Thursday, June 25, 2015

అనంత పద్యనాభుడి అనంత విశేషాలు !!!

కేరళ రాష్ట్రంలో రాజధాని నగరం తిరువనంతపురానికి మూడు-నాలుగు మైళ్ల దూరంలో "శ్రీ పద్మనాభ స్వామి దేవాలయం" వుంది. ప్రస్తుతం ఉన్న గోపురాన్ని మాత్రం 1566లోనే నిర్మించారు.
10008 సాల గ్రామాలతో రూపు దిద్దుకున్న ఈ ఆలయాన్ని ఆసాంతం చూడాలంటే వరుసగా మూడు ద్వారాలను దర్శించుకోవాల్సిందే. ఇక్కడ దీర్ఘ చతురస్రంగా వున్న వరండా నిర్మించడానికి 4000 మంది తాపీ పనివారు, 6 వేల మంది నిపుణులు, 100 ఏనుగులను ఉపయోగించి 7 నెలల్లో పూర్తిచేసారని అంటారు. ఈ దేవాలయ ప్రాంగణం 7 ఎకరాల వరకూ వుంటుంది. ప్రత్యేకమైన టేకుతో బంగారు కవచంతో తయారు చేయబడిన ఈ దేవాలయం ధ్వజ స్తంభం ఎత్తు 80 అడుగులు.
1750 ప్రాంతంలో ట్రావన్ కోర్ను పరిపాలించిన మార్తాండ వర్మ అనంతపద్మనాభ స్వామికి రాజ్యాన్ని అంకితం చేశాడు. ఇక నుంచి రాజులు అనంతపద్మనాభుని సేవకులుగా మాత్రమే రాజ్యాన్ని పరిపాలిస్తారని మార్తాండ వర్మ ప్రకటించారు. అప్పటి నుంచి ట్రావన్ కోర్ రాజులకు అనంత పద్మనాభ దాస అనే బిరుదు కూడా వచ్చింది. నేటికి ఈ ఆలయం ట్రావెన్ కోర్ రాజ కుటుంబీకుల ఆధీనంలోనే ఉంది.
ఆలయం నుంచి లభించిన అపార సంపద ట్రావన్ కోర్ రాజవంశం వారసులకు చెందుతుందని పలువురు అంటున్నా, రాజ వంశానికి చెందిన వారు మాత్రం ఆ సంపద అంతా అనంత పద్మనాభుడికే చెందుతుందనడం వారి అపార భక్తికి నిదర్శనం.
ఈ దేవాలయంలో దైవ దర్శనమంటే, ఆదిశేషుడి మీద శయనించి ఉన్న అనంత పద్మనాభుడి 18 అడుగుల మూర్తిని మూడు ద్వారాల నుంచి-ముఖాన్ని దక్షిణ ద్వారం నుండి, పాదాలను ఉత్తర ద్వారం నుండి, నాభిని మధ్య ద్వారం నుండి దర్శించు కోవడమే. 10008 సాలగ్రామాలతో రూపు దిద్దుకొని, అమూల్యమైన వజ్రాలు పొదిగిన ఆభరణాలు ధరించిన స్వామి ధగధగా మెరిసిపోతూ దర్శనం ఇస్తారు. ఆదిశేషుడిపై యోగనిద్రలో వుండే విగ్రహం ఎదుట వుండే మండపం పై కప్పు ఒకే ఒక్క గ్రైనేట్ రాయితో మలచింది.
శ్రీ మహావిష్ణువు యోగనిద్రా మూర్తిగా దర్శనం ఇచ్చే అనంత పద్మనాభ స్వామి ఆలయం అపురూప శిల్పకళకు నిలయం. ఆలయం లోని స్తంభాలపై అనేక రకాల శిల్పాలు చెక్క బడి వుంటాయి. శ్రీ మహావిష్ణువు కొలువుండే 108 పవిత్ర క్షేత్రాల్లో అనంతపద్మనాభ క్షేత్రం ఒకటి. విష్ణుమూర్తి ఇక్కడ మూడు భంగిమల్లో... శయన భంగిమలో యోగ నిద్రా మూర్తిగా, నిలుచొని, కూర్చొని దర్శనం ఇస్తారు.
ఆలయంలోకి హిందువులను మాత్రమే అనుమతిస్తారు. పురుషులు పంచె, ఉత్తరీయం, స్త్రీలు చీరె ధరించి స్వామి దర్శనం చేసుకోవాలి. ఈ ఆలయంలో ఈ సంప్రదాయాన్ని విధిగా పాటిస్తారు.
"పద్మ నాభ" అంటే పద్మం ఆకారంలో ఉన్న నాభి కల వాడని అర్థం. యోగ నిద్రా మూర్తిగా శయనించి ఉండగా, నాభి నుంచి వచ్చిన కమలంలో బ్రహ్మ ఆసీనుడై వున్న అనంత పద్మనాభ స్వామి దివ్య మంగళ రూపం, నయనానందకరంగా కనిపిస్తుంది భక్తులకు. శేషుడు మీద శయనించిన శ్రీ మహావిష్ణువు చేతి కింద శివ లింగం కూడా ఉంటుంది. ఈ విధంగా, ఆలయం, త్రిమూర్తులకు నిలయంగా వెలిసిపోతుంటుంది.
గర్భగుడితో పాటు గాలి గోపురం మీద కూడా అందమైన శిల్పాలు దర్శనం ఇస్తాయి.ఆలయం ముందు పద్మ తీర్థం అనే కోనేరు ఉంటుంది. ఆలయం లోపల 80 ధ్వజస్తంభాలు ఉండడం ఇక్కడి విశేషం. ఆలయ ప్రాంగణంలో ఉన్న బలిపీఠం మండపం, ముఖమండపాల్లో కూడా దేవతామూర్తుల అపురూప శిల్పాలు కనిపిస్తాయి.
ప్రధాన ఆలయ మండపం ఒక మహాద్భుతం. 365 రాతి స్తంభాలతో ఈ మండపాన్ని నిర్మించారు. ఈ రాతి స్తంభాలతో పాటు మండపం పై కప్పు మీద కూడా దేవతామూర్తుల శిల్పాలను అందంగా చెక్కడం విశేషం.
బ్రహ్మ, వాయు, వరాహ, పద్మ-నాలుగు పురాణాలలో ఈ దేవాలయం ప్రస్తావన వుంది. దేవాలయంలో ఇప్పుడున్న వంద అడుగుల-ఏడంతస్తుల గోపురం పునాదులు 1566 లోనే పడ్డాయి. "పద్మ తీర్థం" అనే విశాలమైన చెరువు సరస్సును ఆనుకుని వుంటుంది దేవాలయం. 365 గ్రానైట్ రాతి స్తంభాలతో కూడిన విశాలమైన దేవాలయ ప్రాకారం, తూర్పు దిశగా విస్తరించి, గర్భ గుడిలోకి దారితీస్తుంది. ప్రాకారం నుండి లోనికెళ్లే ప్రధాన ద్వారం ముందర ఎనభై అడుగుల జండా స్తంభం వుంది.
అనంత శయనుడి విగ్రహాన్ని రూపొందించడానికి వాడిన సాల గ్రామాలను, నేపాల్ లోని గండకి నది ఒడ్డునుంచి తెప్పించారు. సాల గ్రామాలను ఏనుగులపై వూరేగించుకుంటూ అక్కడకు తెచ్చారట. ప్రతి సాల గ్రామం పైన ప్రత్యేకమైన ఆయుర్వేద మిశ్రమంతో తయారుచేసిన పదార్థాన్ని, అతకడానికి వీలయ్యే ప్లాస్టర్ లాగా ఉపయోగించారట. క్రిమి కీటకాల నుంచి విగ్రహం కాపాడబడ్డానికి అలా చేశారంటారు.
ఒక్క ట్రావన్ కోర్ రాజు మినహా ఎవరికీ సాష్టాంగపడి ప్రణామం చేసే అర్హత లేదక్కడ. ఆ రాజులు మాత్రమే "పద్మనాభ సేవకులు" గా పిలువ బడుతారు.
శ్రీ మహావిష్ణువు కొలువుండే 108 పవిత్ర క్షేత్రాల్లో, మూడు భంగిమల్లో ఏదో ఒక భంగిమలో మాత్రమే స్వామి దర్శనమివ్వడం జరుగుతుంది. ఈ దేవాలయంలో మాత్రం, శయన భంగిమలో యోగ నిద్రా మూర్తిగా, నిలుచొని, కూర్చొని స్వామి దర్శనం ఇస్తారు స్వామి.
పద్మనాభ స్వామి విగ్రహం, ముఖం, ఛాతీ మినహా, పూర్తిగా బంగారంతో చేయ బడింది. ముస్లిం రాజుల దండయాత్రలలో విగ్రహాలను ధ్వంసం కాకుండా కాపాడుకోవడానికి ఆయుర్వేద మిశ్రమాన్ని పూతగా వాడేవారు. స్వామి కిరీటం, చెవులకున్న కుండలాలు, ఛాతీని అలంకరించిన భారీ సాల గ్రామ మాల, మొత్తం ఛాతీ భాగం, శివుడి విగ్రహం వున్న చేతికున్న కంకణం, కమలం పట్టుకున్న ఎడమ చేయి, నాభి నుండి బ్రహ్మ వున్న కమలం వరకున్న తీగ, స్వామి పూర్తి పాదాలు కూడా బంగారు మయమే.
కోట్లాది రూపాయల విలువగల అపార సంపద ఆ దేవాలయం నేల మాళిగలలో నిక్షిప్తమై వుందని అత్యున్నత న్యాయస్థానం దృష్టికి పోవడంతో, న్యాయమూర్తుల ఆదేశానుసారం, ఆ నిధి నిక్షేపాలను వెలికితీయడంతో…
లభ్యమైన సంపద అంతులేనిది, అపారమైనది.
ఆ మందిరం భూగర్భంలో వెలువడిన.., వెలువడుతున్న వెలకట్టలేని నిధులకు, ఏకంగా అంతరిక్ష పహారాతో పటిష్ఠమైన భధ్రతను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. గగన తలంలోని ఉపగ్రహ సేవలను ఇందుకోసం వినియోగించుకునేందుకు రంగం సిద్ధమవుతోంది.
సుమారు ఐదువేల సంవత్సరాల క్రితం అక్కడ కట్టబడిన, అత్యంత పురాతనమైన అనంత పద్మనాభుడి ఆలయం ఒకప్పుడు "ఎట్టువీట్టిల్ పిల్ల మార్" అనే ఎనిమిది కుటుంబాల వారి నిర్వహణలో వుండేది.
తర్వాతి కాలంలో ట్రావెన్ కోర్ సంస్థాపకుడైన కేరళ రాజు మార్తాండ వర్మ ఈ ఆలయాన్ని తన అధీనంలోకి తెచ్చుకుని, 1729 సంవత్సరంలో పునరుద్ధరించి, ఆలయానికి తామే సమస్తమంటూ ప్రకటించి, ఆలయంలోని శంఖాన్ని తమ సంస్థానానికి సంకేతంగా పెట్టుకున్నాడు.
తిరుమల ఆస్తులను మించి పోయిన తిరువనంతపురం పద్మనాభుడి సంపద ఎలా వచ్చిందన్న దాని పై ఎవరి వాదనలు వారే వినిపిస్తున్నారు. ఈ గదులకు వేసిన తాళాల తీరు, రాళ్లతో పకడ్బందీగా గదులను మూసి వేసిన వైనం, వాటిని తెరిపించిన కమిటీ సభ్యులను ఆశ్చర్య పరిచింది. ఒక్కో గది తాళాలు తీయడానికి చాలా సమయం పట్టినట్లు అధికారులు చెప్పారట.
అనంత పద్మనాభ స్వామి ఆలయ నేల మాళిగల్లోంచి బయటపడిన సొత్తు విలువ ఎంతనేది అప్రస్తుతం. ఆ సంపదంతా భగవంతుడు కే చెందాలి. దాని పరిరక్షణ ఉపయోగం, న్యాయ బద్ధంగా న్యాయ స్థానాల తీర్పు మేరకు నియమితులయ్యే, ట్రస్టీలే నిర్ణయించడం సమంజసం. ఇన్నాళ్లు, ఇంత పకడ్బందీగా, ఆ సొత్తును కాపాడుకుంటూ వస్తున్న, ని స్వార్థ ట్రావెన్ కోర్ రాజ వంశీయుల వారసులకే ఆ బాధ్యత అప్ప చెప్పడం హర్షణీయంగా వుంటుంది.
ఆ సంపదకున్న పురావస్తు ప్రాధాన్యతా దృష్టితో మాత్రమే దాన్ని చూస్తే, ఆ విలువ మరిన్ని రెట్లనడమే కాకుండా, బహుశా విలువ కట్టలేనిదని కూడా అనాల్సి వస్తుందేమో!
విలువ కట్టడానికి, ఆ సంపదేమన్నా బహిరంగ మార్కెట్లో అమ్మే అంగడి సరుకు కాదు కదా! అందుకే కేరళ రాష్ట్ర ముఖ్య మంత్రి అంతులేని ఆ వింత సంపదంతా పద్మనాభుడిదేనని తేల్చి చెప్పారు…
ఈ అధ్భుత విషయాలన్నింటిని మీరు కల్లారా చూడాలనుకుంటే అనంత పధ్మనాభుడి ధర్శనం చేసుకోవల్సిందే…

No comments:

Post a Comment