Friday, August 30, 2013

వరలక్ష్మి వ్రత కధ (శ్రావణ శుక్రవారం కధ)


ఒకనాడు పరమేశ్వరుడు కైలాస గిరియందు సకల మునిగణ సంసేవితుడైయున్న సమయంబున పార్వతీ దేవి వినయంబుగా, “ప్రాణేశ్వరా! స్త్రీలు సకలైశ్వర్యములు కలిగియుండుటకు ఆచరించదగిన వ్రతమేదియో సెలవీయు”డని కోరెను. అంతట పరమేశ్వవరుడు, “దేవీ! వరలక్ష్మి వ్రతమనునది స్త్రీలకు సౌభాగ్యమొసగును. దానిని శ్రావణమాసమందు పౌర్ణమికు ముందు వచ్చు శుక్లపక్ష శుక్రవారము నాడు చేయవలెను” అనెను. అది విని యామె, “స్వామీ! ఆవ్రతం ఎలా ఆచరించవలెనో సెలవీ”య వేడెను. మరియు, “ఆ వ్రతాన్ని మునుపు ఎవరాచరించి తరించారో తెలుపగోరెద” ననెను. అంతట పరమేశ్వరుడు “ఓ పడతీ! ఆ వ్రతకధను చెప్పెదను వినుము” అని కధ చెప్పెను.

పూర్వము మగధ రాజ్యమున కుండిన నగరమను నొక పురము గలదు. అది బహుసుందరమయిన పట్టణము. అందు చారుమతి యను ఒక సాధ్వి కలదు. ఆమె సద్గుణములకు మెచ్చి ఆదిలక్ష్మి ఆమె స్వప్నమున ప్రత్యక్షమై ఆమెతో, “చారుమతీ! నీసధ్గుణములకు నేను మెచ్చితిని నీకు కావలయు వరములనొసగు తలంపు నాకు కలిగెను. కావున నీవు శ్రావణ పౌర్ణమి ముందు వచ్చు శుక్రవారమునాడు వరలక్ష్మీ వ్రతము చేయుము. అప్పుడు నీవు కోరిన కోరికలను దీర్చెద” నని చెప్పి మాయమయ్యను. వెంటనే ఆమె మేల్గాంచి, తన స్వప్న వృత్తాంతము తన భర్తకు నివేదింప నతడునూ మిగుల సంతోషించి ఆమెనా వ్రతమును చేయుటకు ప్రోత్సహించెను. ఆస్వప్న వృత్తాంతము తెలిసిన ఆ పట్టణ స్త్రీలు శ్రావణమాసం కొరకు ఎదురుచూచుచుండిరి. అంతలో శ్రావణమాసము వచ్చెను. అంతట చారుమతి వారందరితో కలసి నిర్ణీత దినమున స్నానాదులు ఆచరించి, ఒక చోట ఆవు పేడతో అలికి, బియ్యముతో మంటపమేర్పరచి మర్రిచిగుళ్ళు మొదలగు పంచ పల్లవులతో కలశంబేర్పరచి, అందు వరలక్ష్మిని ఆవాహనం చేసి, సాయంత్రమైనంత నధిక భక్తితో



లక్ష్మీo క్షీరసముద్రరాజతనయాం| శ్రీ రంగథామేశ్వరీం|

దాసీభూత సమస్తదేవ వనితాం| లోకైక దీపాంకురాం|

శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవః| బ్రహ్మేంద్ర గంగాధరాం|

త్వాం త్రిలోక్య కుటుంబినీం సరసిజాం వందేముకుందప్రియాం||



అని స్తుతించి, తొమ్మిది రంగులు గల తోరణము కుడిచేతికి గట్టుకొని, యధాశక్తిని లక్ష్మీదేవికి ఫలభక్ష్య పానీయ పాయసాదులు నైవేద్యముగా సమర్పించి, ప్రదక్షణ మొనర్చెను. అట్లు వారు ప్రదక్షణము చేయుచుండగా ఘల్లు ఘల్లు మని ధ్వని వినిపించుటచే వారు క్రిందకి చూడగా వాళ్ళ కాళ్ళకు గజ్జెలు, అందెలు మున్నగు ఆభరణములు కనిపించెను. కానీ భక్తి తప్పక వారు రెండొవసారి ప్రదక్షణము చేయగా వారి హస్తములు నవరత్నఖచిత కంకణ సుందరము లయ్యెను. మూడవ ప్రదక్షణము చేసిన వెంటనే వారి యిండ్లు సకల సంపత్సమృధ్ధము లయ్యెను. పిమ్మట చారుమతీ వ్రతము చేయించిన బ్రాహ్మణులకు యధావిధిగా యధాశక్తిని దక్షిణ తాంబూలాదుల నొసంగి సంతుష్టిని చేసి పంపి, వ్రత ప్రసాదములను బంధుమిత్రాదులకు పెట్టి, తానునూ భుజించి, సుఖముగా నుండెను. ఆమె లోకోపకారముగా నిట్టి వ్రతమును జేయించినందులకు ఊరిలోనివారందరూ ఆమెను వేనోళ్ళ బొగడిరి. నాటి నుండి స్త్రీలందరూ ఆ వ్రతమును ప్రతి సంవత్సరమూ చేయుచుండిరి. ఆ వ్రతమును అన్ని వర్ణముల వారునూ జేయవచ్చును. ఆ వ్రతాచరణము వలన వరలక్ష్మీ ప్రసాదము కలిగి సకల కార్యములందునూ విజయము చేకూరును.

No comments:

Post a Comment