Saturday, September 14, 2013

మంత్రం ఫలించాలంటే ఈ మూడు తప్పనిసరి

పెద్దలు ఉపదేశం చేసే మంత్రం తత్ సిద్ధిని అందించాలి అంటే మూడింటియందు తప్పని సరిగా విశ్వాసం ఉండి తీరాలి అని శాస్త్రం చెబుతుంది.

మంత్రే తత్ దేవతాయాంచ తదా మంత్రప్రదే గురౌ |
త్రిశు భక్తి సదా కార్యా సాధి ప్రథమ సాధనం ||

మంత్రం యందు భక్తి కావాలి. మంత్ర ప్రతిపాద్యమైన దేవత యందు విశ్వాసం కావాలి. మంత్ర ప్రతిపాద్యమైన దేవత అంటే మంత్రం వల్ల తెలిసే వ్యక్తి లేక మంత్రం యొక్క తాత్పర్యము అని అర్థం. క్షీరము అంటే పాలు అని అర్థం కాదు, అది అనువాదం అని అంటారు. తెల్లటి పుష్టి కలిగించే ద్రవాహారం, దానికి పాలు అని పేరు. అంటే క్షీరం అనే శబ్దం ఒక వస్తువును సూచిస్తుంది. ఆ వస్తువు దాని అర్థం అవుతుంది. అట్లా మంత్రం అనగానే ఆయా మంత్రంలోని పదాల అర్థం అని కాదు, ఆ మంత్రం ప్రతిపాదించే దేవతా విశేషం ఏదో ఆ మంత్రానికి అర్థం అవుతుంది. ఆ దేవతా విశేషాన్ని కనిపించేటట్టుగా స్పష్టం అయితే అప్పుడు మంత్ర అర్థం తెలిసినట్లు. అంతే కాని మంత్రంలో పదాల అర్థం మాత్రమే తెలుసు అని అంటే మంత్ర తాత్పర్యం తెలియదు అనే లెక్క. మంత్రం గోచరించాలి అంటే మంత్రాన్ని వినవల్సిన క్రమంలో విని, అనుసంధించే క్రమంలో అనుసంధిస్తేనే ఫలిస్తుంది. మంత్రం పై విశ్వాసం అంటే ఆ మంత్రం యొక్క నియమాలపై విశ్వాసం అని అర్థం. ఎవరో ఎవరికో చెబుతుంటే విని, పుస్తకం చూసి చేస్తే మంత్రం ఫలించదు. ఒక గురు ముఖతః శ్రవణం చేసినప్పుడు మాత్రమే ఫలిస్తుంది. ఇది మంత్రానికి నియమం.

మంత్రాలు రెండు రకాలు అవి స్వరం కల్గినవి, స్వరం లేనివి. విష్ణు సహస్ర నామాలలో ఉన్నవి ఎన్నో మంత్రాలు. ఒక్కోటి ఒక్కో ఋషి దర్శించినవి. ఇవన్నీ స్వరం లేనివి కానీ మననం చేస్తే కాపాడేవి, అందుకే అవి మంత్రాలు. గాయత్రి మంతం లాంటివి స్వరం కల్గినవి. ఈ మంత్రాన్ని విశ్వామిత్రుడు అనే మహర్షి దర్షించాడు. దాన్ని తర్వాతి వారికి అందించాడు. విశ్వామిత్రుడు ఆ మంత్రాన్ని ఒక స్వరంతో ఉపాసించాడు. అట్లా స్వరం కల మంత్రాలకి ఒక్కో వేదంలో ఒక్కో స్వరం ఉంటుంది. కానీ ఈ మద్య కాలంలో గాయత్రి మంత్రానికి తోచిన స్వరాలు కల్పిస్తున్నారు. స్వరం మార్చి చదవడం తప్పు. అట్లా చేయడం ఆ మంత్రార్థమైన దేవతని హింసించినట్లు అవుతుంది. అపౌరుషేయం అయిన వేద రాశికి స్వరం మారిస్తే అది శుభం కాదు. విశ్వామిత్రుడు కూడా ఆ మంత్రాన్ని తయారు చేయలేదు. దాన్ని దర్శించి ఇచ్చాడు. మంత్రానికి స్వరమే ప్రాణం అని అంటారు. అట్లా మంత్రాలని పాటించడం అంటే దానికున్న స్వరంతోనే ఉపాసించాలి. మంత్రం యందు భక్తి అంటే ఇది.

No comments:

Post a Comment