ఉంటుంది. మన శరీరం పంచభూతాలతో తయారైంది. దీపపు ప్రమిద శరీరానికి
ప్రతీక. దానిలోని నూనె లేక నెయ్యి మనలోని ప్రేమ వంటిది. ప్రేమను,
స్నేహాన్ని జిడ్డుతో పోల్చి చెబుతుంటారు. ప్రేమ స్నేహితుల మధ్య ఉంటే అది
స్నేహం, అదే తోటి సోదరుల యందు ఉంటే అది ఆదరం, అదే పెద్దల యందు ఉంటే గౌరవం.
అది భగవంతుని యందు ఉంటే దాన్ని భక్తి అంటారు. అయితే ఈ ప్రేమ
భగవంతుని కోసం ప్రకాశించ గలిగితే మన జన్మ ధన్యం. అలా ప్రకాశింపచేయాలంటే
మనకు శాస్త్రముల తోడు కావాలి. శాస్త్రములకు గుర్తు మనం పెట్టే వత్తులు. ఒక
వత్తి మాత్రమే వేసి వెలిగించకూడదు. రెండు వత్తులు కలిపి వెలిగించాలి. రెండు
దీపాలు వెలిగించాలి. కొందరు ఒకే దీపం వెలిగిస్తారు, వారు ఒకే ప్రమిదలో
రెండు దీపాలు వెలిగించాలి. ఒక వత్తు వేదాన్ని, రెండో వత్తు ఆ వేదాలను
వివరించే వ్యాఖ్యాణ గ్రంథములు. వ్యాఖ్యాణ గ్రంథములు అంటే రామాయణ, మహాభారతం,
ప్రబంధాలు మొదలైనవి. ధర్మ శాస్త్రములు, ఇతిహాసాలు, పురాణాలు, ఆగమాలు మరియూ
ప్రబంధాలు ఇవన్నీ కలిపి వ్యాఖ్యాణ గ్రంథములు అని అంటారు. ఇవి వేదంలోని
అర్థాలని మరింత స్పష్టంగా కనిపించేట్టు చేస్తాయి. కనుక ననకు వేదమూ అవసరమే,
వ్యాఖ్యాణ గ్రంథములు అవసరమే.
వత్తులు దేవుడి వైపు తిరిగి ఉండాలి. అందులో వెలిగే నిప్పే మనలోని జ్ఞానం. నేను అని చెప్పే ఆత్మకు స్వరూపం అణుమాత్రం, జ్ఞానమే తన స్వభావం. జ్ఞానమే ఆత్మ స్వరూపం. ఆ జ్ఞానం వికసించగలగాలి. అప్పుడు ఎదురుగుండా ఉండే రూపం మనకు చక్కగా దర్శనం ఇస్తుంది. వెలిగే జ్యోతి ప్రమిద అంచు వద్ద ఉండాలి. దీపం మధ్యలో జ్యోతి వచ్చేట్టు వెలిగించడం పద్దతి కాదు. అట్లాచేస్తే ప్రమిద అంచు యొక్క నీడ దేవుడిపై పడుతుంది. దీప కాంతి దేవుడిపై పడాలి, అప్పుడు స్పష్టంగా దర్శించవచ్చు.
భూమి, జలం మరియూ తేజస్సు ఈ మూడు ద్రవ్యాలను వాడి భగవంతుడు విశ్వరచన చేసాడు. ఇక్కడ మనం ఈ మూడు ద్రవ్యాలు దీపంలో చూడవచ్చు. భూమికి సూచకంగా ప్రమిద, జలానికి సూచకంగా నెయ్యి మరియూ తేజస్సుకి సూచకంగా జ్యోతి. ఈ మూడింటిని భగవన్మయం చేయగలగాలి. కేవలం బయటకి కనిపించే వస్తువులే కాదు, భగవంతుడు ఇచ్చినవి మనలో ఎన్నో ఉన్నాయి. మన మనస్సుని పాత్రను చేసి, మన ప్రేమనే నెయ్యిగా పోసి, మనం భగవంతుని కొరకు చేసే చింతనలే వత్తులు, ఆపై మన జ్ఞానమే జ్యోతి అని భావించాలి. అంటే లోపల బయట కనిపించని వస్తువులన్నీ పరమాత్మమయం చేయడమే దీపం పెట్టే ఆంతర్యం.
No comments:
Post a Comment