Saturday, December 20, 2014

అంతర్వేది

అంతర్వేది (Antarvedi), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము, తూర్పు గోదావరి జిల్లా, సఖినేటిపల్లి మండలానికి చెందిన గ్రామము. అందమైన బంగాళాఖాతపు సముద్రమున గోదావరి నదీశాఖయైన వశిష్టానది సంగమము చెందు ప్రశాంత ప్రాంతము అంతర్వేది. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంకు సమీపములో కల ఈ త్రికోణాకారపు దీవి పై ప్రసిద్ది చెందిన లక్ష్మీనరసింహస్వామి వారి పురాతన ఆలయం. భౌగోళికంగా అంతర్వేది అక్షాంశ, రేఖాంశాలు ఇది దాదాపు సముద్రమట్టంలో ఉంది.

స్థలపురాణం

 కృతయుగంలో వశిష్ట మహాముని గోదావరిలోని ఓ పాయను తెచ్చి సాగరసంగమం గావించి ఇదే ప్రాంతంలో తపస్సు చేస్తుంటాడు. అయితే విశ్వామిత్రుని ప్రోద్భలంతో రక్తవిలోచనుడు అనే రాక్షసుడు వశిష్టుని తపస్సుకు భంగం కల్గించడమే కాకుండా, అతని కుమారులను హతమారుస్తూ ఉంటాడు. అప్పుడు వశిష్టుడు నరసింహస్వామిని ప్రార్ధించగా, ఆయన ప్రత్యక్షమై రక్తవిలోచనుడితో యుద్ధం చేస్తాడు. ఆ రాక్షసుడిని భూమిపై పడే ప్రతీ రక్తపు బొట్టూ, ఓ రాక్షసుడిగా మారుతుంటుంది. అప్పుడు నరసింహుడు అశ్వరూఢాంబికా అనే మాయాశక్తిని రప్పించి, రాక్షసుడి రక్తం నేలపై పడకుండా నాలుక చాచాలని సూచిస్తాడు. స్వామి ఆదేశం మేరకు ఆమె నాలుక చాచగా, రాక్షసుడిని నరసింహుడు సంహరిస్తాడు. ఆపై, వశిష్టుని కోరిక మేరకు నరసింహాస్వామికి ఇక్కడ కొలువైనట్లు ప్రతీతి.

క్షేత్ర నామం

 బ్రహ్మ రుద్రయాగము చేసిన ప్రదేశము (కమలము)
ఒకప్పుడు శివుని పట్ల చేసిన అపచారాలకు ప్రాయశ్చిత్తంగా బ్రహ్మ రుద్రయాగం చేయాలని నిశ్చయించి , యాగానికి వేదికగా ఈ ప్రదేశాన్ని ఎన్నుకొంటాడు. వేదిక గా ఎన్నుకోబడిన కారణంగా ఈ ప్రదేశానికి అంతర్వేది (అంతర్, వేదిక) అనే పేరు వచ్చింది అని చెబుతారు.

రక్తవలోచనుని కధ

 ఒకానొక సమయం లో రక్తావలోచనుడు (హిరణ్యాక్షు ని కుమారుడు) అనే రాక్షసుడు వశిష్ఠ గోదావరి నది ఒడ్డున వేలాది సంవత్సరాలు తపస్సు చేసి, శివుని నుంచి ఒక వరాన్ని పొందుతాడు. ఆ వరం ప్రకారం, రక్తావలోచనుని శరీరం నుండి పడిన రక్తం ఎన్ని ఇసుక రేణువుల మీద పడుతుందో అన్ని ఇసుక రేణువుల నుండి తనంత పరాక్రమవంతులైన రక్తావలోచనులు ఉద్భవించాలని కోరుకొంటాడు. ఈ వరగర్వం తో లోక కంటకుడై రక్తావలోచనుడు యజ్ఞయాదులు చేసే బ్రాహ్మణులను, గోవులను హింసించేవాడు. ఇది ఇలా ఉండగా ఒకసారి విశ్వామిత్రుడు కి వశిష్ఠుడు కి ఆసమయం లో జరిగిన సమరం లో విశ్వామిత్రుని ఆజ్ఙ పై ఈ రక్తావలోచనుడు వచ్చి భీభత్సం సృష్టించి, వశిష్ఠుడి నూరుగురు కుమారులను సంహరిస్తాడు.
వశిష్ఠ మహర్షి శ్రీ మహావిష్ణువు ను ప్రార్థించగా మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై, గరుడవాహనం పై నరహరి రూపుడై రక్తావలోచనుని సంహరించడానికి వస్తాడు. నరహరి సుదర్శనము ను ప్రయోగించినప్పుడు, శివుడు ఇచ్చిన వరం ప్రకారం రక్తావలోచనుడి రక్తం పడిన ఇసుకరేణువుల నుంచి వేలాది రాక్షసులు జన్మించి, ఇంకా భీభత్సం సృస్టిస్తారు. నరహరి ఈ విషయం గ్రహించి, తన మాయాశక్తి ని ఉపయోగించి, రక్తావలోచనుని శరీరం నుండి పారిన రక్తం అంతా నేలపై పడకుండా రక్తకుల్య అనే నది లోకి ప్రవహించేటట్లు చేసి రక్తావలోచనుడిపై సుదర్శనచక్రాన్ని ప్రయోగించి సంహరిస్తాడు. ఈ రక్తావలోచనుని సంహరించడం చేసిన తరువాత, వశిష్ఠుని కోరిక పై నరహరి ఇక్కడ లక్ష్మీనృసింహస్వామి గా వెలిశాడు. ఈ రక్తకుల్య లోనే శ్రీమహావిష్ణువు అసురులను సంహరించిన తన చక్రాయుధము ను శుభ్రపరచుకొన్నాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ రక్తకుల్య లో పవిత్రస్నానం చేస్తే సర్వపాపాలు పోతాయి అని చెబుతారు.

ఆలయ నిర్మాణ విశేషాలు

 రాత్రిసమయంలో ప్రధాన గోపురపు వెలుగులు.
మొదటి ఆలయము శిధిలపరిస్థితిలో ఉన్నపుడు ఆలయ జీర్ణోర్ధరణకు పాటు పడిన వారిలో ముఖ్యులు శ్రీ కొపనాతి కృష్టమ్మ. ఈయన అంతర్వేది పరిసరాలలో ఒక జమీందారు. ప్రస్తుతపు ఆలయ నిర్మాణము ఈయన విరాళాలు మరియు కృషి ద్వారానే జరిగినది. ఆలయ ప్రధాన ముఖద్వారమునకు ముందు ఈయన శిలా విగ్రహము కలదు. ఈ ఆలయము చక్కని నిర్మాణశైలితో కానవచ్చును. దేవాలయము రెండు అంతస్తులుగా నిర్మించారు. దేవాలయ ప్రాకారముగా వరండా(నడవా) మాదిరి నిర్మించి మద్యమద్య కొన్ని దేవతా విగ్రహాలను ఏర్పాటు చేసినారు. ప్రాకారము సైతము రెండు అంతస్తుల నిర్మాణముగా ఉండి యాత్రికులు పైకి వెళ్ళి విశ్రాంతి తీసుకొనుటకు ప్రకృతి తిలకించుటకు అనువుగా నిర్మించినారు. ఆలయమునకు దూరముగా వశిష్టానది కి దగ్గరగా విశాలమైన కాళీస్థలమునందు కళ్యాణమండపము నిర్మించినారు. ఈవిదంగా కొన్ని వేలమంది స్వామివారి కళ్యాణము తిలకించే ఏర్పాటు చేసినారు. ఈ ఆలయం క్రీ.శ.300 కు పూర్వం నిర్మింపబడినదని అక్కడి కొన్ని విగ్రహలు చెపుతున్నాయి .

నీటిలో కల వశిష్టాశ్రమ ప్రధాన కట్టడం

 వశిష్టాశ్రమము
 అంతర్వేది దేవాలయమునకు కొంచెం దూరంగా సముద్రతీరమునకు దగ్గరగా ఈ వశిష్టాశ్రమము కలదు. మొదట తగిన పోషకులు లేకుండుటచే ఆశ్రమ సముదాయమున సరియైన సౌకర్యాలు లేకుండెను. తదుపరి దాతల సహకారములు, దేవస్థాన సహాయములతో ఇక్కడ అందమైన ఆశ్రమము నిర్మించబడినది. ఈ ఆశ్రమము వికసించిన కమలము మాదిరిగా నాలుగు అంతస్తులుగా నిర్మించినారు. చుట్టూ సరోవరము మద్య కలువపూవు ఆకారమున ఈ ఆశ్రమము అత్యంత అద్భుతమైన కట్టడము. దీనికి సమీపముగా ద్యానమందిరం, పఠనాశాల, యోగశాల, విశ్రాంతి మందిరం మొదలగునవి కలవు. యాత్రికుల విశ్రాంతి కొరకు నిర్మించిన పర్ణశాలల వంటి అందమైన కట్టడములు కలవు.

లైట్ హౌస్

 దేవాలయానికి దక్షిణంగా సముద్రతీరానికి దగ్గరగా లైట్ హౌస్ కలదు. దీనిని బ్రిటిష్ పాలకుల కాలంలో కట్టినట్టుగా చెపుతారు. దీని చుట్టూ అందమైన తోటలు, పచ్చక పెంచబడుతున్నది. కేవలం భక్తులు, యాత్రికులే కాక ఇక్కడికి పిక్నిక్, వనభోజనాలు వంటి వాటి కోసం వచ్చే సందర్శకుల, విధ్యార్ధులతో ఈ ప్రాంతం కళ కళలాడుతూ ఉంటుంది. లైట్ హౌస్ పైకివళ్ళి చూసేందుకు ఇక్కడ అనుమతి కలదు. మూడురూపాయల నామమాత్ర రుసుము టికెట్ కొరకు వసూలు చేస్తారు. దీని పనుండి చూస్తే లక్ష్మీనరసింహస్వామి దేవాలయము,వశిష్టాశ్రమము,మిగిలిన దేవాలయములు,దూరదూరంగా కల పల్లెకారుల ఇళ్ళ సముదాయాలు, తీరప్రాంతము వెంబడి కల సర్వితోటలు అత్యద్భుతంగా కానవస్తాయి.

 (గుర్రాలక్క) ఆలయము

 నరసింహస్వామి సోదరిగా భావించే అశ్వరూడాంభిక ఆలయం ప్రదాన దేవాలయమునకు ఒక కిలోమీటరు దూరములో కలదు. స్థల పురాణ రెండవ కధనం ప్రకారం రక్తావలోచనుడు వరగర్వంతో పాపాలు చేస్తున్నపుడు నరహరిఆతన్ని సంహరించేందుకు వస్తాడు. నరహరి సుదర్శనము ను ప్రయోగించినప్పుడు, శివుడు ఇచ్చిన వరం ప్రకారం రక్తావలోచనుడి రక్తం పడిన ఇసుకరేణువుల నుంచి వేలాది రాక్షసులు జన్మించి, ఇంకా భీభత్సం సృస్టిస్తారు. నరహరి ఈ విషయం గ్రహించి, పార్వతి అంశతో ఒక మాయాశక్తిని సృష్టిస్తాడు. రక్తావలోచనుని శరీరం నుండి పారిన రక్తం అంతా నేలపై పడకుండా ఆ మాయాశక్తి అశ్వరూపంలో తన నాలుకను విశ్వవ్యాపితం చేసి పడిన రక్తబిందువులను పడినట్లుగా పీల్చేస్తూ రక్తవలోచనుని మరణంలో శ్రీమహావిష్ణువుకు సహాయం చేస్తుంది. ఈ రక్తావలోచనుని సంహరించడం చేసిన తరువాత, వశిష్ఠుని కోరిక పై నరహరి ఇక్కడ లక్ష్మీనృసింహస్వామి గానూ మాయాశక్తి అశ్వరూడాంభిక గానూ వెలిశారు.

అన్న చెళ్ళెళ్ళ గట్టు
 సముద్రములో వశిష్ట నది కలిసే చోటును అన్న చెళ్ళెళ్ళ గట్టు అంటారు. ఇక్కడ సముద్ర నీటి మద్య కొంత భాగం గట్టు మాదిరిగా పొడవుగా ఇసుకమేట వేసి ఉంటుంది. దానికి అటువైపు ఇటువైపు నీరు వేరువేరు రంగులలో ఒకవైపు స్వచ్చంగా, మరొకవైపు మట్టిగా కనిపిస్తుంది. సముద్ర ఆటు పోటులలో కూడా ఇలాగే ఉండటం ఇక్కడి ప్రత్యేకత.

సముద్రతీరం

 వశిష్టానది సముద్రంలో కలిసే ప్రాంతం నుండి మొదలయ్యే అంతర్వేది సముద్రతీరం దాదాపు నాలుగు కిలోమీటర్లమేర ఉంటుంది. సర్వితోటలు, సముద్రపు మొక్కలతోనూ అందంగా ఉండే తీరం ఇది. ప్రయాణ సౌకర్యాల కొరత వలన, బీచ్ వరకూ సరియైన రహదారి లేకుండుట చేత దీనిని పెద్దగా అభివృద్ది పరచలేదు. కాని ఇవే కారణాల వలన తీరం పొడవునా పరిశుబ్రంగానూ, స్వచ్చంగానూ ఉండి మనసుకు ఆహ్లాదం కల్పిస్తుంది. తీరంలో వరుసగా వశిష్టాశ్రమం, అన్న చెళ్ళెళ్ళ గట్టు, లైట్ హౌస్, గుర్రలక్క గుడి, నరసింహస్వామి దేవస్థానాలు కొద్దికొద్ది దూరాలలో ఉంటాయి.

ఇతర ఆలయాలు
 లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం పరిసరప్రాంతములలోనూ, అంతర్వేది గ్రామములోనూ, సముద్రతీరమునకు వెళ్ళు రహదారినందూ పలు చిన్నా పెద్దా ఆలయములు కలవు. వాటిలో ప్రసిద్దమైనవి. విఘ్నేశ్వరస్వామి, అభయాంజనేయస్వామి, షిర్డీసాయి ఆలయాలు మరియు గ్రామదేవతల ఆలయాలు కలవు.

ఇతర విశేషాలు

 అంతర్వేది గ్రామము సినిమా షూటింగులకు పెట్టినపేరు. ఇక్కడ అలనాటి నలుపు తెలుపుల చిత్రాలైన మూగమనసులు లాంటి చిత్రాలనుండి సరిగమలు, అప్పుడప్పుడు, పెళ్ళైనకొత్తలో ఇలా ఇప్పటి వరకూ వేల సినిమాల చిత్రీకరణ జరిగినది. ఇంకా జరుగుతున్నవి.

రవాణా సౌకర్యాలు
 తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలలో అంతర్వేది ఒకటి. అంతర్వేది సఖినేటి పల్లి మండలంలో ఉంది. ఇక్కడికి చేరుకోవాలంటే నరసాపురం వెళ్లి అక్కడ పడవ ఎక్కి సఖినేటి పల్లిలో దిగి ఆటో, బస్సులో వెళ్ళవచ్చు. ఈ మార్గంలో అంతర్వేది నరసాపురం నుంచి 7 కిలోమీటర్లు దూరం. లేదా, చించినాడ బ్రిడ్జి మీదుగా రోడ్ మార్గంలో వెళ్లి దిండి, కేశవదాసుపాలెం మీదుగా అంతర్వేది చేరవచ్చు. ఈ మార్గంలో నరసాపురం నుంచి అంతర్వేది 20 కిలో మీటర్లు ఉంటుంది.

రైలు
 హైదరాబాదు నుండి నరసాపూర్ ఎక్స్‌ప్రెస్ ద్వారా నరసాపురం చేరవచ్చు.

సౌకర్యాలు
 అంతర్వేదిలో వసతి కొరకు దేవస్థాన సత్రం కలదు. కుల ప్రాతిపదికన బయటి వారి ద్వారా నడుపబడు ఇతర సత్రాలు పది వరకూ కలవు. రెండు ప్రైవేటు లాడ్జిలు కలవు. ఇంకనూ మంచి వసతుల కొరకు నరసాపురం, రాజోలు పట్టణాలకు వెళ్ళవచ్చు.

దేవాలయపు పండుగలు, ఉత్సవాలు

* మాఘ శుద్ద సప్తమి- మాఘ బహుళ పాడ్యమి - బ్రహ్మోత్సవాలు
* మాఘ శుద్ధ దశమి- కళ్యాణం
* మాఘ శుద్ధ ఏకాదశి (భీష్మైకాశి) - రథోత్సవం
* జేష్ఠ శుద్ధ ఏకాదశి - శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణం
* వైశాఖ శుద్ధ చతుర్దశి - నృసింహ జయంతి

No comments:

Post a Comment