విశాఖపట్టణం పరిధిలో సింహాద్రి అప్పన్న భక్తులచే పిలవబడే లక్ష్మీనరసింహస్వామి కొలువైన దివ్యక్షేత్రం సింహాచలం. సింహగిరి కొండపై వెలసిన ఈ స్వామిని దర్శించుకోవడానికి నిత్యం వేలాదిగా భక్తులు తరలివస్తుంటారు. దక్షిణ భారత దేశంలో కొలువైన వైష్ణవ క్షేత్రాల్లో ప్రముఖమైనదిగా పేర్కొనబడుతోన్న ఈ ఆలయానికి తిరుమల తర్వాత అంతటి పేరుండడం గమనార్హం.
స్థల పురాణం
అలనాడు విష్ణు భక్తుడైన ప్రహ్లాదుడు సింహాచలంలోని నహసింహ స్వామి విగ్రహాన్ని ప్రతిష్టించాడని ప్రతీతి. తన తండ్రి, రాక్షసుడైన హిరణ్యకశిపుడు విష్ణువును చూపించమంటూ స్థంభాన్ని పగులగొట్టిన సమయంలో అందులోంచి మహావిష్ణువు నరసింహుడి అవతారంలో ప్రత్యక్షమై హిరణ్యకశిపుడిని సంహరించాడన్న పురాణ కథ అందరికీ తెలిసిందే.
ఇలా తనకోసం ప్రత్యక్షమైన నరసింహుడి అవతారాన్ని ప్రహ్లాదుడు మొదటగా సింహాచలంలో ప్రతిష్టించాడని పురాణాలు చెబుతున్నాయి. అయితే సింహాచలంలోని ఆలయాన్ని మాత్రం పురూరవుడనే రాజు నిర్మించినట్టు పురాణాలు చెబుతున్నాయి. పురూరవుడు సింహాచలం ప్రాంతాన్ని సందర్శించిన సందర్భంలో ఇక్కడ నేలలో కప్పబడిన నరసింహస్వామి విగ్రహం బయటపడింది.
దాంతో ఆరాజు ఇక్కడ ఆలయాన్ని నిర్మించాడని అలాగే ఈ సందర్భంగా ఆకాశవాణి పలికిన పలుకుల మేరకు స్వామివారిని ఎల్లప్పుడూ చందనం పూతతోనే ఉంచే ఏర్పాటు చేశారు. అలా ఆనాడు మొదలైన ఆచారమే నేటికీ కొనసాగుతోంది. స్వామివారిని ఏడాదిలో 12 రోజులు తప్ప మిగిలిన రోజులంతా చందనం పూతతోనే దర్శించాల్సి ఉంటుంది.
క్షేత్ర విశేషాలు
సింహాచలంలో ఉండే స్వామివారి గాలిగోపురంకు ఓ ప్రత్యేకత ఉంది. అన్ని దేవాలయాల్లో ఉన్నట్టు తూర్పు ముఖంగా కాకుండా సింహాచలంలోని గాలిగోపురం పడమర ముఖంగా ఉంటుంది. అలాగే ఇక్కడ గర్భగుడికి ఎదురుగా ఉండే ద్వజస్థంభాన్ని కప్ప స్థంభం అని వ్యవహరిస్తారు. గతంలో ఇక్కడే కప్పం అనబడే పన్నులు చెల్లించేవారని అందుకే కాలగమనంలో ఈ స్థంభానికి కప్ప స్థంభం అనే పేరు వచ్చిందని చెబుతుంటారు.
సింహాచలం కొండపై అక్కడక్కడా జలధారలు ప్రవహిస్తుంటాయి. భక్తులు వీటిలో స్నానం చేసి స్వామివారిని దర్శిస్తారు. వీటిలో గంగధార, ఆకాశధార, చక్రధార, మాధవధార అనేవి ముఖ్యమైనవి.
No comments:
Post a Comment