Saturday, May 23, 2015

కాకిమీద బ్రహ్మాస్త్రం

మనం తరచుగా పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వాడుతూ ఉంటాం కదా! అసలు సామెత కాకిమీద బ్రహ్మాస్త్రం.. ఇది రాముడు కాకిమీద వేశాడు.
వనవాసంలో ఉండగా ఒకనాడు లక్ష్మణుడు వనఫలాలు తీసుకురావడం కోసం అడవిలోకి వెళ్ళాడు. ఇక్కడ సీతారాములు ఏకాంతంగా ఉండగా రాముడు సీతాదేవి తొడమీద తలపెట్టుకొని ఆమాట ఈమాట చెప్పుకుంటూ ఉండగా ఎక్కడినుండో ఒక కాకి వచ్చి గాలివలన సీతమ్మ కట్టుకున్న కోక పైట తొలగడంతో స్థానాలని కాకి మాంసం ముద్ద అనుకోని పొడవడం మొదలుపెట్టింది. సీతమ్మ కాకిని తన వద్దకు రాకుండా చేతితో తోలుతూ తూలీ పడడంతో రాముడు చూసి నవ్వుకున్నాడు. అప్పుడు సీతమ్మ మూతి బిగించేసరికి రాముడికి మరికొంత నవ్వు వచ్చి నవ్వుకున్నాడు. అలా ఊసులు చెప్పుకుంటూ రాముడు సీతమ్మ తోడమీదే నిద్రపోయాడు. నిద్రలోకి జారుకున్న రాముడిని కనిపెట్టిన కాకి మళ్ళి సీతమ్మ స్థానాన్ని పొడవడం మొదలుపెట్టింది. ఒకప్రక్క రాముడిని నిద్రాభంగం కాకూడదని సీతమ్మ కాకిని తోలలేక అలాగే ఉండడంతో కాకి సీతమ్మ స్థనాన్ని చీల్చేసింది. దాంతో వేడివేడి నెత్తురు బయటికి వచ్చి నిద్రపోతున్న రాముడి నుదుటిపై వర్షపు చినుకుల వలే బొట్లు పడడం మొదలుపెట్టింది. రాముడు రక్తపు బొట్లును చూసి కోపించి సీతమ్మను చూసి కోపంతో కన్నేర్రజేసి ధనుస్సు లేకపోవడంతో ప్రక్కనే ఉన్న గడ్డిపరక తీసుకొని బ్రహ్మాస్త్రం మంత్రించి కాకిమీద వేశాడు..
అసలు ఈకాకి ఎవరు? రాముడంతటివాడు కాకిమీద బ్రహ్మాస్త్రం ఎందుకు వేయవలసి వచ్చింది?
పూర్వకాలంలో గౌతముడు అహల్య అనేవారు ఉండేవారు. ఈకథ అందరికీ తెలిసినదేకదా! అహల్య అంటే ఇంద్రుడికి విపరీతమైన ప్రేమ. ఒకరోజు రాత్రి గౌతముడిని బయటికి పంపడానికి కాకిలా రూపం మార్చుకొని వచ్చి అహల్య గౌతముడు ఉన్న గుడిసె ముందు అరవడం మొదలు పెట్టాడు. గౌతముడు బయటికివచ్చి కాకి రూపంలో ఉంది ఇంద్రుడే అని కనిపెట్టి అహల్య కోసం ఇన్ని నాటకాలు ఆడతావా! ఉండు నీపని చెప్తాను అని, చేతిలోకి కమండలంలో నీరు తీసుకొని అభిమంత్రించి కాకిరూపంలో వచ్చావు కనుక కాకువైపో! అని శపించాడు.
ఇది తెలుసుకున్న బ్రహ్మ గౌతముడి వద్దకు వచ్చి మహానుభావా! గౌతమా!ఇంద్రుడికి ఇచ్చిన శాపాన్ని ఉపసంహరించు. ఇంద్రుడంటే ముల్లోకాలకు అధిపతి. ఈ మహాయుగం గడిచేవరకు ఇతడే ఇంద్రుడిగా ఉండాలని త్రిమూర్తులమైన మేము నిర్ణయించాం. మా నిర్ణయానికి తిరుగులేదు. కాని నీ శాపం వలన పదవీ బ్రష్టుడైతే ముల్లోకాలలో కల్లోలం ఏర్పడి ప్రజలు నాశనం చెందుతారు. కనుక శాపాన్ని వెనక్కి తీసుకో అని బ్రహ్మదేవుడు ప్రార్థించగా, గౌతముడు అలోచించి శాపం ఉపసంహరించడం కుదరదు. కాని "ఆత్మావై పుత్రనామాసి'' అని కదా శాస్త్రం. అంటే తండ్రే కొడుకు రూపంలో పుడతాడు. తండ్రి చేసిన పాపపుణ్యాల ఫలితమే పిల్లలు. తండ్రి ఆస్తులే కాదు, అప్పులు, తండ్రి చేసిన పాపాలు కూడా పుత్రులు పంచుకోవలసిందే. పుణ్యం చేస్తే మంచి కొడుకు పుడతాడు. అదే పాపం చేస్తే దరిద్రపు సంతానం కలిగి ఏడిపించుకుతింటారు. ఎవరో వచ్చి పిల్లలని చెడగొట్టరు. తల్లిదండ్రులు చేసిన పాపపుణ్యాల ఫలితాలే పిల్లల రూపంలో ప్రతిఫలిస్తూ ఉంటాయి. ఇది కేవలం కొడుకుకే సుమా! కూతురికి చెందదు. పుత్రుడు పైకొస్తే నాఘనత, చెడిపోతే ప్రక్కవాడిని తిట్టడం లాంటివి దండగ.. అందుకే నిత్యం వీలున్నంత వరకు మంచి సంతానం కోసం పుణ్యమే చేయాలి. దానధర్మాలు చేయాలి. వాటి ఫలితాల రూపంలో సంతానం కలుగుతుంది.
అని గౌతముడు తండ్రి పుణ్యం కొడుకే, పాపమూ కొడుకే కనుక నీశాపం కొడుకు అనుభవించు గాక! అని శాపాన్ని మరలించాడు.రాముడు చేతిలో చావుదెబ్బలు తినేవరకు నీకొడుకు కాకి రూపంలోనే సంచరించు గాక! త్రేతాయుగంలో రాముడు వీడిమీద బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తాడు. దాంతో అన్నిలోకాలు తిరిగి మరలా రాముడినే ఆశ్రయిస్తాడు. అప్పుడు నీ కొడుకు శాపం తొలగుగాక! అని గౌతమ మహర్షి శాపానికి విముక్తిని ఇచ్చాడు. అప్పటి నుండి ఇంద్రుడి పుత్రుడు జయంతుడు అనేవాడు కాకిగా మారిపోయాడు.
రామబాణం వేయడంతో కాకి ఎగురుకుంటూ ఎగురుకుంటూ ముందుగా తండ్రైన ఇంద్రుడి దగ్గరకు వెళ్లి రక్షించమని అడిగితె రావణుడి దెబ్బకే దిమ్మతిరిగింది. రామ బ్రహ్మాస్త్రం ఆపడం మావల్లకాదు వెళ్ళు వెళ్ళు అని గెంటేశారు. సకల దేవతల దగ్గరికీ తిరిగాడు. మావల్ల కాదు అన్నారు. ఋషుల దగ్గరికి వెళ్ళాడు ఋషులు బాగా అలోచించి ''రాముడి దగ్గరికి వెళ్లి వీడిని రక్షించమని అడిగితె రక్షిస్తాడు. కాని వీడే తెలుసుకొని శరణు వెడితే వీడికి ఉన్న శాపం పోతుంది. ఈరోజు వీడు తాత్కాలికంగా ఈ బుద్ది విడిచిపెట్టినా ఎప్పటికైనా ప్రమాదమే. అని భావించి విషయం చెప్పకుండా పొమ్మని చెప్పారు. ఈవిధంగా అన్ని లోకాలు తిరిగి తిరిగి చివరికి బ్రహ్మదగ్గరికి వెళ్లి రక్షించు మహాప్రభో అని వేడుకోగా, బ్రహ్మ నవ్వి! ఆ బాణాన్ని వేసింది అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీరాముడు. ఆ రాముడు విడిచిన ఆ రామబాణాన్ని ఆపడం ఆరాముడికే తప్ప ఎవ్వరి తరం కాదు. నేను కాదు కదా ఈ భువన భండాలలో ఏలోకానికి వెళ్ళినా నిన్ను రక్షిస్తామని ఎవ్వరూ హామీ ఇవ్వరు. పో వెళ్ళు ఆయన్నే పట్టుకో అన్నాడు. వెళ్లమనగా శివుడి దగ్గరికి వెళ్ళాడు. నవ్వి ఊరుకున్నాడు. ఇలా తిరిగితిరిగి ఎక్కడ తిరిగిన శాంతి దొరక్క, సౌఖ్యం లేక తన మరణాన్ని ఆపే శక్తి లేక చివరికి రాముడి వద్దకే వచ్చి కాళ్ళమీద పడి మహాత్మా! నన్ను రక్షించు. నీ బాణం నాప్రాణం తీస్తుంది అని శరణు వేడుకున్నాడు.
ఇక్కడ ఒక సందేహం రావచ్చు మీకు. అసలు రామబాణం అందునా బ్రహ్మాస్త్రం వేస్తే ఈకాకి గాడు ఇన్ని లోకాలు ఎలా తిరిగ గలిగాడు. తండ్రితో మాట్లాడడానికి ఆగాడు, దేవతలతో మాట్లాడడానికి, ఋషులతో, బ్రహ్మ దేవుడితో, శివుడితో మాట్లాడడానికి అనేక పర్యాయాలు ఆగాడు కదా ఎందుకని రామబాణం వాడిని సంహరించలేదు? ఇక్కడ రాముడి ఉద్దేశ్యం చంపడం కాదు.ధర్మం చెప్పడం ఉద్దేశ్యం. అందరి దగ్గరికి వెళ్లి వేడుకుంటుంటే అస్త్రం బెదిస్తుంది తప్ప చంపలేదు. గుణపాటం చెప్పడమే ఉద్దేశ్యం.
రాముడు అప్పుడు.. సీతాదేవి వక్షస్థలాన్ని చెల్చడం అంటే వీడు చంపడానికి అర్హుడు. అయినా శరణు వేడాడు కనుక కాపాడాలి. శరణు వేడిన వాడు చంపడానికి అర్హుడు అయినా కాపాడతాను ఇది నా సంకల్పం.
సహృదేవ ప్రసన్నాయ తవాస్మితి చ యాచతే అభయం సర్వభూతేభ్యః తదాం ఏతత్ వ్రతం మమ!!
ఎవడైనా ఒక్కసారి నీవాడిని రక్షించమని పాదాలపై పడితే వాడెవడైనా వాడికి అభయమిస్తాను. చంపడానికి తగిన పాపం చేసినవాడిని కూడా రక్షిస్తాను. ఇది నా నియమం అనిఅభయమిచ్చి రక్షించాడు.
కాకులు పొడుచుకు తింటాయి కదా! అది వాటి ప్రవ్రుత్తి కదా అనే సందేహం రావచ్చు. ఐతే ద్వాపరయుగం వరకు కాకులు బ్రతికి ఉన్న జీవాన్ని దేనిని పొడుచుకు తినలేదు. ద్వాపరయుగం కలియుగ సంధికాలంలో అంటే ధర్మరాజు స్వర్గారోహణ సమయానికి అంటే ఈకాకులు బ్రతికి ఉన్న జీవులని కాకులు పొడుచుకు తినడం, అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు రావడం విని కలియుగం ఆరంభం అయిందని పాండవులు స్వర్గారోహణ కి వెళ్ళిపోయారు.
నీవు ధర్మం తప్పావు. ఎప్పుడో కలియుగంలో జంతువులను పీక్కు తినాల్సిన నీవు ఇప్పుడు ఆ తప్పు చేసి వదనార్హుడివి అయ్యావు. నన్ను శరణు కోరావు కనుక అభయం ఇచ్చి కాపాడుతున్నాను. ఐతే నేను వేసిన బ్రహ్మాస్త్రం అమోఘం. నిన్ను సంహరించడానికి దానిని నీమీద ప్రయోగించాను. ఆ బ్రహ్మాస్త్రం వ్యర్థం కాకూడదు. బ్రహ్మాస్త్రం వేసినపుడు అవతలి వారిని చంపాలి. చంపడానికి కుదరనప్పుడు నేను వారిని రక్షించాలి అనుకున్నప్పుడు వారి శరీరంలో ఏదో ఒక అవయవం అయినా ఇవ్వాలి. బ్రహ్మాస్త్రాన్ని వృథాగా వెనుకకు తీసుకోకూడదు. అవయవం తీసుకోవడం కూడా చంపడంతో సమానం. కనుక నీశారీరంలో ఏదైనా ఒక భాగాన్ని దానికి ఇచ్చేయ్ అప్పుడు నువ్వు బ్రతుకుతావు అన్నాడు. కాకి బాగా అలోచించి కాళ్ళు పొతే నిలబడడం కష్టం, రెక్కలు పొతే ఎగరడం కష్టం, ముక్కు పొతే తినడానికి లేక చచ్చిపోతాను. ఇక మిగిలింది కళ్ళు. వీటిలో ఒక కన్ను తీసేసుకో అన్నాడు. అదికూడా ఎడమకన్ను ఇవ్వడం పాపం కనుక కుడికన్ను తీసుకో అన్నాడు. బ్రహ్మాస్త్రం వెంటనే చిన్న నొప్పి కూడా కలుగకుండా, కన్ను తీస్తుందో లేదో తెలియకుండా కుడికన్ను పెకిలించి వేసి సముద్రంలోకి వెళ్లి మునిగి పరిశుద్దమై తిరిగి వచ్చి అమ్ములపొదలొ చేరింది. ఆరోజు నుండి కాకికి కుడికన్ను పోయి ఏకాక్షిగా పిలువబడింది.
ఈ కన్నుపోయాక కాకి రాముడివైపు దీనంగా చూసింది. ఈ కాకికి కన్ను పోవడంతోనే మిగిలిన కాకులన్నింటికి కళ్ళు పోయాయి. ఒక వంశానికి రాజైన వాడికి శిక్ష వేస్తె ఆ జాతి జాతి అంతటికీ వెళుతుంది. పాము పడగపై శ్రీకృష్ణుడు నాట్యం చేయగానే శ్రీకృష్ణుడి పాదాలు ప్రతి పాము పడగపై ఉండిపోయాయో అలా కాకులన్నింటికీ కళ్ళు పోయాయి. రాముడు చూసి ''ఓ కాకి! నీ పాపం వలన మీ జాతి అంతటికీ శాపంలా ఎలా మారిందో చూశావా! కుడి కన్ను పోయింది. యావజ్జీవితం దూషిస్తూ ఉంటాయి నిన్ను. కాబట్టి నిన్ను అనుగ్రహిస్తాను అని ''ఈరోజు నుండి నువ్వు కుడి వైపుకి చూస్తే కుడి కన్ను కనిపిస్తుంది. ఎడమ వైపు చుస్తే ఎడమ కన్ను కనబడుతుంది. నువ్వు ఎటు చూస్తే అటువైపు కన్ను మాత్రమే కనబడుతుంది. రెండోవైపు కన్ను మాత్రం కనబడదు. ఈవిధంగా ఒంటి కంటితో కూడా సుఖపడతావు. అని కాకికి వరం ఇచ్చి మొత్తం కాకి జాతిని రక్షించాడు.. కాకపోతే ఎవరో మాట మార్చి పిచ్చుకమీద బ్రహ్మాస్త్రం అని పేరు వచ్చింది.. 

No comments:

Post a Comment