Sunday, August 2, 2015

వర్ణాశ్రమధర్మం అంటే ఏమిటి?

వర్ణాశ్రమధర్మం అంటే సాంఘిక జీవనం సాఫీగా సాగాతానికీ, ఒకే వృత్తిని అందరూ అవలంబించకుండా వుండతానికీ, మానవ సదుపయోగానికీ వర్ణాశ్రమ ధర్మం ప్రవేశ పెట్టడం జరిగింది.

1. వర్ణధర్మ ప్రారంభం ఎలా జరిగిందంటే, సూక్ష్మబుద్ధి, సాతవిక యోచన వున్నవారినీ, పాపభీతి అహింసాప్రవృత్తి, వున్నవారినీ, కాయకష్టం చేయలేని బలహీనుల్ని, ఒక భాగంగా విభజించారు. వీరే బ్రాహ్మణులు. అయితే ఈ విభాగంలోనివారు ధర్మప్రవృత్తికి కట్టుబడి, తమ వృత్తికి లోబడి వుండకపోతే వాళ్ళను బ్రాహ్మణులుగా పరిగణించేవారు కాదు. సంఘ బహిష్కారం జరిగించేవారు. క్రూరమృగాలున్నఅడవులకు నేట్టేవారు.

2. ధైర్యసాహాసాలు, దేహశక్తి, పోరాటపటిమతో పాటూ రక్షణా శక్తి గలిగిన వారని నాయకులుగా నియమించుకొన్నారు. వీరే ‘క్షత్రియులు’. తమ గుంపులోనివారిని మరొక గుంపువారినుండి ఏ ఆపదా రాకుండా కాపాడటం, క్రూర జంతువుల బారినుండి స్త్రీలకూ, వృద్ధులకు, పసివారికి రక్షణ కల్పించటం ఈ వర్ణంవారి బాధ్యత.

3. తెలివితేటలూ, ధర్మబుద్ధి, న్యాయవివక్ష కలిగి వినిమయ దక్షత కలిగినవార్నిని ఆహార పదార్థాలు అందరికీ, అన్నీ అందటంకోసం వస్తుమార్పిడి జరగటం కోసం నియమించబడినవారే ‘వైశ్యులు’. ఎవరు ఏ విధమైన ఆహార పదార్థాలు సేకరించినా అవి అందరకూ వస్తుమార్పిడి పద్ధతిలో అందేట్లు చేయటం వీరి కర్తవ్యం.

4. ఒక గుంపులో వేయిమంది జనంవుంటే పదిమందిని నాయకులుగానూ, ఇద్దరినీ ఆహార వస్తువుల మార్పిడికిగాను, ఇద్దరినీ (బ్రాహ్మణులను) న్యాయరక్షణకు గానూ, నియమించుకొని మిగిలిన వారందరూ వ్యవసాయ వృత్తికీ, అడవులలోని కందమూలాలకూ ఫలసేకరణకు వెళ్ళేవారు. అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణానికి చెందినవారు పదిమంది వుంటే మిగిలిన  తొంభైమంది శూద్రవర్ణంవారు వుండేవారు.
అందరూ నియమానికి కట్టుబడి వుండేవారు.

గుంపులు గుంపులుగా వుంది బ్రతుకు సాగించే ఆనాటి జనంలో ఒక దురాచారం వుండేది. ఎదుటి గుంపులో స్త్రీలను మాటువేసి అపహరించుకొని పోయేవారు. శాశ్వతంగా తమవద్దనే వుంచుకోనేవారు. అబలలైన స్త్రీలు దౌష్ట్యానికి తలవంచి జీవించేవారు. తమ గుంపులోని స్త్రీలను ఎదుటి గుంపువారు అపహరించుకొని పోవటం అవమానంగానూ, చేతగానితనంగాను భావించేవారు. సమయం చూచి మాటువేసి అవతలి గుంపువారి ఆడవారిని బలాత్కరంగా ఎత్తుకొచ్చి స్వంతం చేసుకొనేవారు.
ఈవిధంగా సాగుతుండేది వారి జీవనం.
ఈ పరిస్థితులలో – రక్షణకు క్షత్రియవర్ణం, ధర్మన్యాయ నిర్ణయానికి బ్రాహ్మణ వర్ణం, అందరికీ అవసరమయ్యాయి. ఈ రెండు వర్ణాలవారు పెద్దలయ్యారు. అయితే ఎవరు ధర్మం తప్పి చరించేవారు కాదు.
బుద్ధిచాతుర్యం, నియమపాలన, శాకాహార నియమం కలిగిన బ్రాహ్మణ వర్ణం అందరి అభిమానాన్ని, మెప్పునీ సాధించారు. క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలను శాసించేస్థితికి ఎదిగారు. నాలుగు వర్ణాలలో వీరే అగ్రస్థానం సాధించారు. చాల నియమబద్ధంగా కూడా వుండేవారు. పర స్త్రీలవంక కన్నెత్తి చూచేవారు కాదు. ఒక స్త్రీతోనే నియమబద్ధంగా వుండటం శూద్ర క్షత్రియ వైశ్య వర్ణాలవారిని ఎంతో ఆకర్షించింది. అందరూ బ్రాహ్మణ వర్ణాన్ని అగ్రవర్ణంగా అభిమానించి గౌరవించటం మొదలు పెట్టారు.
అప్పటికి భాష వున్నా లిపి లేదు. చతుర్వర్ణాలలో బుద్ధివంతులైన బ్రాహ్మణవర్ణమే భాషకు లిపిని సమకూర్చారు. క్షత్రియ వైశ్యవర్ణాలవారికి లిపిని నేర్పించి విద్యావంతులను చేయటమే కాకుండా న్యాయ నీతి ధర్మ సూత్రాలు రచించారు. అవన్నీ అందరికీ ఆమోదయోగ్యం అయ్యాయి.
బుద్ధికుశలత వున్నా బ్రాహ్మణ వర్ణం అగ్రవర్ణం అయింది. (ఈనాడు మనం చూస్తున్న బ్రాహ్మణ వర్ణానికి, ఆనాటి బ్రాహ్మణ వర్ణానికి ఏ విధమైన సారూప్య సంబంధాలు లేవంటే లేవని చెప్పటం దుస్సాహసమే అవుతుంది. క్షమించాలి.)
ఆనాటి బ్రాహ్మణ వర్ణానికి వర్ణ వివక్ష యింత నీచంగా లేదు. వుండివుంటే పరం బ్రహ్మర్షి సద్బ్రాహ్మణుడైన వశిష్టమహర్షికి పంచమ జాతికన్య అయిన అరుంధతి భార్యగా అయ్యేది కాదు గదా!
ఆ|| పాపవర్తనుండు బ్రాహ్మణుండయ్యును
నిజము శూద్రుకంటె నీచ తముడు
సత్యశౌచ ధర్మశాలి శూద్రుండయ్యు
అతడు సద్విజుండయనిరి మునులు
(శ్రీ మహాభారతం పంచమాశ్వాసం అరణ్యపర్వం 137)
గౌతముని శాపంవల్ల బ్రాహ్మణులు ధర్మదూరులై అపమార్గాన్ని అవలంబించి, సదాచారానికి దూరమై, ధనలోభానికి లొంగిపోయారు. శాస్త్రాలను తలక్రిందుల చేసారు. అసంబద్ధ ఆచారాలను అక్రమ సాంప్రదాయాలను అమాయక జనసామాన్యుల్లోకి చొప్పించారు. ఇది త్రేతాయుగంలో చివరి భాగాన జరిగిందని అంచనా.
అయితే అందరూ గమనించవలసిన విషయం ఒక్కటుంది. శ్రీ మద్రామాయణం వ్రాసిన వాల్మీకి బ్రాహ్మణుడు కాదు. భారతీయులు మాత్రమే కాదు బ్రాహ్మనవర్ణం ఆరాధించి పూజించే అయోధ్య రాజైన శ్రీరాముడు బ్రాహ్మణుడు కాదు. శ్రీకృష్ణుడు బ్రాహ్మణుడు కాదు. బ్రహ్మర్షి విశ్వామిత్రుడు బ్రాహ్మణుడు కాదు. ఇలా చెప్పుకుంటూ పొతే చాల వుంది!!
బ్రాహ్మణ – క్షత్రియ – వైశ్య – శూద్ర జాతులే కాక ఐదవ జాతిగా (పంచమజాతి) కొందరిని విభజించటం జరిగింది. వారే మాల మాదిగాలుగా ఊరికి దూరంగా ప్రత్యేకంగా వుంటూ వచ్చారు. మాంసాహారం వీరికి ప్రధానాహారం. చెప్పులు కుట్టటం చర్మ సాధానాలు తయారుచేయటం, కూలిపని చేయటం వీరికి ముఖ్యవృత్తిగా శాసించటం జరిగింది. శ్మశానాలను కాపలా కాయటం కూడా వీరి బాధ్యతే!!
పంచమజాతి వారికి ఆలయ ప్రవేశం వుండేది కాదు. వారికి ప్రత్యేక ఆచారాలు, ప్రత్యేక దేవతలు, ప్రత్యేక వస్త్రధారణ వుండేవి. మారెమ్మ, మహంకాళమ్మ, పోతమ్మ, కంకాళమ్మ మొదలైన దేవతలను కొలవటం, మాంసాహారులు కావటం వాళ్ళ జంతు బలులు ఇవ్వటం వారికి ఆచారమయింది.

అన్నదములైన హిందువులు కులాల పేరుతో విడిపోయి హిందూ శక్తినీ, హిందూ మతాన్నీ, హిందూ ఆదర్శాన్నీ , హిందూ తత్వాన్ని కకావికలు చేసారు. ప్రపంచ దేశాలలో ఎక్కువ కులాలు ఉన్న దేశంగా భారతేదేశం నమోదు అయింది.

హిందీ భాషను భారతీయుల భాషగా చేయాలనీ, భారతీయు లందరికీ ఒకే భాష వుండాలనీ ఎంతో మంది ప్రయత్నం చేసారు. కానీ మాతృభాషా వ్యామోహం వున్నా మన భారతీయులు అంగీకరించలేదు. దురదృష్టం!
“మానవ కల్యాణంకోసం నియమించు కొన్న వర్ణాశ్రమ ధర్మ వెర్రితలలు వేసి వికృతరూపం దాల్చి, విషపు కోరలు చాచి హిందూమతాన్ని వేయి ముక్కలుగా చేసింది. ప్రపంచ నాగరికతలో పేరుపొందిన హిందువులు వర్ణధర్మంతో విడిపోయారు. శూద్ర వర్ణం వ్రక్కలైపోయి వివిధ కులాలుగా మారిపోవటం జరిగింది. ఇపుడు మన కులాల సంఖ్య మూడువేలుకు పైనే వుంది.”

వర్ణాశ్రమ ధర్మ కాలక్రమంలో నశించిపోయింది. ధనసంపాదన జీవిత ధ్యేయంగా మారి అన్ని వర్ణాలవారూ అన్ని ధర్మాలనూ మన్నిస్తున్నారు.
శుభం సర్వేజనా: సుఖినోభవంతు.

No comments:

Post a Comment