Saturday, June 27, 2015

కలిపురుషుడి ప్రభావం ఎవరి యందు ఉంటుంది?

ఒకనాడు పరీక్షిత్ మహారాజు దిగ్విజయ యాత్ర చేస్తున్న సందర్భంలో ఒక ఆశ్చర్య కరమైన విషంయం చూశాడు. ఒంటి కాలు కలిగిన ఎద్దు ఒకటి నిలుచుని ఉంటే, దాని ముందు ఆవు ఒకటి నిలబడి పిల్లలగూర్చి జాడ తెలియక బాధపడుచున్న దానివలే ఏడుస్తూ ఉంది. అప్పుడు ఆ ఎద్దు " ఎందుకు ఏడుస్తున్నావు మంగళ ప్రదురాలా? " అని ప్రశ్నిస్తుంది. అందుకా ఆవు "నేను ఏడుస్తున్నది నాగురించి కాదు, నేడు ఆశ్రీలలనేశుడి లేమి వలన కాలముచే నీకు ఒంటి కలయ్యెను కదా!? అని దుఃఖిస్తున్నాను. ఆ కలి ప్రభావముచే దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు, ధీయుతులకు, నీకు, నాకు, గోవులకు, వర్ణాశ్రమలకు బాధ కలుగుతుంది కదా అని బాధ పడుతున్నాను" అంటుంది.
ఒక్క కాలు మీద ఎద్దు ఎలా నిలబడగలదూ? దానిని చూసి ఆవు విలపించడమేమిటీ? అంటే అక్కడ ఉన్నది మామూలు ఆవూ, ఎద్దులు కాదు. ఆ ఆవు భూదేవి, వృషభం ధర్మ దేవత. కృష్ణ నిర్యాణానంతరం కలియుగం ప్రారంభ సమయంలో కలి ప్రవేశించి నపుడు ఆ కలి పురుషుని ప్రభావం వలన ధర్మము యొక్క ( సత్యము, శౌచము, తపస్సు, దయ అను ) నాలుగు పాదములలో 3 నశించి ఒక్క కాలు మాత్రమే మిగిలినందులకు ఆ భూదేవి విలపించుచున్నది. నశించినవేవి? శౌచము, తపస్సు, దయ అను నవి నశించినవి. మిగిలినది సత్యము. ఇది ఎప్పటికీ నశించదు.
దుష్ట సంగము వలన శౌచము, సమ్మోహము వలన తపస్సు, అహం కారము వలన దయ నశించినవి. అవి నశించుట వలన పైన తెలిపిన 8 మందికీ బాధ కలుగుతుంది.
ఈ విధంగా ఆవు దుఃఖిస్తుండగా అపారమైన కోపం కలవాడు, దండము చేతిలో కలిగినవాడు, రాజు ఆకారంలో ఉన్న వాడు, ఖఠినాత్ముండు అయిన వాడు ఒకడు వచ్చి ఆవును తన కాలితో తన్నాడు. ఆ ఆవు క్రింద పడి పోయినది. ఒంటి కాలు మీద నిలబడిన ఎద్దుని కూడా తన్నాడు. అది కూడా క్రింద పడి పోయినది. క్రింద పడి వాటిని తన చేతిలోని దండముతో విపరీతముగా కొట్టనారంభించాడు. అవి కనులనుండి నీరు కారుతుండగా విలపిస్తున్నాయి.
దూరమునుండి అది చూచిన పరీక్షిత్తు వాటిని సమీపించి ఆ గోవును భూమాతగాను, వృషభమును ధర్మముగాను గుర్తించి అమ్మా మీకీ దీనావస్థ కలుగుటకు కారణము ఎవరు? మీకు మూడు కాళ్లు లేక పోవుటకు కారణము ఎవరు ? ఎంతటి వారైనప్పటికినీ నేను వారి చేతులను ఖండఖండములుగా చేసి మిమ్ము రక్షించెదను సెలవిమ్మని అడిగెను.
అందుకా గోమాత " కొందరు కాలమన్నారు,కొందరు కర్మ అన్నారు, ఇది యుగ సంధి అన్నారు, యుగ లక్షణమన్నారు. ఏవేవో కారణాలు చెప్పారు, ఏది ఏమైనప్పటికినీ వీరి పాదములు తెగిపోయాయి" అన్నది.
పరీక్షిత్తు ఇందాక గోవును బాధించిన వానిగురించి వెతుకు చుండగా, ఆ నృపాకారుడైన వాడు వచ్చి గభాలున పరీక్షిత్తు పాదాలమీద పడి అయ్యా రక్షించండి నేనే నరికేశాను ఆపాదాలు అన్నాడు. నన్ను కలి పురుషుడంటారు. నా ప్రవేశం వలననే ధర్మమునకు 3 పాదాలు తెగిపోయాయి. ఈ కలియుగంలో నేను నిలబడాలంటే ధర్మం నశించాలి. అందుకు అనువుగా భగవంతుడే తన అవతారం చాలించాడు. కానీ నేను ఇంకా సరిగా నా ప్రభావాన్ని చూపకముందే, నీవు నన్ను అవరోధిస్తున్నావు. నేను ఎక్కడికెళితే అక్కడ నీవు ధనుర్భాణాలు పట్టుకు నిల్చుంటున్నావు. అలా కాదు నాకో అవకాశం ఇవ్వు. నువ్వు ఫలానా చోట ఉండు అని చెప్పు. నేనక్కడ ఉంటాను. అంతే కానీ నే వెళ్లినచోటల్లా నీవు అండగా నిలబడితే యుగధర్మం నెరవేరదు. ఇది కలియుగం. నేను ప్రవేశించి తీరాలి. కా బట్టి నాకు కొన్ని స్థానాలు ఇవ్వు. అని వేడుకున్నాడు.
అప్పుడు పరీక్షిత్తు చెప్పాడు. నీకు 4 స్థానాలు ఇస్తున్నాను అక్కడ నీవు ఉండవచ్చు.
1 : జూదశాల యందు నీవు ఉండ వచ్చు.
2 : పాన ( మద్య ) శాలయందు నీవు ఉండవచ్చు.
3 : స్వేఛ్చావిహరిణులై ధర్మమునకు కట్టు బడక ఆచార భ్రష్టులైన స్త్రీల యందు నీవు ఉండవచ్చు.
4 : జీవ హింస జరిగే టటువంటి ప్రదేశములయందు నీవు ఉండవచ్చు.
అది విని కలిపురుషుడు అయ్యా మీరు నాలుగుస్థానాలిచ్చారు. కానీ వాటయందు నేను నిలబడడానికి వీలుకలిగేటట్టు లేదు. ( పరీక్షిత్తు పరిపాలనలో ప్రజలెవ్వరూ వాటి జోలికి వెళ్లరు కనుక ) నాకు ఇంకొక్క స్థానాన్ని ప్రసాదించండి అని అడిగాడు.
అందుకు పరీక్షిత్తు
5 : బంగారం ఇచ్చాను అన్నాడు.
అది విని చాలు మహాప్రభో చాలు అని నమస్కరించి వెళ్లి పోయాడు కలిపురుషుడు.
పరీక్షిత్ మహారాజు ఒంటినిండా బంగారమే.. అలా కలి పరీక్షిత్తు నందు ప్రవేశించాడు. పరీక్షిత్తు ఆ ప్రభావంతో వేటకి ( అహింస కు ) వెళ్లి, అక్కడ తపస్సునందు నిమగ్నుడైన శమీక మహాముని పై చచ్చిన పామును వేస్తాడు. అది తెలిసి శమీక మహర్షి కుమారుడు శృంగి కోపోగ్రుడై "ఏడురోజులలో తక్షకుని చేతిలో మరణించమని" పరీక్షిత్తును శపించడము, రాజ్యానికి తిరిగి వచ్చినతరువాత తన తప్పు తెలుసుకున్న పరీక్షిత్తు పశ్చాత్తాప హృదయుడై ఉండగా శుకుడు వచ్చి భాగవతమును ఏడురోజులలో వినిపిస్తాడు.
కావున పై 5 విషయములందును కలి పురుషుని ప్రభావం ఉండును. వీనిలో దేనికి లోనైననూ మనం నైతికంగా పతనమవుతాము. భగవంతునికి దూరమవుతాము. కలి ప్రభావమునుండి భగవన్నామము ఒక్కటే మనను రక్షించ గలదు.

No comments:

Post a Comment