Thursday, May 29, 2014

లింగాభిషేకములో పరమార్ధం

శివలింగం :-
నిర్గుణ పరతత్వ స్వరూపం. భగవంతుడు సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి. భక్తులు ఏ రూపంతో పూజించినా, ఏ విధంగా అర్చించినా, ఏ రీతిలో అలంకరించినా అంతర్గతమైన పరతత్వం ఒకటే. ఈ విధమైన పరతత్వానికి రూపం, ఆకారం, అవయవాలు లేవు. ఈ సత్య విషయాలను తెలియజెప్పే తత్వస్వరూపమే "లింగం"

లింగాభిషేకములో పరమార్ధం :-
పానిపట్టుపై శివలింగం అంటే మానవుని హృదయపద్మంపై ఆత్మలింగము. పంచామృతాభిషేకం - భక్తీ, మంత్రజపం, నామస్మరణం, ధ్యానం, కీర్తనాలతో దైవాభిషేకం చేయాలి. జలధారాపాత్ర అనన్య అచంచల నిరంతర సాధనాభక్తికి చిహ్నం, లింగం జీవాత్మకు సంకేతం. జీవాత్మ పరమాత్మలను అనుసంధానం కావించే సాధనమే అభిషేకం.

శివ షడక్షరీ స్తుతి

(Shiva Shadakshari Stuti)

శ్రీ మేధా దక్షిణామూర్తి రూపాయ పరమాత్మనే నమ:

శివాయ వేద్యాయ నాథాయ గురవే నమ:

ఓం కారం తు పరం బ్రహ్మ సర్వమోంకార సంభవమ్

అకారోకారమంతాయ ఓంకారాయ నమో నమ:

న నమస్తే దేవదేవేశ నమస్తే పరమేశ్వర

నమస్తే వృషభారుఢ నకారయ నమో నమ:

మ: మహాదేవం మహాత్మానం మహా పాతక నాశనం

మహా నటవరం వందే మకారాయ నమో నమ:

షి శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహ కారకమ్

శివమేకపదం దేవం శికారాయ నమో నమ:

వా వాహనం వృషభో యస్య వాసుకి: కంఠభూషణమ్

వామే శక్తిధరం దేవం వాకారాయ నమో నమ:

య యత్ర యత్ర స్థితో దేవ: సర్వవ్యాపీ మహేశ్వర:

యల్లింగం పూజయేన్నిత్యం యకరాయ నమో నమ:

ఓం ఓంకారామంత్ర సంయుక్త నిత్యం ధ్యాయంతి యోగిన:

కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమ:

మహాదేవ: పరో మంత్ర: మహాదేవం: పరం తప:

మహాదేవ: పరా విద్యా మహాదేవ: పరా గతి:

ఓం నమ: శివాయేతి చ షడ్లింగాయ నమో నమ:

మోక్షకామ్య ప్రదాత్రే చ విశ్వరూపాయ తే నమ: నమ:

శివాయ సోమాయ సతారాయ షడత్మనే

స్వయం జ్యోతి: ప్రకాశాయ స్వతంత్రాయ నమో నమ:

మహాదేవాయ మహతే జ్యోతిషేనంతతేజసే నమ:

శివాయ శాంతాయ బ్రాహ్మణే లింగమూర్తయే

ఓంకారాయ విశేషాయ నమో దుందుభినే నమ:

నమ: శివాయ రుద్రాయ ప్రధానాయ నమో నమ:

గురవే సర్వలోకానం భిషణే భవరోగిణామ్

నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమ:

జ్ఞానానందం జ్ఞానరూపం జ్ఞానబీజం సనాతనమ్

తపసాం ఫలదాతారం దాతారం సర్వసంపదామ్

ఋత్గగం సత్యం పరం బ్రహ్మ పురుషం కృష్ణ పింగళమ్

ఊర్థ్వరేతం విరూపాక్షం విశ్వరూపం నమోమ్యహమ్

ధ్యాయే దభీష్టసిద్ధ్యర్థ మహర్నిశ ముమాపతిం

ఈశానం సర్వవిద్యానా మీశ్వరేశ్వర మవ్వయమ్

గోభీ ర్జుష్టం ధనేన హ్యాయుషా చ బలేన చ

ప్రజయా పశుభి: పుష్కరాక్షం

త న్మే మన: శివసంకల్పమస్తు

సత్యం మాతా పితా జ్ఞానం ధర్మో భ్రాతా దయా సఖా

శాంతి: పత్నీ క్షమా పుత్ర: షడతే మమ బాంధవా:

ఇతి షడక్షరీ స్తుతి :

మహాలయ పక్షంలో

మానవుడు మోక్షాన్ని పొందడానికి దేవయానం, పితృయానం అనే రెండు మార్గాలున్నాయని వేదం చెప్పింది. అలాగే జన్మించిన ప్రతి మానవునికీ దేవఋణం, ఋషిఋణం, పితృఋణం అనే మూడు ఋణాలు ఉంటాయని, వాటి నుంచి విముక్తులైన వారికి మాత్రమే ముక్తి లభిస్తుందనీ వేదం శాసిస్తోంది. భాద్రపదంలోని శుక్లపక్షం దేవతా పూజలకు అనువైనది. అయితే, బహుళ పక్షం పితృదేవతల పూజకు విశిష్టమైనది. యజ్ఞయాగాదులు, తపోధ్యానాలతో దేవఋణాన్ని, సంతానవంతులై తాతముత్తాలకు పిండప్రదానాలు చేసి పితృ ఋణాన్ని, వేద శాస్త్రాధ్యయన ప్రవచనాలతో ఋషి ఋణాన్ని తీర్చుకోవాలి. మహా భారతంలో ఈ మూడు ఋణాలను తీర్చుకునే కర్తవ్యాన్ని ఆయా సందర్భాలలో బోధించింది. ప్రతిసంవత్సరం భాద్రపద మాస కృష్ణ పక్ష ప్రతిపద నుంచి అమావాస్య వరకు ఉన్న రోజుల్ని మహాలయ పక్ష రోజులంటారు. వీటినే పితృపక్షాలుగా వ్యవహరిస్తారు. సృష్టిలో ప్రత్యక్షదైవాలు తల్లిదండ్రులు. వారు లేకపోతే ఈ సృష్టిలేదు. పిల్లలను గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దేది తల్లిదండ్రులే. అందుకే పిల్లలు వారి జీవించి ఉన్నంత కాలం చూసుకోవడమే గాక, మరణానంతరం వారిని సంతృప్తి పరచడం వారి ముఖ్యవిధి. ఆ సంతృప్తి పరిచేది ఈ మహాలయ పక్షంలోనే. అదే పితృకార్యక్రమము.


అనుశాసనిక పర్వంలో భీష్ముడు అంపశయ్యపై ఉన్నప్పుడు ధర్మరాజు పితృయజ్ఞం గురించి అడిగినప్పుడు భీష్ముడు ... "ధర్మరాజు! పితృపూజతోనే దేవపూజ సంపూర్ణం అవుతుంది. దేవతలు కూడా పితృదేవతలనే భక్తితో పూజిస్తారు అని చెప్పారు.'' భాద్రపద కృష్ణపక్షం పితృదేవతల ఆరాధనకు అనువైనది. ఆషాడ కృష్ణపక్షం నుండి లెక్కిస్తే అయిదవదైన భాద్రపద కృష్ణపక్షాన్ని వారంతా ఆశ్రయించుకుని ఉంటారు. అన్నానికి, మంచినీళ్లకు ఇబ్బంది పడుతూ వాటికోసం ఎదురుచూస్తూ ఉంటారు. కనుక ఆ పదిహేనురోజులు శ్రాద్ధకర్మతో వారికి అన్నోదకాలు కల్పించాలి.

ఆషాఢీ మనధిం కృత్వా పంచమం పక్షమా శ్రితా:|
కాంక్షంతి పితర: అన్నమస్య స్సహం జలమ్‌||

ఆషాఢ మాసం రెండు పక్షాల నుండి భాద్రపద కృష్ణ పక్షం వరకు గల అయిదు పక్షాలు మన పితృదేవతలు ఎన్నో ఇక్కట్లు పాలగుచుందురట! సూర్యుడు కన్యా,తులారాసుల నుండి వృశ్చిక రాశి వచ్చేవరకు ప్రేతపురి శూన్యంగా ఉంటుందని అందువల్ల ఆ కాలంలో మన పితృదేవతలు అన్నోదకములు కాంక్షిస్తూ భూలోకమున వారివారి గృహముల చుట్టూ ఆత్రుతగా తిరుగుతుంటారని అని భారతం పేర్కొంది. అందుకే మహాలయ పక్షంలో సూర్యుడు కన్యారాశిలో ఉండగా ఒక్క రోజయినా పితృ దేవతలకు పిండ ప్రధానంతో శ్రాద్ధం చేస్తే వారు సంతోషంతో ఆశీర్వదిస్తారు. అష్టమి, ద్వాదశి, అమావాస్య, తిథులలోను, భరణి నక్షత్రం ఉన్ననారు తిథివార నక్షత్ర విచారణ లేకుండా మహాలయ శ్రాద్ధం పెట్టవచ్చునని హేమాద్రి ఖండం చెబుతోంది. అందుకే భాద్రపద కృష్ణపక్షం పితృదేవతల ఆరాధనకు అనువైనది. సాధారణంగా తమ పెద్దలు మరణించిన తిథిని బట్టి మహాలయ పక్షంలో తర్పణ, శ్రాద్ధకర్మలు ఆచరిస్తారు. గతించిన వారి తిథి గుర్తు లేనప్పుడు మహాలయ అమావాస్య రోజు పిండ ప్రదానం, తప్పణాలు వదిలి, శ్రాద్ధం ఆచరిస్తారు.

మొత్తం వీలుకాకపోతే మొదటి అయిదురోజులు వదిలి చివరి పదిరోజులు, కుదరకపోతే మొదటి పదిరోజులు వదిలి చివరి అయిదు రోజులు చెయ్యాలి. కనీసం నువ్వులు, నీళ్లు వదిలినా అమావాస్యనాడు మాత్రం తప్పకుండా అన్నశ్రాద్ధం పెట్టితీరాలి. పదిహేను రోజుల్లో ఒక్క రోజయినా శ్రాద్ధం పెట్టాలి. తస్య సంవత్సరం యావత్ సంతృప్తాః పితరోధ్రువమ్ (మహాలయంలో ఒక్కరోజు శ్రాద్ధం పెడితే సంవత్సరం పొడుగునా పెట్టినంతగా పితృదేవతలు సంతృప్తి చెందుతారు). మహాలయ పక్షానికి ఉత్తరకార్తె వస్తుంది. ఆ కార్తెలో పితృయజ్ఞం చేస్తే పితృదేవతలు సంతానాన్ని అనుగ్రహిస్తారు. రవి కన్యారాశిలో ఉండే సమయం ఇది. పార్వణవిధి (అన్నంతో చేసేది)తో చేసే శ్రాద్ధం పితృదేవతల అనుగ్రహంతో ఆరోగ్యాన్ని, జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. మహాలయపక్షంలో సూర్యుడు కన్యారాశిలో ఉండగా ఒక్కరోజయినా పితృదేవతలకు పిండప్రదానంతో శ్రాద్ధం చేస్తే వారు సంతోషంతో ఆశీర్వదిస్తారు. అష్టమి, ద్వాదశి, అమావాస్య తిథులలోను, భరణి నక్షత్రం ఉన్న నాడు తిథివారనక్షత్ర విచారణ లేకుండా మహాలయ శ్రాద్ధం పెట్టవచ్చునని హేమాద్రిఖండం చెబుతోంది

అయోధ్యామధురామాయా కాశీకాంచి అవంతికా |
పూరి ద్వారవ తీచైవ సప్తైతే మోక్షదాయక: ||

పై ఏడు అరణ్యతీర్థాల్లో పితృకార్యాలు చేస్తే పితృదేవతలకు మోక్ష ప్రాప్తి కలుగుతుందని చెప్తారు. అక్కడికి వెళ్లలేనివారు కనీసం ఇంటిలో ఈ పై శ్లోకం చదువుతూ కర్మను ఆచరించాలని శాస్త్రవచనం. ఈ మహాలయంలో ఒక విశేషం వారి వారి జ్ఞాతి బంధువలందరికీ అర్ఘ్యాదక, పిండోదకాలు ఉండగలవు. శ్రాద్ధం అంటేనే కృతజ్ఞత ప్రకటించడం. శ్రాద్ధ కర్మల వల్ల పితరులు సంతోషిస్తారు. శ్రాద్ధ కర్తను ఆశీర్వదిస్తారు. పితరులను ఉద్దేశించి అన్నం, పాలు, పెరుగు, నెయ్యి, మొదలైన పదార్థాలతో భోజనం వండి తమ పితరుల పేరిట అర్పించాలి. ఆ సమయంలో ధూపం, దక్షిణాభి ముఖంగా పెట్టాలి. దక్షిణ దిశ పితృదేవతల దిక్కు కావడం దీనికి అర్థం. దేవతలుకాని, పితరులు కాని భోజనం స్థూలంగా గ్రహించరు. కేవలం సారం గ్రహిస్తారు. దేశ, కాల, ప్రాంతీయతలు పరిస్థితులను అనుసరించి పితరులకు శ్రద్ధతో దర్భ, నీరు సమర్పించడమే శ్రాద్ధం. ఈ పక్షం రోజుల్లో ఇతర శుభకార్యాలేవీ ఆరంభించరు. శ్రాద్ధకర్మల చేత పితృదేవతలకు సంతృప్తి కల్గించిన వ్యక్తికి భౌతికంగా సుఖసంతోషాలు, పరలోకంలో ఉత్తమ గతి లభిస్తాయని వాయు పురాణం చెబుతోంది.

తండ్రి మరణించిన తిథి నిషిద్ధ దినమైనా ఆరోజు శ్రాద్ధం పెట్టవచ్చు. తిథినాడు కుదరకపోతే అష్టమి ఎవరికైనా పనికి వస్తుంది. కొత్తగా పెళ్లి అయిన వారు కూడా మహాలయంలో పిండ దానం చేయవచ్చునని బృహస్పతి చెప్పాడు. "త్రస్య సంవత్సరం యావత్‌ సంతృప్తా: పితరో" (ధువమ్‌) మహాలయంలో ఒక్క రోజు శ్రాద్ధం పెడితే సంవత్సరం పొడువునా పెట్టినంతగా పితృదేవతలు సంతృప్తి చెందుతారట. తండ్రి జీవించి ఉండి తల్లిని కోల్పోయిన వారు ఈ పక్షంలో నవమినాడు 'అవిధవానవమి' పేరుతో తర్పణ, శ్రాద్ధ విధులను ఆచరించవచ్చు. ప్రతీ సంవత్సరం చేసే శ్రాద్ధంకన్నా అతిముఖ్యమైంది ఈ పక్షం. పితరులను తృప్తి పరిచే ఈ కర్మల ద్వారా పితృఋణం తీర్చుకునే అవకాశం ఉంది. స్వర్గస్తులైన మాతాపితరుల కోసం ఈ పక్షంలో పితృకర్మలను ఆచరించాలి

జపమాల

భగవంతుని స్మరించడానికి భగవన్నామం జపించడానికి ముఖ్యమైన సాధనంగా జపమాల ఎంతైన అవసరం వుంది. జప సంఖ్య వేళ్ళతోను వేళ్ళ యందు కణుపుల పైనా లెక్కపెట్టడం కూడా అనాదిగా ఆచరణలో వుంది. జపమాల గూర్చి లింగపురాణంలో వివరంగా  తెలుపబడింది. వైష్ణవ మంత్రాలను జపించడానికి తులసిమాల చెప్పబడింది. గణేష్ మంత్రం జపించడానికి గజదంత మాల చెప్పబడింది. త్రిపురసుందరీ దేవి నుపాసించడానికి రక్త చందనం రుద్రాక్షమాలలు చెప్పబడ్డాయి. తంత్ర సారంలో ఈ విషయం విఫులీకరిచబడింది. కాళీపురాణాన్ననుసరించి కుశగ్రంధి (దర్భ)మాలతో చేసే జపం సమస్త పాపాలను హరిస్తుంది. పుత్రజీవ, పద్మాక్ష, భద్రాక్షుదులను కలిపి కూర్చకూడదు. ఏదో ఒక వస్తువుల మాలతోనే జపం చేయ్యాలి.

రావి చెట్టు మహిమ:

ఈ చరాచర ప్రకృతిలో అణువణువునా  భగవంతుని యొక్క దివ్య శక్తి వ్యాపించి వుంది. "ఇందుగలడందు లేడను సందేహంబు వలదుచక్రి సర్వోపగతుండు ఎందెందు వెదికిన అందందే కలడు" భక్తుడైన  ప్రహ్లాదుని కోరికపై నృసింహ మూర్తిగా ఆ పరమాత్ముడు స్తంభము నుండి దర్శనమిచ్చాడు. 'చెట్టు, పుట్ట, రాతి, నదులు మొదలగు సమస్త చరాచరములయందును వ్యాపించియున్నానని గీత 10వ అధ్యాయనంలో శ్రీ కృష్ణ భగవానుడు వివరించి వున్నాడు. అశ్వత్థః సర్వవృక్షాణం 'వృక్షములన్నింటిలో కంటే రావి చెట్టుయందు తాను ఎక్కువ శక్తితో వున్నానని భగవానుడు చెప్పాడు. అట్టి రావిచెట్టు మహిమ దీని గొప్పదనం గురించి తెలుసుకుందాం.

మూలమునందు, శాఖలయందు, స్కంధమునందు,ఫలములందు   సర్వత్రా అచ్యుతుడు సమస్త దేవతలలో కూడి వున్నాడని స్కందపురాణం చెబుతోంది. రావి చెట్టును విష్ణు రూపం గా చెబుతారు కనుకనే  రావి చెట్టు విష్ణువుగా, వేప చెట్టు మహాలక్ష్మిగా భావించి ఒకే పాదులో వేప చెట్టును, రావి చెట్టును పెంచి పెండ్లి చేస్తారు.ఇలా చేసి సాక్షాత్ లక్ష్మీనారాయణులకు కళ్యాణం చేసినట్టుగా భావిస్తారు.రావి చెట్టు ఇంతటి మహిమతో కూడుకొని వుంది కనుకనే దీని పుల్లలను పవిత్రమైన యజ్ఞ యాగాదులకు మాత్రమే ఉపయోగిస్తారు. ఇతర విధాలుగా ఉపయోగించరు. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఈ దిగువ మంత్రమును పఠిస్తే శరీర ఆరోగ్యంతో కూడా పొందగలరు.
మూలలో బ్రహ్మ రూపాయా
మధ్యలో విష్ణు రూపిణే
అగ్రత శ్శివరూపిణే
వృక్షరాజాయతే నమః

మూలా మునందు బ్రహ్మ దేవుడుని, మధ్యభాగమున విష్ణువుని,చివర భాగమున శివుడిని కలిగియున్నఓ అశ్వత్థః వృక్షరాజమా ! నీకు నమస్కరమని ఈ మంత్రము యొక్క అర్ధం

దీపారాధన

ప్రమిద లేక కుండీలో రెండు వత్తులు వేసి దీపం వెలిగించడం శుభసూచకం. ఒకటి జీవాత్మ, రెండోది పరమాత్మా. శవం తల వెనుక,శ్రాద్దకర్మలప్పుడు ఒకే వత్తి వెలిగిస్తారు. అంటే జీవుడు పరమాత్మలో కలిశాడని అర్ధం ఇక దీపారాధనలో నూనె శనికి ప్రతినిధి. దీపం సూర్యునికి ప్రతీక, మనకు, మన ఇంటికీ వుండే దోషాల నివారణార్ధం మనకు  వెలుగు (తెజస్సు ) కలగాలని, నూనె హరించినట్లే మన కష్టాలు హరించి, వెలుగు రావాలని దీపారాధన ప్రధాన ఉదేశ్యం.

* సూర్యాస్తమయం నుంచి సూర్యోదయందాకా, దీపమున్న  ఇంటిలో, దారిద్ర్యముండదు.
* దీపాలు తూర్పుముఖంగా వుంటే ఆయువు పెరుగుతుంది.
* ఉత్తరదిశ ముఖంగా వుంటే అన్ని విధాలా ధనాభివృద్ధి కలుగుతుంది.
* నాలుగు దిక్కులలో ఒకేసారి దీపాలు పెడితే ఏ దోషము వుండదు

గణపతి పూజలో తులసి ఎందుకు నిషిద్ధము?

గణపతి పూజకు  అనేక పత్రాలనూ, పూలనూ తీసుకువచ్చి పూజిస్తాము. కానీ ఆ పత్రాల్లో తులసి ఉండదు. సర్వదేవతలకు పవిత్రమైన తులసి మరి వినాయకుడు కు  ఎందుకు  ఇష్టం  ఉండదు  అనగా

ఓసారి గంగాతీరంలో వినాయకుడు విహరిస్తుండగా ధర్మధ్వజ యువరాణి వినాయకుడిని చూసి మోహించి పరిణయము చేసుకోమంది. దానికి వినాయకుడు కాదనటంతో ధర్మధ్వజ రాజపుత్రిక కోపించి, దీర్ఘకాలం బ్రహ్మచారిగా ఉండమని శపించింది.

ప్రతిగా వినాయకుడు ఆమెను రాక్షసుని చెంత దీర్ఘకాలం ఉండామని ప్రతిశాపమిస్తాడు. వినాయకుని శాపానికి చింతించిన ధర్మధ్వజ రాకుమార్తె స్వామిని మన్నించమని వేడుకోగా, వినాయకుడు శాంతించి, రాక్షసుని చెంత కొంతకాలం ఉండి, ఆపై పవిత్రమైన తులసిగా జన్మిస్తావు అని చెబుతాడు. అందుకే వినాయకుడు తులసిని తన పూజా పత్రిలో ఇష్టపడడు.

మొగలిపూవు పూజకు అర్హత లేని పువ్వా?

పూర్వం బ్రహ్మ విష్ణువులు నేను గొప్పంటే నేను గొప్పని కలహించుకుంటూ ఉండగా, అపుడు వారి మధ్య ఒక శివలింగం పుట్టి బ్రహ్మను, నా శిరస్సు ఎక్కడుందో కనుక్కోవలసిందని; విష్ణువును నా పాదాలేక్కడున్నాయో కనుక్కోవలసిందని ఆదేశించింది. హంసరూపంలో బ్రహ్మ పైకి; ఆదివరాహరూపంలో విష్ణువు క్రిందికి వెళ్లారు. బ్రహ్మకు లింగంశిరస్సు, విష్ణువునకు లింగపాదాలు కన్పించలేదు. మన్వంతరాలు తిరిగిపోయాయి. ఇద్దరూ తిరిగి పోరాడుకున్న స్థలానికే వచ్చారు. విష్ణువు నాకు లింగంపాదాలు కనిపించాలేదన్నాడు. బ్రహ్మ తానూ లింగం శిరస్సు చూచానని; మొగిలిపూవును, కామధేనువును వెంటబెట్టుకొని వచ్చి మొగలిపూవుచేత చూచినట్లు సాక్ష్యం చెప్పించాడు. కామధేనువు నడగ్గా అది తన తోకను అడ్డంగా ఊపి ఇది అబద్ధమని తెలియజేసింది. అప్పుడు విష్ణువు మొగలిపూవు అబద్ధం చెప్పింది కనుక అది పూజకర్హం కాదనీ, కామధేనువు వృష్ఠభాగంతో సత్యం తెలిపింది కనుక ఆవుకు వెనుకభాగం పూజార్హమగుగాక యనిన్నీ శాపం పెట్టాడు. అందువల్ల మొగలి పూవు పూజకర్హం కాకుండా పోయింది. ఆవు వెనుకభాగమే పూజింపబడుతోంది. మల్లె, గులాబీ మొదలైన పూవులు కూడా పూజకనర్హాలే! మల్లె కేవలం అలంకారానికి మాత్రమే!

నిద్రలేవగానే ... ప్రార్దన

శ్లో: కరాగ్రే వసతే లక్ష్మీః కరమధ్యే సరస్వతీ.
కరమూలే స్థితాగౌరీ ప్రభాతే కరదర్శనమ్!!

 శ్లో: సముద్ర వసనే దేవి పర్వతస్తన మండలే,
విష్ణుపత్నీ నమస్తుభ్యం పాదస్పర్శం క్షమాస్వమే !!

 శ్లో: ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ,
గురుశుక్ర శని భ్యశ్చ రాహవే కేతవే నమః !!

 శ్లో: బ్రహ్మ మురారి స్త్రిపురాంతకారీ భానుశ్శశీ భూమిసుతో  బుధశ్చ,
గురుశ్చ శుక్ర శ్శని భ్యశ్చ రాహుకేతవ కుర్వంతు సర్వే మమ సుప్రభాతమ్!!

 శ్లో: కృష్ణాయ వాసుదేవాయ హరయేపరమాత్మనే,
ప్రణతక్లేశానాశాయ గోవిందాయ నమోనమః  !!

శుభలేఖలకి నలువైపులా పసుపును ఎందుకు రాస్తారు?

మహలక్ష్మిదేవికి, ఆమె అక్క జ్యేష్టదేవికి ఎవరెక్కడ  ఉండాలన్న విషయమై చర్చ వచ్చింది. లక్ష్మీదేవి సముద్రంలోకి వెళ్లి దాక్కోవటంతో ఆమెని బయటికి రమ్మని జ్యేష్టాదేవి కోరింది.  ఆ సమస్య కొలిక్కి వచ్చిన  సమయంలో  లక్ష్మీదేవి తానేక్క డ ఉంటుందో చెప్పింది. వాటిలో పసుపు ఒకటి. అందువల్లనే వివాహ శుభలేఖలకి , కొత్త వ్యాపార పుస్తకాలకు పసుపు రాసి శ్రిమహలక్ష్మికి ఆహ్వానం  పలుకుతారు. ఆమెను ఆవిధంగా స్మరించుకోవడం వల్ల  ఆమె కృప అన్నివేళలా  వారిపై  ఉంటుందని పురాణాలూ తెలియజేస్తున్నాయి. చెల్లెలి మాటపై జ్యేష్టాదేవి ఆ పరిసరాల్లోకి రాదు.

సిందూర ప్రియుడు ఆంజనేయుడు

ఒకమారు ఆంజనేయుడు నిత్యకృత్త్యాలైన పనులు చేసుకుంటూ శ్రమపడినవాడై, మంచి ఆకలితో తన స్వామి అర్థాంగియైన సీతామాతను భోజనము వడ్డించమని అడిగాడు. అప్పుడే స్నానాధికాలు ముగించుకొన్న జానకీదేవీ 'హనుమా! కొద్దిసేపు ఆగు. మొదట పాపిటలో సిందూరము ఉంచుకుని తరువాత వడ్డిస్తాను' అని అన్నది.

అప్పుడు హనుమంతుడు 'అమ్మా ! పాపిటలో సిందూరం ఎందుకమ్మా' అని ప్రశ్నించాడు. "దీనిని నేను నీ ప్రభువు కళ్యాణ నిమిత్తమై పాపిట పెట్టుకొంటున్నాను సింధూరము సౌభాగ్య వృద్ధిని కలిగిస్తుంది. దీనిని ధరించిన వారి భర్తలు చిరాయువులై వర్థిల్లుతారు" అని సీతమ్మ జవాబు చెప్పింది. ఈ మాటవిన్న హనుమంతుడు అక్కడ నుండి వెళ్ళిపోయి కొద్దిసేపు తర్వాత తిరిగి వచ్చాడు ఆయన నఖశిఖ పర్యంతము సింధూరము పూసుకొని ఉన్నాడు. 

సీతమ్మ ఆశ్చర్యపడి 'హనుమా ! శరీరమంతా సింధూరం ఎలా పూసుకొన్నావు ?' అని అడిగింది. అంత మారుతి వినమ్రుడై 'సిందూరము ధరిస్తే స్వామికి కళ్యాణ ప్రదమై ఉంటుందని నీవే అన్నావుగదా అమ్మా! నా ప్రభువు ఎల్లప్పుడు కళ్యాణప్రదంగా ఉండాలని నేను సిందూరము పూసుకొన్నానని' సమాధానం ఇచ్చాడు. హనుమంతుని సమాధానం విన్న సీత ఆనందపరవశ నేత్రాలతో, అతని ప్రభు భక్తికి సంతోషంతో హృదయ పూర్వకంగా ఆశీర్వదించింది. ఆంజనేయుని ప్రభుభక్తి పరాయణతకు ఇది నిలువెత్తు నిదర్శనము.

Sunday, May 25, 2014

విఘ్నేశ్వరుడు

ఒకానొకప్పుడు లక్ష్మి మానస సరోవరంలో జలకమాడుతూండగా, పార్వతి విష్ణువు వేషం ధరించి లక్ష్మిని సమీపించింది. నవమోహ నంగా కనిపించిన నారాయణుని లక్ష్మి చూసింది. నారాయణుడి వేషంలో ఉన్న పార్వతికి కూడా లక్ష్మి అద్భుత సౌందర్యం అత్యంత మనోహ రంగా కనిపించింది. ఇద్దరూ ఒకసారి సాభి ప్రాయoగా చూసుకున్నారు. ఆ చూపుల కలయికలో సరోవరంలో ఒక స్వర్ణకమలం లేచింది.

అందులో ధగధగ మెరిసిపోతున్న పసిపాప ఉన్నది. లక్ష్మి, నారాయణుని దగ్గిరచేరి ఆప్యా యoగా కౌగలించుకోబోయింది. పార్వతి పగలబడి నవ్వుతూ,‘‘నేను నారాయణుడిని కాను, లక్ష్మీ!'' అని ఆ క్షణమే నిజరూపంతో కనిపించింది. లక్ష్మి, ‘‘అన్నకు తగ్గ చెల్లెలివే, నారాయణి అనిపించుకున్నావులే!'' అన్నది చిన్నగా నవ్వుతూ. పార్వతి, ‘‘అప్పుడు విష్ణువు మోహినీ రూపంతో శివుణ్ణి మాయబుచ్చినదానికి ఇది చెల్లువేసుకో!''అన్నది. స్వర్ణకమలంలోని పసిదాన్ని చూసి ఇద్దరూ మురిసిపోయారు. 

అప్పుడు విఘ్నేశ్వరుడు వచ్చి,‘‘తల్లులారా! మీ ఇద్దరి అంశలతో అవత రించిన ఈ బిడ్డ పార్వతి పరంగా జయ, లక్ష్మి పరంగా శ్రీ కలిసి జయశ్రీగా పెరుగుతుంది. ఆమెకు వరుడు కూడా శివకేశవుల అంశలతో అవతరించి ఉన్నాడు!'' అని చెప్పి, పసిదానితో ఉన్న స్వర్ణకమలాన్ని తీసుకువెళ్ళి కావేరీ నదిలో ఉంచి రమ్మని వాయుదేవుడికి చెప్పాడు.
వాయుదేవుడలాగే జయశ్రీని కావేరినదికి చేర్చాడు. దక్షణ ప్రాంతాన్ని పాలించే చక్రవర్తి స్వర్ణ కమలంలో కనిపించిన బాలికను, వరప్రసా దంగా లభించిన పుత్రికగా భావించి, పరమా నందంతో తీసుకువెళ్ళి, నామకరణ మహో త్సవం జరిపించుతూండగా, ఆకాశవాణి, ‘‘జయశ్రీ అని పిలవండి!'' అని పలికింది.

జయశ్రీ రాకుమారిగా పెరిగి ముల్లోకాల్లో అంత సౌందర్యవతి, సాహసవంతురాలు ఉండదనిపించుకున్నది. జయశ్రీకి రాజభవనం కంటే ప్రకృతి సౌందర్యంతో నిండి ఉండే అరణ్యాల్లో విహ రించడమే ఇష్టంగా ఉండేది. ఎల్లప్పుడూ విల్లమ్ములు ధరించి, అరణ్య మధ్యానికి వెళ్ళి వన్యమృగాలను అదుపులో ఉంచుతూ తిరుగుతూండేది. హరిహరాంశలతో అవతరించిన స్వామి కైలాసం వెళ్ళి, విఘ్నేశ్వరుణ్ణి, కుమారస్వామిని కలుసుకోవాలని ఎన్నాళ్ళుగానో అనుకుంటు న్నాడు.

ఒకనాడు అలాగే బయలుదేరి కైలాసం వెళ్ళాడు స్వామి. విఘ్నేశ్వరుడు, కుమార స్వామి ఆనందంగా ముచ్చటలాడుతూ, మానససరోవరం జలవిహారం చేస్తూండగా, విఘ్నేశ్వరుడు, ‘‘ఈ మానససరోవరంలోనే లక్ష్మీ పార్వతుల అద్భుత తేజస్సులతో స్వామికి కాబోయే దేవేరి ఉదయించింది!'' అని ఊరు కున్నాడు. స్వామికి కుతూహలం కలిగినా అణుచు కొని, మరి కొంతకాలం అక్కడ గడిపి, వెళ్ళ బోతున్నప్పుడు, విఘ్నేశ్వరుడు, 

‘‘స్వామీ! మాకంటే పెద్దవాడివైన నీవు బ్రహ్మచారిగా ఉండటం బాగాలేదు. సత్వరంగా నీకు కళ్యా ణంతప్పదు!'' అన్నాడు. కుమారస్వామి, విఘ్నేశ్వరుడు స్వామికి ఘనంగా వీడ్కోలు ఇచ్చారు. స్వామి నిజ నివాసానికి చేరుకున్నాడు. ఒకనాడు స్వామి వినోదంగా పెద్దపులి మీద స్వారీ చేస్తూ అరణ్యంలో తిరుగుతూండగా, పులిని ముందుకూ, అటు ఇటూ కదల నివ్వ కుండా చుట్టూరా బాణాలు రివ్వురివ్వున నాటుకున్నాయి. స్వామి బాణాలు వచ్చిన దిశగా కోపంగా చూశాడు. ఆయన కోపం పటా పంచలైంది. విల్లమ్ములతో ఠీవిగా నిల్చుని చిరునవ్వు విసిరిన జయశ్రీ కనిపించి, స్వామి గుండెలో బాణంలాగ గుచ్చుకున్నది. స్వామి అంతర్థానమయూడు. జయశ్రీకి స్వామిని గురించి విఘ్నేశ్వరుడు కలలో కనిపించి అదివరకే చెప్పిఉన్నాడు.
అతనికోసమే వెతుకుతూ అరణ్యాల్లో తిరుగు తున్నది. నారదుడి ఆదేశంతో, చక్రవర్తి జయశ్రీకి స్వయoవరం ఏర్పాటు చేశాడు. రాజాధిరాజు లుగా మారురూపాలతో ఇంద్రాది దేవతలు కూడా వచ్చారు. స్వామి ఒక సాధారణ శబర యువకుడి రూపంతో విల్లమ్ములు ధరించి, పెద్ద నల్లని కుక్కను వెంటబెట్టుకొని వచ్చాడు. రాజాధిరాజులు ఠీవి ఒలకబోస్తూ శబర  యువకుణ్ణీ, అతని పెంపుడు కుక్కనూ ఎక సక్కెం చేశారు.స్వామి సింహద్వారానికి అడ్డంగా, అందర్నీ కారాగారంలో బందీలు చేసినట్టు కుక్కమీద కూర్చున్నాడు. కుక్క పెద్ద„పులిగా మారింది. భయoకరంగా గాండ్రుమన్నది. జశ్రీ స్వామిని గుర్తించి చరచరా వచ్చి వరమాల వేసి వరించింది. స్వామి జ శ్రీని పులిమీద ముందు కూర్చుండబెట్టుకున్నాడు. దేవతలకు కోపం వచ్చింది. శబరయువకుడి మీద ఒక్కుమ్మడిగా విరుచుకుపడి, ఆయుధాలు తీశారు.

స్వామి విల్లమ్ములు తీసి అందర్నీ ఎదుర్కొన్నాడు. అతని బాణప్రెూగధాటికి దేవతలు చెల్లాచెదరై, నిజరూపాలతో అస్ర్తాలు ప్రయే గించారు. స్వామిని ఎలాంటి అస్ర్తమూ తాకలేక పోయింది. ఇంద్రుడి వజ్రాయుధం కూడా పనికిమాలినదైంది. అప్పుడు స్వామి తన నిజ రూపంతో హరిహరస్వామిగా సాక్షాత్కరిం చాడు. దేవతలు చేతులు మోడ్చారు, ‘‘శరణం స్వామీ!'' అన్నారు. స్వామి జశ్రీల కళ్యాణం దేవాదిదేవ తలమధ్య మహావైభవంగా జరిగింది. జశ్రీతో కలిసి స్వామి ఆనందంగా నిజనివాసానికి వెళ్లాడు. త్రేతాయుగంలో ఆర్యావర్తంలో కోసలుడు, కేకయుడు, వసుమిత్రుడు అనే రాజులు ముగ్గురూ ఆప్తమిత్రులుగా ఉండేవారు. కోసలుడికి కౌసల్య, కేకయుడికి కైకేయి, వసుమిత్రుడికి సుమిత్ర అనే కుమార్తెలు ఉన్నారు. అెూధ్యను పాలించే దశరథుడికి తమ కుమార్తెలను ఇచ్చి పెళ్ళి చేయాలని ముగ్గురు రాజులకూ ఏకాభిప్రాయoకలి గింది.

దశరథుడు వారిని వివాహమాడడానికి అంగీకరించాడు. ముగ్గురు రాజులూ జైమినిమహర్షి చేత వివాహానికి తగిన లగ్నం పెట్టించారు. జైమిని ముహూర్తం నిర్ణయించి, ‘‘నేను పెట్టిన ముహూర్తబలం ఎటువంటిదంటే, విఘ్నేశ్వరుడి సాక్షగా ఈ ముగ్గురి వివాహం దశరథుడితో జరిగితీరుతుంది! అయితే, వివాహం జరిగే ముందు రాకుమార్తెలకు ఒక రాక్షస గండం కనిపిస్తున్నది.కనుక, వధువులు ముగ్గుర్నీ చాలా జాగ్రత్తగా ఉంచాలి!'' అని చెప్పాడు. ముగ్గురు కన్యలనూ రాజులు ఒక పెద్ద పెటె్టలో భద్రంగా దాచారు. ఆసమయoలో లోకసంచారం చేస్తూ, లంకకు చేరిన నారదుడు రావణాసురుడితో, ‘‘లంకేశ్వరా! అతి త్వరలోనే దశరథుడికి ముగ్గురు రాజకుమార్తెలతో వివాహం కాబో తున్నది. దశరథుడి కుమారుడు నిన్ను హతమారుస్తాడు!'' అని చెప్పాడు.

రావణుడు రాకుమార్తెలను ఎత్తుకు రమ్మని మహోదరుడు అనే గొప్ప రాక్షసుణ్ణి పంపాడు. మహోదరుడు కన్యలను పెటె్టలో భద్రపరిచినది కనిపెట్టి, ఆ పెటె్టను మ్రింగే శాడు. వాడు ఆకాశమార్గంగా సముద్రం మీదుగా లంకకు వెళ్తూండగా, కడుపు నొప్పి వచ్చి పెటె్టను కక్కేశాడు. సముద్రంలో పడి పెటె్ట కెరటాలమీద మెల్లగా కొట్టుకుంటూ పోయింది. దశరథుడు సముద్రం మీద దూరతీరా లకు వెళ్ళి పెద్ద నౌకలో తిరిగి వస్తున్నాడు. ప్రయాణం ఆలస్యమైంది.

అనుకున్ననాటికి చేరలేకపోతున్నందుకు విచారిస్తూ, దశరథుడు సముద్రాన్ని చూస్తూండగా, నౌకవైపే కొట్టుకొని వస్తున్న పెద్ద పెటె్ట కనిపించింది. పెటె్ట నౌకను ఢీకొని పైకప్పు ఊడిపోయింది. అందులో రాకుమార్తెలు కనిపించారు. తాళ్ళ నిచ్చెనలతో వాళ్ళను నౌక మీదకు రప్పించాక, ఆ ముగ్గురూ తాను వివాహం చేసుకోనున్న పెండ్లికుమార్తెలే నని దశరథుడు తెలుసుకున్నాడు. సరిగ్గా అదే సమయానికి జైమినిమహర్హి ముహూర్తం పెట్టాడు.

అప్పుడు అక్కడ విఘ్నేశ్వరుడు ప్రత్య క్షమై, ముగ్గురు రాకుమార్తెలతో దశరథుడి వివాహం జరిపించి, అంతర్థానమయాడు. ముగ్గురు వధువులతో దశరథుడు ఆనందంగా స్వదేశం చేరుకున్నాడు. చిరకాలానికి దశరథుడికి నలుగురు కుమారులు పుట్టారు. పెద్దవాడైన రాముడు కైకేయి కారణంగా సీతతో, లక్ష్మణుడితో అరణ్యవాసం వెళ్ళాడు. రావణుడు సీతను ఎత్తుకుపోయి లంకలో పెట్టాడు.రాముడు హనుమంతుడు, సుగ్రీవుడు మొదలైన వాన రుల సహకారంతో లంకను ముట్టడించి, రావణ సంహారం చేశాడు. ఆ తరవాత సీతతో పుష్పక విమానంలో బయాలుదేరి, వారధి కట్టడం ప్రారంభించిన సముద్రతీరంలో ఆగి, అక్కడ శివపూజ జరిపి, అెూధ్యకు వెళ్ళా లనుకున్నాడు.
శివలింగ ప్రతిష్ఠకు తగిన లింగాన్ని తీసుకు రమ్మని హనుమంతుడిని కైలాసానికి పంపాడు. హనుమంతుడు మనోవేగంతో కైలాసం చేరు కొని, అక్కడ ఉన్న శివలింగాల్లో పెద్ద లింగాన్ని చూసి రెండు చేతులతో ఎత్తబోయాడు. లింగం కొంచమైనా కదల్లేదు. దానికంటే చిన్న లింగాన్ని తీయబోయాడు. అదీ కదల్లేదు. చివరికి అన్నిటికంటే చిన్నలింగాన్ని కూడా ఎత్తలేకపోయాడు. కాలం మించిపోతున్నది.

తన అసమర్థ తకు హనుమంతుడు విచారిస్తుండగా, బుడి బుడి నడకలతో అక్కడికి ఒక పిల్లవాడు వచ్చాడు. ‘‘ఎవరనీవు? హనుమం తుడిలాగే ఉన్నావు, కాని కావు!'' అన్నాడు పిల్లవాడు. ‘‘నేను హనుమంతుడినే! ఒక శివలిం గాన్ని తీసుకురమ్మని రాముడు పంపాడు. ఇంతకూ, నీవెవరవోయి, బాలుడా?'' అన్నాడు హనుమంతుడు. ‘‘ ఇక్కడి లింగాలను ఎవరూ ఎత్తుకు పోకుండా నన్ను కాపలా ఉంచారు గాని, నీవు హనుమంతుడవని చెబుతున్నావు, హను మంతుడు శివుడి అవతారమే అనీ, పంచ ముఖాంజనేయడనీ విన్నాను.నీ పంచ ముఖాలు ఏవీ?'' అన్నాడు పిల్లవాడు అమాయకంగా. అప్పుడు హనుమంతుడు గరుడ, వరాహ, సింహ, అశ్వముఖాలను కలుపుకొని, పంచ ముఖాంజనేయడై, ఉన్నతంగా పెరిగి పిల్ల వాడితో నవ్వుతూ, ‘‘విఘ్నేశ్వరా! నా వంతు అయింది. పంచముఖ విఘ్నేశ్వర రూపంతో కనిపించడం నీ వంతు!'' అన్నాడు.

అప్పుడు బాలుడి రూపంలో ఉన్న విఘ్నేశ్వ రుడు, ఐదు తలలతో సమాన ఎత్తున పెరిగి విశ్వరూపంతో కనిపించాడు. హనుమంతుడు పంచముఖ విఘ్నేశ్వ రుడికి నమస్కరించి, ‘‘పిల్లవాడి రూపంతో వస్తున్నప్పుడే విఘ్నేశ్వరుడివని గ్రహించాను. ఇక్కడి శివలింగాలు కదలకుండా చేసింది నీవే కదా? నీవే ఒక లింగాన్ని ప్రసాదించు!'' అన్నాడు. విఘ్నేశ్వరుడు, ‘‘హనుమా!నీ పంచముఖ రూపం చూడాలన్న కుతూహలంతో నేను ఇలా చేశాను. నీవు శివాంశతో పుట్టినవాడవు, నీకు అడ్డేమిటి? అయినా అడిగావు గనక విశేషాంశలు గల లింగాన్ని నీకు ఇవ్వాలనే, ఎంచి ఉంచాను, తీసుకువెళ్ళు,'' అని చెబుతూ, హనుమంతుడి దోసిట్లో గొప్పదైన జ్యోతిర్లింగాన్ని ఉంచాడు. హనుమంతుడు మామూలు రూపంతో దోసి ట్లోని లింగాన్ని పదిలంగా పట్టుకొని, రివ్వున ఎగిరివెళ్ళాడు.

అప్పటికి కాలాతిక్రమణ జరిగింది. సమయo మించిపోకుండా సీతాదేవి ఇసు కతో శివలింగాన్ని చేసింది. రాముడు జలాభి షేకం చేసి, పూజకు ఉపక్రమించ బోతూండగా, హనుమంతుడు లింగంతో అక్కడ వాలాడు. హనుమంతుడు జరుగుతున్నది చూసి, తోకతో సైకతలింగాన్ని చుట్టి తీసివేయబోయడు. కాని ఇసుక లింగం చెక్కుచెదర లేదు. హనుమంతుడు మరింత తోక గట్టిగా బిగించి లాగితే తోక నొప్పిపెట్టిందేగాని లింగం ఏమాత్రం కదల్లేదు.

అప్పుడు రాముడు హనుమంతుణ్ణి శాంత పరిచి, ‘‘హనుమా! బుద్ధిమంతులు కూడా ఒక్కొక్కప్పుడు పొరపాటు పడుతూంటారు సుమీ! అన్నీ తెలిసినవాడివి, సైకతలింగ మైనా, అది శివునికి ఆనవాలు కదా? ఇంతకూ, ఇప్పుడేం మించిపోయిందిగనక. నీవు తెచ్చిన లింగాన్ని సైకతలింగం దాపునే ప్రతిష్ఠించి, పూజించి మరీ వెళతాను!''అని చెప్పాడు.హనుమంతుడు తను తెచ్చిన లింగాన్ని రాముడికి ఇచ్చి, లెంపలు వేసుకొని సైకత లింగానికి మ్రొక్కాడు. రాముడు హనుమంతుడు తెచ్చినలిం గాన్ని ప్రతిష్ఠించి, యధావిధిగా పూజాక్రమం సీతతో కలిసి జరిపిన పిమ్మట, అందరితో పుష్పకం మీద అయోధ్యకు చేరి, పట్టాభిషిక్తుడయూడు.

ఇప్పటికీ మగవారు ఆ గుడిలోకి అడుగుపెట్టరు

తరాలు మారినా అంతే నమ్మకంగా నమ్మటం వెనుక బలమైన కథనాలూ వుంటాయి. అలా స్త్రీలు మాత్రమే వెళ్ళి పూజలు చేసే ఓ ఆలయం ఉంది. పొరపాటున కూడా పురుషులు ఎవ్వరూ ఆ ఆలయంలోకి అడుగు పెట్టరు. పసుపు కుంకుమలతో తమని చల్లగా చూడమని స్త్రీలు పూజలు చేసే ఆ ఆలయం వెనుక, అక్కడి ఆచారం వెనుక ఓ కథ కూడా ఉంది. ఉత్తర ప్రదేశ్ లో ఉన్న ఈ ఆలయంలో పూజలందుకునే దేవతా విగ్రహం అంటూ ఏదీ వుండదు. కాని రోజూ కొన్ని వందల మంది మహిళలు ఆ ఆలయంలో పూజలు చేస్తారు. నోములు, వ్రతాలు చేసుకుంటారు.

1870 ప్రాంతంలో సాకాలేదిహ ప్రాంతాన్ని పాలించే రాజు అతని కుమారులు ఒకసారి శ్రీ పాదుడు అనే ఓ నిరుపేద బ్రహ్మణుడుని బంధిస్తారు. శ్రీపాదుడు ఆవులు పొరపాటున రాజుగారి పొలంలోకి ప్రవేశించటమే అతను చేసిన నేరం. పొరపాటు జరిగిందని, క్షమించమని వేడుకుంటాడు శ్రీపాదుడు. కాని అధికార గర్వంతో రాజు అతని మాటలని వినిపించుకోడు.... పైగా బ్రహ్మాణుడికి గోవులెందుకు అంటూ అవహేళన చేస్తాడు. కేవలం ఓ నిరుపేద బ్రహ్మాణుడి ఆవులు తమ పొలంలోకి వచ్చాయన్న ఒకే ఒక్క ఆరోపణతో అతనిని బంధించి కారాగారంలో పడేస్తాడు రాజు. శ్రీపాదుడుని చిత్రహింసలు పెడతారు భటులు. దాంతో ఎంతో మనస్తాపానికి గురయిన శ్రీపాదుడు అన్నపానియాలు మానేసి నిరాహారంగా కాలం గడుపుతుంటాడు. ఈ విషయం తెలుసుకున్న రాకుమార్తెలు బ్రహ్మాణ ద్రోహం వంశానికే అరిష్టమని భావించి రహస్యంగా కారాగారంలోని శ్రీపాదుడుని కలుసుకుని తమ తండ్రి, సోదరులు చేసిన ద్రోహానికి క్షమించమని వేడుకుంటారు.

ఒకరోజు రాకుమార్తెలు తులసితీర్థాన్ని తెచ్చి అది తీసుకుని దీక్షని విరమించమని శ్రీపాదుడుని కోరతారు అయితే ఆ తులసి తీర్థం తీసుకున్న శ్రీపాదుడు ‘‘మీకెప్పుడూ మంచే జరుగుతుంది’’అని ఆ రాకుమార్తెలని దీవిస్తూ, కూర్చున్న చోటనే ప్రాణాలు విడుస్తాడు. ఆ తరువాత కొన్నాళ్ళకు రథం లోయలో పడిన ప్రమాదంలో రాజు, రాజకుమారులు మరణించగా, ఆశీర్వాదం వలనే అలా తాము ప్రాణాలతో ఉన్నామని నమ్ముతారు రాకుమార్తెలు.
శ్రీపాదుడిని బంధించిన కారాగారాన్ని దేవాలయంగా మార్చి, శ్రీపాదుడు కుర్చున చోటుని దైవపీఠంగా భావించి పూజలు చేసేవారు ఆ రాకుమార్తెలు. కేవలం మహిళలకి మాత్రమే అందులో ప్రవేశమని, మగవారు రాకూడదని శాసించారు. ఇప్పటికీ మగవారు ఆ గుడిలోకి అడుగుపెట్టరు. అలా లోపలికి వెడితే చెడు జరుగుతుందని వారి నమ్మకం కేవలం స్త్రీలు మాత్రమే ఆలయంలోకి వెళ్ళి ఒకప్పుడు శ్రీపాదుడు కూర్చున్న ఎత్తైన అరుగుకి పసుపురాసి, నెయ్యి, పూలతో పూజలు చేస్తారు. మహిళల కోసం మహిళలే కట్టుకున్న ఆలయంగా ఇది ప్రసిద్ధి కెక్కింది.

హనుమంతుని జయంతి

ఈ పండుగ ద్వైత సంప్రదాయము ననుసరించి మాధ్యులకు ప్రధానమైనది. వారు హనుమంతుని 'ముఖ్య ప్రాణ దేవరు' అని పిలుస్తారు. హనుమంతుని ఉపాసకులు కూడా ఈ పండుగ జరుపుకుంటారు. శ్రీరామనవమి తో పాటు కొందరు ఈ జయంతి జరుపుటను కూడా కలదు.
చైత్రశుద్ధ పౌర్ణమి నాడు జరుపుకునే హనుమజ్జయంతి రోజున జిల్లేడు వత్తులు, నువ్వుల నూనెతో ఆంజనేయస్వామికి దీపమెలిగిస్తే అష్టైశ్వర్యాలీ చేకూరుతాయి. హనుమజ్జయంతి రోజు సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో హనుమాన్‌ను ఆలయంలో దర్శించుకుని, ఎర్రటి ప్రమిదల్లో జిల్లేడు వత్తులు, నువ్వులనూనెతో దీపమెలిగించే వారికి ఆయుర్దాయం, సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు.

ఇంకా హనుమంతుని ఆలయాల్లో ఆకుపూజ చేయించడం, హనుమత్కకళ్యాణం జరిపే వారికి ఈతిబాధలు తొలగిపోతాయని విశ్వాసం. అలాగే గృహంలో పూజ చేసే భక్తులు, పూజా మందిరమును శుభ్రం చేసుకుని పసుపు, కుంకుమలు, పుష్పాలతో అలంకరించుకోవాలి. ఎర్రటి అక్షతలు, ఎర్రటి పువ్వులను పూజకు సిద్ధం చేసుకోవాలి.

పూజకు పంచముఖాంజనేయ ప్రతిమను లేదా ఫోటోను ఎర్రటి సింధూరం, ఎర్రటి పువ్వులతో అలంకరించుకోవాలి. నైవేద్యానికి బూరెలు, అప్పాలు, దానిమ్మ పండ్లు సమర్పించుకోవచ్చు. పూజా సమయంలో హనుమాన్ చాలీసా ఆంజనేయ సహస్రము, హనుమచ్చరిత్ర వంటి స్తోత్రాలతో మారుతిని స్తుతించుకోవాలి. లేదా "ఓం ఆంజనేయాయ నమః" అనే మంత్రాన్ని 108 సార్లు జపించి, ఐదు జిల్లేడు వత్తులను నువ్వుల నూనెతో తడిపిన పంచహారతిని స్వామివారికి అర్పించాలి.

పూజ పూర్తయిన తర్వాత ఆంజనేయ ఆలయాలను సందర్శించుకోవడం మంచిది. ఇంకా అరగొండ, పొన్నూరు, కసాపురం, గండిక్షేత్రం వంటి పుణ్యక్షేత్రాలను దర్శించుకునే వారికి కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుందని విశ్వాసం. ఇదే రోజున హనుమాన్ ధ్యానశ్లోకములు, హనుమాన్‌చాలీసా పుస్తకములు దానం చేసేవారికి సుఖసంతోషాలు చేకూరుతాయని నమ్మకం.

గృహప్రవేశము

ఒక పళ్ళెములో పసుపు, కుంకుమ, నవధాన్యములు, ఉప్పు, పెరుగు, కందిపప్పు, కవ్వము, నిమ్మకాయలు, చాకు, కుడుములు, కొబ్బరికాయలు 12, పంతులుగారి జాబితా ప్రకారము తీసుకొనవలెను. ఆడవారు పూజ పళ్ళెము, మగవారు సీతారాముని, లక్ష్మీదేవి పటములు పట్టుకుందురు.

కుడుములు

కావలసినవి: బియ్యంపిండి 1 డబ్బా, బెల్లము, ఉప్పు, పచ్చిశనగపప్పు గుప్పెడు, నీళ్ళు.

బియ్యంపిండిలో బెల్లము వేసి, వేడి నీరు పోసి, పచ్చిశనగపప్పు కలిపి ఇడ్లి పళ్ళెములలో వండవలెను. 1డబ్బా పిండికి - 10 కుడుములు వచ్చును.

గృహప్రవేశము అయినాక కుడుముల టిఫిను మూత తీయవలెను. కుడుము ఆవిరి ఇంట్లోకి రావలెను. ముందు గుమ్మడికాయ మెల్లాలో కొట్టిస్తారు. ఆవును, దూడను, తెచ్చి ఇంట్లోతిప్పి, తీసుకువెళతారు.

గృహప్రవేశము పీటలమీదకు, ఆకులు 1 కట్ట, వక్కలు 100గ్రా, ఎండుఖర్జూరము 250గ్రా, పసుపుకొమ్ములు 250గ్రా, అరటిపండ్లు 12, కొబ్బరికాయలు 2, బియ్యము 2 1/2 కేజి, పీటలమీద తుండు, కట్టుబడి సామాను పెట్టి పూజచేయించెదరు.

పుట్టింటివాళ్ళు కట్నాలు తీసుకురావాలి. పొంగలి గిన్నె పుట్టింటి వారు ఇవ్వవలెను, ఇత్తడి గిన్నె, గరిట, మూత, పొంగలి గిన్నె, ఇంటి ఆడవాళ్ళుకాని, ఆడపడుచు కాని పొయ్యి మీద పెట్టవచ్చును. గిన్నెకు పసుపురాసి బొట్టుపెట్టి పాలుపొంగినాక పొంగలి చేయవలెను. ఆడపిల్లకు బంగారముకాని దక్షిణ కాని ఇవ్వవలెను. పొంగలిగిన్నె పొయ్యిమీద పెట్టినాక బొట్టు పెట్టి ఇవ్వవలెను. పాతగుడ్డ ఏదైనా, మసిగుడ్డగా కావలెను. వాస్తుపూజ అయినాక పొంగలి, కుడుములు, అల్లపచెట్ని పెట్టి అందరికి ఇవ్వవలెను. సత్యనారాయణ వ్రతము చేసి అందరికి భోజనము ఏర్పాటు చేసుకోవలెను. పేపరు ప్లేట్లు, గ్లాసులు, మంచినీరు ఏర్పాటు చేసుకోవలెను. జంపకనాలు, కుర్చీలు కావలెను. కొబ్బరికాయ కొట్టటానికి ఒక గుండ్రాయి ఏర్పాటు చేసుకోవలెను. గుమ్మడికాయకు కళ్యాణం బొట్టు పెట్టవలెను.

హైందవ ధర్మంతో చెలగాటమా?

ఎన్నో (వేరే) మత గ్రంధములలో వ్రాయబడిన వాఖ్యాలు అన్నియు తెలిపేది భగవంతుడు నిరాకారుడు అనియు, సర్వానికి ఒకడే అధికారి అనియు మరియు దేవుడు ఉన్నది ఒక్కడే అనియు తెలుపబడినది అని చెప్తూ ఉంటారు.

ఈ పైన చెప్పబడిన పరమాత్ముని నిరాకర తత్వమును మొట్ట మొదట ఈ సమస్త జగత్తుకు తెలుపబడిన మొదటి ధర్మం మన హైందవ ధర్మమే అని తెలియజేయండి.

మన హిందూ వేదాలలో, ఉపనిషతులలో మరియు భగవద్గీతలో తెలుపబడినది కూడ ఆ పరమాత్ముడు నిరాకారుడు, నిర్గుణుడు, శాస్వితుడు, సత్యుడు మరియు నిత్యుడు అని మాత్రమే తెలుపబడినది అని తెలియజేయండి.

ఇదియే కాక ఆ పరమాత్ముడిని మన శరీరంలోనే సంపూర్ణ దర్శనం పొందే మార్గాలను సైతం తెలుపబడిన ధర్మం మన హైందవ ధర్మమే అని చాటి చెప్పండి.

ఆ నిరాకర పరమాత్మే సాకార రూపంగా వివిధ రూపాలలో అవతరించి అంతరించిపోతున్న జ్ఞానాన్ని మరియు ధర్మాన్ని నిలబెట్టడానికి సాకార రూపంలో అవతరిస్తుంటాడు అని తెలుపండి.

మన హైందవ ధర్మంలో ఆచరించే ప్రతిది ఒకే ఒక ఆత్మ జ్ఞానంతో ముడిపడి ఉంటుంది అని తెలుపండి.

అన్ని మత గ్రంధాలో లిఖించబడినటువంటి వాక్యాలు అన్నియు మన వేదాలలో ఎప్పుడో తెలుపబడినవి అనియు మరియు ఆ దేవదేవుడి నిరాకర స్వరూపాన్ని మరియు సర్వాకాల సర్వ వ్యవస్థలకు మూల కారకుడు ఆ దేవదేవుడైన ఆ పరమాత్ముడు అని ఏ నాడో మన వేదాలలో మరియు చివరన ఉన్న ఉపనిషత్తులలో సవివరంగా వివరించబడినాయి అని తెలుపండి.

మతాలూ మరియు కులాలు వేరైనా దేవుడు ఒక్కడే అని తెలిపిన ధర్మం మన హైందవ ధర్మం అని సవివరంగా మన హైందవ ధర్మం గురించి చక్కటి వివరణ ఇవ్వండి.

ఓం నమో పరమాత్మయే నమః

Saturday, May 24, 2014

108 ప్రత్యేకత

''ఏకం సత్ విప్రా బహుధా వదంతి''

''సత్యం ఒక్కటే'' దానిని జ్ఞానులు బహువిధాలుగా చెపుతారు. ఆవిష్కరణ సృష్టి భగవంతునిలోనే ఉంది. 
స్వర్గం, పాలపుంత, గ్రహాలూ, నక్షత్రాలు, మానవులు, ఇతర జీవకాలమూ ఆభగవంతునిచే సృష్టించబడింది. ఈ విశ్వంలో ఒక లయ, ఒక కూర్పు, ఒక సమన్వయం ఉంది. ఈ విషయం ప్రాచీన భారతీయులకు బాగా తెలుసు.
సంభ్రమమైన 108 సంఖ్య ప్రాచీన భారతీయులకు చాల పవిత్రమైనది. అన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలలో 108 సంఖ్యకు వారు చాలా ప్రాముఖ్యతనిచ్చారు.
దేవునికి/దేవతలకి మంత్ర పుష్పాలతో పూజిస్తూ 108 పవిత్ర తులసి/రుద్రాక్షలు గల పవిత్ర జపమాలలను గణిస్తూ జపం చేసేవారు.
108 సంఖ్య యొక్క ప్రాముఖ్యతను భారతదేశంలో గల హిందువులే కాదు, భౌద్ధులు, జైనులు, సిక్కులు, (ప్రస్తుతం క్రిష్టియన్స్ కూడా ప్లాస్టిక్, రేడియం జపమాలలు మొదలెట్టారు) వంటి వారు కూడా గుర్తించారు. తనలోని దైవత్వం గ్రహించడానికి ఆత్మ 108 మెట్లు దాటాలని పూర్వీకుల నమ్మకం. 

వేద ఋషులు ఖగోళ శాస్త్రానికి సంభందించిన గణనలో
భూమికి, చంద్రునికి, మధ్య దూరం, చంద్రుని వ్యాసానికి 108 రెట్లు ఉందని,
భూమికి సూర్యునికి మధ్య దూరం, సూర్యుని వ్యాసానికి 108 రెట్లు ఉందని,
సూర్యుని యొక్క వ్యాసం భూమి వ్యాసానికి 108 రెట్లని నిర్ధారించారు.
ఈ వేద గణనలో ఆధునిక సాంకేతిక విశ్వ గణనలో లభించిన భూమికీ - చంద్రునికీ, భూమికీ - సూర్యునికీ ఉన్న దూరంతో దాదాపు సరిపోయింది. 

ఆయుర్వేదం మనిషి శరీరంలో 108 మర్మ స్థానాలు గుర్తించింది. 108 మర్మ స్థానాల గొలుసులో 107 గ్రంధులు శరీరంలో ఉంటాయని ఆయుర్వేదం చెబుతుంది. 
అలాగే పవిత్రమైన శ్రీ చక్రంలో 57స్త్రీ, 54పురుష అంతర్భాగాలు ఉంటాయి. ఇవి మొత్తం 108.
మనవ ప్రవృత్తికి సంభందించి బ్రహ్మాండాన్ని 27 చంద్ర సూచికలైన నక్షత్రాలతో, ఒక్కో నక్షత్రం తిరిగి 4పాదాలతో ఉంటుందని గుర్తించింది. ఇవి మొత్తం 108 పాదాలయింది. అవే 108 ప్రాదమిక మనవ ప్రవృత్తులు. శిశు జనన సమయంలో చంద్రుడు ఏ పాదంలో ఉంటాడో, దాని ప్రభావం ఆ వ్యక్తి జీవితంలో, వృత్తిలో, ఆనందంలో, కుటుంబంలో, చివరకు మోక్షమార్గంలో కూడా ప్రతిఫలిస్తుంది. బారతీయ జ్యోతిష్యంలో 12రాశులు, 9గ్రహాలు ఉంటాయి. 12ని 9తో హెచ్చవేస్తే 108.
మానవుడు సగటున ప్రతిరోజూ 21,600సార్లు శ్వాస తీస్తాడు. అందు 10,800 సూర్యాంశ, 10,800చంద్రాంశ, 108ని 100తో గుణిస్తే 10,800 వస్తుంది. దీనిని 2తో గుణిస్తే 21,600 వస్తుందని తంత్ర శాస్త్రం చేపుతుంది.
సంఖ్య శాస్త్రం ప్రకారం 108లో 18కి యజ అనే పేరు. దేనిని తిరగవేస్తే ''జయ'' అని వస్తుంది. ఈపేరుతోనే మహాభారతం లిఖించబడింది. కాలక్రమంలో ''జయ'' అనే ఇతిహసాన్ని పెంచడం వలన ''మహాభారతం'' అనే పేరుతొ ప్రసిద్ది చెందింది.

మన పురాణములు 18, ఉపనిషత్తులు 108, భగవద్గీతలో 18 అధ్యాయాలు 18, ఇంకా ఎన్నో గ్రంధాలలో 108 శ్లోకాలు ఉంటాయి. విష్ణు సహస్రనామాలు 108, నిత్యమూ మనం పూజించే విధానంలో అష్టోత్తర శతనామాలు ఉంటాయి. భారతీయ కాలగణన ప్రకారం 4యుగాలలో 43,20,000 సంవత్సరాలు ఇది 108సంఖ్యతో భాగించబడింది. 

ఇంతటి వైశిష్ట్యం గల 108సంఖ్య ఎంతో దివ్యమైనది. ఇది సృష్టికర్తకు, సృష్టి అనుసంధానం కలిగించేది. అందుకే ఋషులు, పురాణములు, వేదములు, భారతీయ సంస్కృతి 108సంఖ్యకు పవిత్రత ఇస్తున్నది.


సీతమ్మ వారి పూర్వీకులు ఎవరు ??

నిమి సీతాదేవి వంశ మునకు మూల పురుషుడు. ఈయన కొడుకు  "మిధి",
మిధి కుమారుడు  జనకుడు. 
ఈ  వంశము నందే కీర్తి రాతుడు, మహారోముడు ప్రభవించారు . 
మహా రామునికి స్వర్ణ రోముడు.
స్వర్ణ రోము నికి  హ్రస్వ రోముడు

హ్రస్వ రోముని సన్తామే జనకుడు.  
జనకుని అసలు పేరు " సీరధ్వ జుడు" , 
జనకుని తమ్ముడు  " కుశె ధ్వజుడు "
హ్రశ్వరోముడు  జనకునికి పట్టాభిషేకము చేసి అడవులకు వెళ్ళిపొయినాడు. 
జనకునికి  సీతమ్మ వారితో పాటు  "ఊర్మిళ "  కూడా ఉన్నది . 
జనకుని తమ్ముడు "కుశె ధ్వజుడు" కి మాండవి, శ్రుత కీర్తి  అను కుమార్తెలు ఉన్నారు .

ధ్వజస్థంభం

ఏ దేవాలయానికి వెళ్ళినా ముందుగా ధ్వజస్థంభానికి మొక్కి, ప్రదక్షిణచేసి ఆతర్వాతే లోపలికి వెళతాం. 

ఈ ధ్వజస్థంభం ఏర్పడటానికి ఓ కధ ఉంది.భారత యుద్ధానంతరం పాండవులలో జ్యేష్టుడైన ధర్మరాజు సింహాసనాన్ని అధిష్టిస్తాడు. ధర్మబధ్ధంగా రాజ్య పాలన చేస్తుంటాడు. ధర్మమూర్తిగా, గొప్పదాతగాపేరు పొందాలనే కోరికతో విరివిగా దానధర్మాలు చేయడం మొదలు పెడ్తాడు. ఇదంతా చూస్తున్న శ్రీకృష్ణుడు అతనికి తగినరీతిగా గుణపాఠం చెప్పాలనుకుంటాడు. ధర్మరాజుకి అశ్వమేధయాగం చేసి, శత్రురాజులను జయించి, దేవతలనూ బ్రాహ్మణులను సంతుష్టి పరచి, రాజ్యాన్ని సుస్థిరం, సుభిక్షం చేయమనీ చెప్తాడు. ధర్మరాజు శ్రీకృష్ణుని మాట శిరసా వహించి అశ్వమేధానికి సన్నాహాలు చేయించి, యాగాశ్వానికి రక్షకులుగా నకుల సహదేవులను సైన్యంతో పంపుతాడు.ఆ యాగాశ్వం అన్నిరాజ్యాలూ తిరిగి చివరికి మణిపుర రాజ్యం చేరుతుంది. ఆ రాజ్యానికి రాజు మయూర ధ్వజుడు. ఆయన మహా పరాక్రమ వంతుడు, గొప్ప దాతగా పేరుగాంచినవాడు. మయూరధ్వజుని కుమారుడు తామ్ర ధ్వజుడు, పాండవుల యాగాశ్వాన్నిబంధిస్తాడు. తామ్రధ్వజునితో యుద్ధం చేసిన నకులసహదేవులు, భీమార్జునులు ఓడిపోతారు. తమ్ములందరూ ఓడిపోయిన విషయం తెల్సుకున్న ధర్మరాజు స్వయంగా యుధ్ధానికై బయలుదేరగా శ్రీకృష్ణుడు అతన్ని వారించి మయూరధ్వజుడ్ని యుధ్ధంలో జయించడం సాధ్యంకాదనీ, మహాబలపరాక్రమవంతులైన భీమార్జునులే ఓడిపోయారనీ,అతడ్నికపటోపాయాంతో మాత్రమే జయించాలనీ చెప్తాడు. శ్రీకృష్ణుడు, ధర్మరాజుతోకలసి వృద్ధ బ్రాహ్మణుల రూపంలో మణిపురం చేర్తాడు. ఆ బ్రాహ్మణులను చూసిన మయూరధ్వజుడు వారికి దానం ఇవ్వదలచి ఏమి కావాలో కోరుకొమ్మని అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు,"రాజా! మీ దర్శనార్ధమై మేమువస్తున్న దారిలో ఒక సింహం అడ్డు వచ్చి ఇతని కుమారుడ్ని పట్టుకుంది. బాలుని విడిచి పెట్టవలసినదిగా మేముప్రార్థించగా, సింహం మానవ భాషలో " మీ కుమారుడు మీకు కావాలంటే మణిపుర రాజైనా మయూరధ్వజుని '' శరీరంలోని సగభాగం నాకు ఆహారంగా అతడి భార్యాపుత్రులే స్వయంగా కోసి ఇవ్వగా తెచ్చి ఇస్తే, ఇతడ్ని వదిలేస్తాననీ చెప్పిందనీ, కనుక ప్రభువులు మా యందు దయదలచి తమ శరీరంలోని సగభాగాన్ని దానమిచ్చి ఇతడి కుమారుని కాపాడమని కోరుతారు. వారి కోరిక విన్న మయూరధ్వజుడు అంగీకరించి దానికి తగిన ఏర్పాట్లు చేయించి భార్యాసుతులు అతని శరీరాన్నిమధ్యకు కోసి వారికి ఇవ్వమని చెప్తాడు. వారు ఆయన శరీరాన్ని సగంగా కోయటం చూచిన ధర్మరాజు అతని దాన గుణానికి నివ్వెరపోయాడు. ఇంతలో మయూరధ్వజుని ఎడమకన్ను నుంచి నీరు కారటం చూసిన ధర్మరాజు "తమరు కన్నీరు కారుస్తూ ఇచ్చిన దానం మాకు వద్దు గాక వద్దు అంటాడు". అందుకు మయూరధ్వజుడు, "మహాత్మా తమరు పొరపడుతున్నారు. బాధపడి నా శరీరాన్ని మీకివ్వటం లేదు. నా కుడి భాగం పరోపకారానికి ఉపయోగపడింది, కానీ ఆ భాగ్యం తనకు కలగటంలేదు కదా అని ఎడమ కన్ను చాలా బాధపడుతూ కన్నీరు కారుస్తున్నది." అని వివరిస్తాడు. మయూరధ్వజుని దానశీలతకు మెచ్చిన శ్రీకృష్ణుడు తన నిజరూపాన్ని చూపి "మయూరధ్వజా! నీ దానగుణం అమోఘం ! ఏదైనావరం కోరుకో! అనుగ్రహిస్తాను" అంటాడు. "పరమాత్మా! నా శరీరం నశించినా నా ఆత్మ పరోపకారార్థం ఉపయోగపడేలా నిత్యం మీ ముందు ఉండేలాగానుగ్రహించండి" అని కోరుతాడు మయూరధ్వజుడు. అందుకు శ్రీకృష్ణుడు "తథాస్తు" అని పలికి, "మయూరధ్వజా! నేటి నుంచీ ప్రతి దేవాలయం ముందు నీ గుర్తుగా నీ పేరున ధ్వజస్తంభాలు వెలుస్తాయి. వాటిని ఆశ్రయించిన నీ ఆత్మ, నిత్యం దైవ సాన్నిధ్యంలో ఉంటుంది. ముందు నిన్ను దర్శించి ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించిన మీదటనే ప్రజలు తమ ఇష్టదైవాలను దర్శించుకుంటారు. ప్రతినిత్యం నీ శరీరమున దీపం ఎవరుంచుతారో వారి జన్మ సఫలం అవుతుంది. నీ నెత్తిన ఉంచిన దీపం రాత్రులందు బాటసారులకు దారి చూపే దీపం అవుతుంది" అంటూ అనుగ్రహించాడు. ఆనాటి నుంచీ ఆలయాల ముందు ధ్వజస్తంభాలు తప్పనిసరిగా ప్రతిష్టించడం ఆచారమయింది. భక్తులు ముందుగా ధ్వజస్థంభానికి మొక్కి ఆ తర్వాతే ములవిరాట్టు దర్శనం చేసుకోడం సాంప్రదాయంగా మారింది...


నాగులచవితి విశిష్ఠత

నాగుల చవితి - కార్తీకశుద్ద చతుర్దశి నాడు - దీపావళి వెళ్ళిన నాలుగో రోజున వస్తుంది. పుట్టిన బిడ్డలు బ్రతకక పోతేను , పిల్లలు కలుగక పోతేను, నాగ ప్రతిష్ట చేసి పూజించటం సాంప్రదాయం . అలా నాగ మహిమతో పుటిన సంతానానికి, నాగలక్ష్మి, నాగేశ్వరరావు, నాగయ్య వగైరా పేర్లు పెట్టుకుంటారు. మన పురాణాలలో నాగుల చవితి గురుంచి ఎన్నో గాథలు ఉన్నాయి. దేశమంతట పలు దేవాలయల్లో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివభావముతో అర్పిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని నమ్మకం. ఈ మానవ శరీరమనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటూ ఉంటారు. మానవ శరీరంలో నాడులతో నిండివున్న వెన్నెముకను ' వెనుబాము' అని అంటారు. అందులో కుండలినీ శక్తి మూలాధారచక్రంలో "పాము" ఆకారంలో వుంటుందని "యోగశాస్త్రం" చెబుతోంది. ఇది మానవ శరీరంలో నిదురిస్తున్నట్లు నటిస్తూ, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే విషాల్ని కక్కుతూ, మానవునిలో ' సత్వగుణ' సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని అందుకు నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్పపుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే, మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది, అందరి హృదయాలలో నివశించే ' శ్రీమహావిష్ణువు" కు తెల్లని ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా మారాలని కోరికతో చేసేదే! ఈ నాగుపాము పుట్టలో పాలు పోయుటలోగల అంతర్యమని చెప్తారు. ఈ రోజున ఉదయమే ,తలస్నానము చేసి పుట్టదగ్గరికి వెళ్ళి, నాగరాజుకు పూజించి పాలు పోసి చలిమిడి, చిమ్మిలి, అరటిపళ్ళు, తాటి బుర్రగుంజు , తేగలు మున్నగున్నవి నివేదన చేస్తారు. ఆ పుట్ట మట్టిని పుట్టబంగారం అని, దానిని కొద్దిగా తీసుకొని చెవి దగ్గర పెట్టుకుంటారు . ముఖ్యముగా చెవి బాధలు వున్నవారికి ఈ పుట్టబంగారం పెడితే చెవి బాధ తగ్గుతుందంటారు. ఆ సందర్భంగా పుట్ట వద్ద " దీపావళి" నాడు మిగిలిన మతాబులు, కాకరపువ్వొత్తులు, టపాసులు మొదలైనవి చిన్నపిల్లలు ఎంతో సంతోషంగా కూడా కాలుస్తారు.
నాగులచవితి పాటలు కూడా మన తెలుగువారిలో ఎంతో ప్రసిద్ధం:
నన్నేలు నాగన్న , నాకులమునేలు ,
నాకన్నవారల నాఇంటివారల ఆప్తమిత్రులనందరిని ఏలు .
పడగ తొక్కిన పగవాడనుకోకు ,
నడుము తొక్కిన నావాడనుకొనుము .
తోక తొక్కిన తొలుగుచూ పొమ్ము .
ఇదిగో ! నూకనిచ్చెదను మూకనిమ్ము.పిల్లల మూకను నాకిమ్ము .
అని పుట్టలో పాలు పోస్తూ , నూక వేసి వేడుకుంటారు .అలాగే,
పుట్టలోని నాగేంద్రస్వామి లేచి రావయ్యా!
గుమ్మపాలు త్రాగి వెళ్ళిపోవయ్యా!
చలిమిడి వడపప్పు తెచ్చినామయ్యా!
వెయ్యి దండాలయ్య, నీకు కోటి దండాలయ్యా!
పుట్టలోని నాగేంద్రస్వామి!! ....
అంటూ తాము పోసిన పాలు నాగేంద్రుడు తాగితే, తమ మనసులోని కోర్కెలన్నీ తీరుతాయని భక్తుల నమ్మకం.ఆలయాలలో నాగదేవతలకు ఘనంగా పూజలు చేస్తారు. ప్రతి ఏటా నాగులచవితి రోజున తిరుమలలో కోనేటిరాయుడైన శ్రీవారిని పెద్దశేష వాహనంపై ఊరేగించడం ఆనవాయితీ. అలాగే గురువారం వాహన సేవకు ఆరోజంతా వుపవాసముండి మరునాడు పారాయణ చేసి భుజిస్తారు. పాముపడగ నీడ పడితే పశువులకాపరి కూడా ప్రభువు అవుతాడంటారు !కాని పాములకు పుట్టలో పాలు పోయడం వల్ల వాటి ప్రాణాలకు హాని అని,అందుకని వాటి సహజ నివాసములలో పాలూ, గుడ్లూ వెయ్యొద్దని చెప్తున్నారు. దానికి బదులు ఇళ్ళలోనే బియ్యం పిండితో నాగ మూర్తులను చేసి, వాటికి శాస్త్రోక్తంగా అన్నీ సమర్పించవచ్చు. ప్రకృతి మానవ మనుగడకు జీవనాధరమైనది కనుక దానిని దైవస్వరూపంగా భావించి మన పూర్వీకులు చెట్టును, పుట్టను, రాయిని, రప్పను, కొండను, కోనను, నదిని, పర్వతాన్ని - ఇలా సమస్త ప్రాణికోటిని దైవస్వరూపంగా చూసుకొంటూ! పూజిస్తూ వస్తున్నారు. ఇదే మనభారతీయ సంస్కృతిలోని విశిష్టత. నిశితంగా పరిశీలిస్తే ... అందులో భాగంగానే నాగుపామును కూడా నాగరాజుగా, నాగదేవతగా పూజిస్తూ వస్తున్నారు. ఈ పాములు భూమి అంతర్భాగంలో నివసిస్తూ భూసారాన్ని కాపాడే ప్రాణులుగా సమస్త జీవకోటికి నీటిని ప్రసాదించే దేవతలుగా తలచేవారు. ఇవి పంటలను నాశనంచేసే క్రిమికీటకాదులను తింటూ, పరోక్షంగా రైతుకు పంటనష్టం కలగకుండా చేస్తాయట!. అలా ప్రకృతిపరంగా అవి మనకు ఎంతో సహాయపడుతూ ఉంటాయి. నాగుపాముల సహజ నివాసాలను ఉండనిచ్చి, ప్రకృతిని కాపాడుకుంటే అంతకన్నా గొప్ప పూజ ఇంకొకటి ఉంటుందా?


రుక్మిణీ కల్యాణం - శ్రీ విష్ణు పురాణము

కుండినపురం రాజధానిగా విదర్భనేలే భీష్మకునికి రుక్మిణి కూతురు. ఆమె అన్న రుక్మి. ఇతడికి కృష్ణుడంటే ఉన్న ద్వేషం చేత - తన సోదరి కృష్ణునే భర్తగా వరించెనని తెలిసికూడా వారి కల్యాణం జరిపించడాయెను. శిసుపాలునికిఇద్దామని అతడి ఆలోచన.

వివాహం రేపు జరగనున్నదనగా, కృష్ణుడామెను రథంపై ఎక్కించుకుని తీసుకువెళ్లి రాక్షసవివాహరీతిని ఆమెను పెండ్లాడాడు. ఆమెకు ప్రధ్యుమ్నుడు జన్మించాడు.

శంబరాసుర వథ:

ప్రద్యుమ్నుడు పుట్టిన అరవనాడు, అతడు తనకు ప్రాణాంతకుడని ఎరిగిన శంబరాసురుడు, ఆ శిశువును అపహరించి సముద్రంలో పారవేశాడు. జాలరులచేత రక్షించబడిన ఆ శిశువే పెరిగి పెద్దవాడై శంబరాసురుని 'నామమాత్రపు భార్య' అభోగ్య అయిన మయావతిచే పోషింపబడి, శంబరుని హతమార్చి, ఆమెతోకూడ నిజపురానికి చేరుకుని నారదమహర్షి వల్ల అతడు కృష్ణుని పుత్రుడని ధృవీకరింపబడి, తిరిగి అంతకాలానికి తల్ల్లితండ్రులను కలుసుకోగలిగాడు ఆ ప్రద్యుమ్నుడు.

రుక్మిణీకృష్ణులు, ద్వారక వాసులు చిరకాలమునకు ప్రద్యుమ్నుని చూసినందుకు ఆశ్చర్యానందాలు పొందారు. ఆ మాయవతి రతీదేవి అవతారం. ప్రద్యుమ్నుని భార్య అయింది.

రుక్మివథ:

రుక్మిణీదేవి కన్న సంతానం చారుదేష్ణుడు, చారుదేహుడు, సుదేష్ణుడు, సుషేణుడు, చారుగుప్తుడు, చారువిందుడు, చారువు, భద్రబాహువు అనే పుత్రులతో పాటు చారుమతి అనేపుత్రిక. రుక్మిణిగాక కృష్ణునికి ఇంకా ఏడుగురు పత్నులు. వారు సత్య, కాశింది, మిత్రవింద, రోహిణి, నాగ్నజితి, జాంబవతి, సుశీల, వీరుగాక 16000 మంది భామలు. ప్రద్యుమ్నుడు రుక్మికూతురు ఒకర్నొకరు పరస్పరం వరించారు. వీరికి జన్మించినవాడే అనిరుద్ధుడు. పెళ్లికి తరలివచ్చిన బంధుజనుల్లో కొందరు బలరాముడికి పాచికలాట తెలీదు, జూదంలో అతడ్ని మనం తేలిగ్గా గెల్వవచ్చునన్నారు.

బలమదం కొద్దీ రుక్మి సరేనన్నాడు. బలరామునితో ద్యూతక్రిడ మొదలెట్టారు. అప్పుడు బలరాముడు వెయ్యినిష్కాలు ఓడిపోయాడు. రెండో పందెంలో కూడ అంతే మొత్తం కోల్పోయాడు. మూడోపందెంలో పదివేలు ఓడిపోయాడు. ఈసారి కోటి నిష్కాల పందెం. బలరాముడు మౌనం వహించాడు. అందులో రుక్మి ఓడిపోయి కూడా, నేనే గెల్చానంటూ అబద్ధమాడగా, 'మౌనం అంగీకారసూచకం!' అని ఆకాశవాణి కూడ పలికి, బలరాముడే విజేత అని చెప్పింది. రుక్మిని పాచికలతో కొట్టాడు బలరాముడు. అటుపై అదంతా చూస్తూ అక్కడే ఉన్న కళింగరాజు పరిహాసం చేసినందుగ్గాను అతడి దవడ పళ్లూడగొట్టాడు.

ఈ సందడిట్లా నడుస్తూన్నంతలో పెండ్లికొడుకును తీసుకుని నెమ్మదిగా అక్కడ్నుంచి వచ్చాడు శ్రీకృష్ణుడు. రుక్మి హతుడయ్యాడు గనుక ఇక కలహాలుండవని ఆయనకు తెలుసు!

నరకాసుర వథ:

తరువాత కొంతకాలానికి ఇంద్రుడు, ద్వారకకు రాగా శ్రీకృష్ణుడు అతనికి అతిథి సత్కారాలు చేసి విషయమేమిటని అడిగాడు. దేవేంద్రుడు సందర్భవశంగా ఇలా అన్నాడు.

"శ్రీకృష్ణా! ఏం చెప్పమంటావు. భూమిపుత్రుడైన నరకాసురుడు నీకు తెలుసుకదా! వాడి దుశ్చర్యలు మితిమీరిపోతున్నాయి. అ విషయం నీకు విన్న వించడానికే నేను ఇక్కడకొచ్చాను. ప్రాగ్జ్యోతిషపురాథిపతి పెడుతున్న బాధలు అన్నీ ఇన్నీ కావు. దేవతలు, సిద్ధులు, మునులు....ఒక్కరేమిటీ - వాడి బారిన పడనివారు లేరనుకో! ఎందరు ధరణి పతుల కన్యలనో వాడు తన ఇంట బంధించాడు. వరుణుని చత్రం ఊడలాక్కున్నాడు. మందరర పర్వతశృంగం మీద మణులన్నీ కాజేశాడు. ఇవి వాడి దుశ్చర్యల్లో అత్యల్పభాగం మాతమే! కనుక తక్షణమే నువ్వేదైనా ప్రతిక్రియ ఆలోచించాలి" అని నివేదించాడు.

"అలాగే! సరే! నువ్వు ధైర్యంగా ఉండు! వాడి గర్వం అణచవలసిందే!' అని శ్రీకృష్ణుడు ఇంద్రునికి అభయమిచ్చి పంపేశాడు.

అనంతరం హృదయంలో గరుడుని తల్చుకుని, అతడు రాగా ఆ పక్షిరాజు మూపునధిరోహించి సత్యభామా సమేతుడై ప్రాగ్జ్యోతిష్యపురానికి వెళ్లాడు శ్రీకృష్ణుడు. నరకునిసేనలతో శ్రీకృష్ణునికి మొదట పెనుయుద్ధమయింది. అహర్నిశలు సాగిన ఆ యుద్ధంలో, సత్యాపతి ఇంచుక అలసి విశ్రమించగా, సత్యభామ ఆ దానవ వీరులతో పోరాడింది. వారిపైకి అస్త్రశస్త్రాలు వర్షంలా కురిపించింది. శ్రీకృష్ణుడు కొంతసేపు సేదతీరి, సత్యభామను ప్రశంసించి, తిరిగి తన కర్తవ్యాన్ని తానే నెరవేర్చాడు.

(శస్త్రాస్త్రవర్షం ముం చం తం తం భౌమం నరకం బలీ|
క్షి ప్త్యా చక్రం ద్విధా చక్రే చక్రీ దై తేయ చక్రహా||)

తన చక్రాయుధంతో నరకాసురుని రెండుగా ఖండించాడు. మురాసురుని, హయగ్రీవుని, పంచజనుడను వానిని కూల్చాడు. మురాసురుని 7వేల మంది పుత్రుల్ని సంహరించాడు. ఎవరెవరిదగ్గర నుంచి నరకుడు ఏమేమి అపహరించాడో, అవన్నీ వారికి అందేలా చేశాడు.

పృథివీ కృతకృష్ణస్తుతి:

"నాథా! వరాహమూర్తివై నీవు ఒకప్పుడు నన్నుద్ధరించగా, పుట్టినవాడు ఈ నరకుడు. ఈ పుత్రుని ఇచ్చినదీ నీవే! తిరిగి సంహరించినదీ నీవే! వీడు అపహరించిన (అథితి యొక్క) కర్ణకుండలాలు ఇవిగో! వీడి సంతతిని ఇంకా ముక్కపచ్చలారని వారిని కాపాడు!

జగత్కర్తవు, సంహార కారణుడవు నీవే! నా బరువును దింపటానికే అంశావతారం ఎత్తావు. నిన్నేమని స్తుతించను? వ్యాపించువాడవు వ్యాపించబడు విశ్వమూ నీవే! సర్వ భూతాంతరాత్మవగు నిన్నేమని స్తుతించను? వాక్కులకు అందనివాడివి. సర్వభూతాత్మా! దయచూడు! ధర్మసంస్థాపన కొరకు నీ కొడుకుని నువ్వే సంహరించావు గనుక, వీని తప్పిదాలను మన్నించు!" అని స్తుతించింది భూదేవి.

ఇతి శ్రీవిష్ణుమహాపురాణే పంచమాంశే ఏకోనత్రింశో ధ్యాయః

భూత భావనుడైన భగవానుడు పృధ్వీ స్తోత్రానికి ప్రసన్నుడై ఆమెకు అభయప్రదానం చేసి, నరకుని అంతఃపురంలో ఉన్న 16000 మంది (పైన 100 కూడా...శ్లోకప్రకారం 'శతాధికాని దృశే సహస్రాణి' కనుక) సౌందర్యవతులైన కన్యలను, విలువైన రత్నాలను, 16000 ఉత్తమమైన నాలుగు దంతాలుగల ఏనుగులను, 21 లక్షల ఉత్తమైన కాంభోజదేశపు గుర్రాలను నరకుని భటులచేతనే అప్పటికప్పుడు ద్వారకాపురికి రవాణా చేయించాడు.

వరుణుని గొడుగును, మణి పర్వతం యొక్క మణులను, ఇంద్రుని తల్లి అదితి యొక్క మణిమయ కుండలాలను (నరకుడు అపహరించిన ఈ దేవతల సొత్తును) స్వయంగా తానే అప్పగించదలచి సత్యభామతో సహా అదే గరుడునిపై అధిరోహించి స్వర్గానికి వెళ్లాడు.

శ్రీకృష్ణుడు విజయుడై తిరిగొచ్చాడన్న వార్త ఇంద్రునికి అందింది. స్వర్గానికి వచ్చాడనీ తెలిసి, ఎదురేగి స్వాగతం పలికి ఆదరించాడు. శ్రీకృష్ణుడు దేవమాత అదితిని దర్శించి ఆమె కుండలాలు అప్పగించాడు. ఆమె ఆనందంతో అ జగన్నాధుని సోత్రం చేసింది.

లక్ష్మణ దేవర నవ్వు

రావణుడు మరణించిన తరవాత కపి సైన్యంతో విభీషణ,అంగద,సుగ్రీవులతో, సీతా లక్ష్మణులతో అయోధ్య చేరి పట్టాభిషేకం చేసుకుంటూ ఉన్న సందర్భం. పట్టాభిషేకం అట్టహాసంగా జరుతోంది.రాముని పక్కనే సింహాసంకి దగ్గరగా నిలబడి ఉన్నాడు లక్ష్మణుడు. ఆ పరిస్థితులలో లక్ష్మణుడు ఒక సారి చిరునవ్వు దీర్ఘంగా నవ్వేడు. లక్ష్మణ దేవర నవ్వినది అందరూ చూశారు.ఆ సందర్భంగా సభలో ఉన్న ఒక్కొకరు ఒకలా అనుకున్నారా నవ్వు చూసి.

ఆనాడు రాముని అడవులపాలు చేసి, భర్తను చంపుకుని,భరతునిచే తిట్లు తిని, నేడు ఆహ్వానం పలుకుతోందని, నా గురించే నవ్వేడా? అనుకుందిట కైక.

సుగ్రీవుడు, అన్నను చంపించి రాజ్యాన్ని సంపాదించాడా అని నన్ను చూసినవ్వేడేమో అనుకున్నాడట.

తండ్రి ని చంపించిన పిన తండ్రి పంచ చేరినందుకు ఆక్షేపిస్తున్నాడా అనుకున్నాడట అంగదుడు.

ఇంటి గుట్టు చెప్పి అన్నను చంపుకుని రాజ్యం సంపాదించుకున్నానని ఎగతాళీగా నన్ను చూసినవ్వేడా అనుకున్నాడట విభీషణుడు.

రాముడి బాణాలను తండ్రి వాయుదేవుని అనుగ్రహంతో వక్ర మార్గాన నడిపించానని పరిహాసం చేస్తున్నాడా అని హనుమ అనుకున్నాడట.

బంగారు లేడిని తెమ్మన్ని కోరినందుకు నవ్వుకుంటున్నాడేమో అనుకుందిట సీత.

బంగారు లేడి ఉండదని తెలిసీ భార్య కోరిక తీర్చడానికి బయలుదేరి వెళ్ళి చిక్కులలో పడినందుకు నవ్వుతున్నాడా అని శ్రీరాముడు అనుకున్నాడట.

అందరి మనసుల్లోనూ ఉన్న అనుమానాలను గ్రహించిన రాముడు, తమ్ముడి నవ్వు విశేషార్ధాలకు దారి తీస్తుందని లక్ష్మణుని" ఏందుకు నవ్వేవు సోదరా?" అని అడిగాడు. దానికి లక్ష్మణదేవర "అన్నా!' సీతా రాముల సేవలో ఏమరు పాటు లేకుండేందుకుగాను నిద్రాదేవిని ఒక వరం అడిగాను. నన్ను వనవాస సమయం లో పదునాల్గు సంవత్సరాలూ ఆవహించవద్దని.' దానికి నిద్రాదేవి అనుగ్రహిస్తూ 'పదునాలుగేళ్ళయిన తరవాత నిన్ను ఆవహిస్తానని' వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఆవహించని నిద్రాదేవి ఇప్పుడు ఈ సంతోష సమయంలో నన్ను ఆవహిస్తానని వచ్చింది. నిలబడే ఒక చిన్నకునుకు తీశానన్నయ్యా! నిద్రా దేవి మరచిపోకుండా వచ్చి నన్ను ఆవహించినందుకు నవ్వేను, మరేమీ కాదు" అన్నాడు. దానితో అందరూ తమతమ మనసులలో అనుకున్నది నిజం కాదని అనవసరంగా గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నామనుకుని నవ్వుకున్నారట.

మహాశివరాత్రి వృత్తాంతం


మహాశివరాత్రి వృత్తాంతం

మహాశివ రాత్రి మహాత్య వృత్తాంతం శివ పురాణములోని విద్యేశ్వర సంహితలో చెప్పబడింది.

గంగా యమునా సంగమ స్థానమైన ప్రయాగలో (నేటి అలహాబాదు) ఋషులు సత్రయాగం చేస్తున్నసమయంలో రోమర్షణ మహర్షి అని పేరు గాంచిన సూతమహర్షి అక్కడకు వస్తాడు. ఆలా వచ్చిన సూతమహర్షికి అ ఋషులు నమస్కరించి సర్వోత్తమమైన ఇతిహాస వృత్తాంతాన్ని చెప్పుమనగా అతను తనకు గురువైన వేదవ్యాసుడు తనకు చెప్పిన గాధను వివరించడం ప్రారంభిస్తాడు. ఒకసారి పరాశర కుమారుడైన వ్యాస మహర్షి సరస్వతీ నదీ తీరమున ధ్యానం చేస్తుంటాడు. ఆ సమయంలో సూర్యుని వలె ప్రకాశించే విమానంలో సనత్కుమారుడు వెళ్ళుతుంటాడు. దానిని గమనించిన వ్యాసుడు బ్రహ్మ కుమారుడైన సనత్కుమారునకు నమస్కరించి ముక్తిని ప్రసాదించే గాధను తెలుపుమంటాడు.

అప్పుడు మందర పర్వతం మీద బ్రహ్మ కుమారుడైన సనత్ కుమారుడు తనకు, నందికేశ్వరునికి మధ్య జరిగిన సంవాదాన్ని వ్యాసునికి చెప్పగా, వ్యాసుడు సూతునికి చెప్పిన వృత్తాంతాన్ని సత్రయాగంలో ఋషులకు చెబుతాడు. సనత్కుమారుడు నందికేశ్వరుడిని శివుని సాకారమైన మూర్తిగా, నిరాకారుడైన లింగంగా పూజించడానికి సంబంధించిన వృత్తాంతాన్ని చెప్పమంటాడు. దానికి సమాధానంగా నందికేశ్వరుడు ఈ వృత్తాంతాన్ని చెబుతాడు.

బ్రహ్మ, విష్ణువుల యుద్ధం

ఒకప్పుడు ప్రళయ కాలం సంప్రాప్తము కాగ మహాత్ములగు బ్రహ్మ, విష్ణువులు ఒకరితో ఒకరు యుద్ధానికి దిగిరి. ఆ సమయంలోనే మహాదేవుడు లింగరూపంగా ఆవిర్భవించెను. దాని వివరాలు ఇలాఉన్నాయి. ఒకప్పుడు బ్రహ్మ అనుకోకుండా వైకుంఠానికి వెళ్ళి, శేష శయ్యపై నిద్రించుచున్న విష్ణువును చూసి, "నీవెవరవు నన్ను చూసి గర్వముతో శయ్యపై పరుండినావు లెమ్ము. నీ ప్రభువను వచ్చి ఉన్నాను నన్ను చూడుము. ఆరాధనీయుడైన గురువు వచ్చినప్పుడు గర్వించిన మూఢుడికి ప్రాయశ్చిత్తం విధించబడును" అని అంటాడు. ఆ మాటలు విన్న విష్ణువు బ్రహ్మను ఆహ్వానించి, ఆసనం ఇచ్చి, "నీచూపులు ప్రసన్నంగా లేవేమి?" అంటాడు. దానికి సమాధానంగా బ్రహ్మ "నేను కాలముతో సమానమైన వేగముతో వచ్చినాను. పితామహుడను. జగత్తును, నిన్ను కూడా రక్షించువాడను" అంటాడు. అప్పుడు విష్ణువు బ్రహ్మతో "జగత్తు నాలో ఉంది. నీవు చోరుని వలె ఉన్నావు. నీవే నా నాభిలోని పద్మమునుండి జన్మించినావు. కావున నీవు నా పుత్రుడవు. నీవు వ్యర్థముగా మాట్లాడు తున్నావు" అంటాడు.

ఈ విధంగా బ్రహ్మ విష్ణువు ఒకరితోనొకరు సంవాదము లోనికి దిగి, చివరికి యుద్ధసన్నద్దులౌతారు. బ్రహ్మ హంస వాహనం పైన, విష్ణువు గరుడ వాహనం పైన ఉండి యుద్ధాన్ని ఆరంభిస్తారు. ఈ విధంగా వారివురు యుద్ధం చేయుచుండగా దేవతలు వారివారి విమానాలు అధిరోహించి వీక్షిస్తుంటారు. బ్రహ్మ, విష్ణువుల మధ్య యుద్ధం అత్యంత ఉత్కంఠతో జరుగుతూ ఉంటే వారు ఒకరి వక్షస్థలం పై మరొకరు అగ్నిహోత్ర సమానమైన బాణాలు సంధించుకొన సాగిరి. ఇలా సమరం జరుగుచుండగా, విష్ణువు మాహేశ్వరాస్త్రం, బ్రహ్మ పాశుపతాస్త్రం ఒకరిమీదకు ఒకరు సంధించుకొంటారు. ఆ అస్త్రాలను వారు సంధించిన వెంటనే సమస్త దేవతలకు భీతి కల్గుతుంది. ఏమీ చేయలేక, దేవతలందరు శివునికి నివాసమైన కైలాసానికి బయలు దేరుతారు. ప్రమథగణాల కు నాయకుడైన శివుని నివాసస్థలమైన కైలాసం లో మణులు పొదగబడిన సభా మధ్యం లో ఉమాసహితుడై తేజస్సుతో విరాజిల్లుతున్న మహాదేవునికి పరిచారికలు శద్ధతో వింజామరలు వీచుచుంటారు. ఈ విధంగా నున్న ఈశ్వరునికి దేవతలు ఆనందభాష్పాలతో సాష్టాంగంగా ప్రణమిల్లుతారు. అప్పుడు ప్రమథ గణాలచేత శివుడు దేవతలను దగ్గరకు రమ్మని అహ్వానిస్తాడు. అన్ని విషయాలు ఎరిగిన శివుడు దేవతలతో "బ్రహ్మ, విష్ణువుల యుద్ధము నాకు ముందుగానే తెలియును. మీ కలవరము గాంచిన నాకు మరల చెప్పినట్లైనది " అంటాడు. బ్రహ్మ, విష్ణువులకు ప్రభువైన శివుడు సభలో ఉన్న వంద ప్రమథ గణాలను యుద్ధానికి బయలుదేరమని చెప్పి, తాను అనేక వాద్యములతో అలంకారములతో కూడిన వాహనం పై రంగు రంగుల ధ్వజముతో, వింజామరతో, పుష్పవర్షముతో, సంగీతము నాట్యమాడే గుంపులతో, వాద్య సముహంతో, పార్వతీదేవి తో బయలుదేరుతాడు. యుద్ధానికి వెళ్ళిన వెంటనే వాద్యాల ఘోషను ఆపి, రహస్యంగా యుద్ధాన్ని తిలకిస్తాడు.మాహేశ్వరాస్త్రం, పాశుపతాస్త్రం విధ్వంసాన్ని సృష్టించబోయే సమయంలో శివుడు అగ్ని స్తంభ రూపంలో ఆవిర్భవించి ఆ రెండు అస్త్రాలను తనలో ఐక్యం చేసుకొంటాడు. బ్రహ్మ, విష్ణువులు ఆశ్చర్య చకితులై ఆ స్తంభం ఆది, అంతం కనుగొనడం కోసం వారివారి వాహనాలతో బయలు దేరుతారు. విష్ణువు అంతము కనుగొనుటకు వరాహరూపుడై, బ్రహ్మ ఆది తెలుకొనుటకు హంసరూపుడై బయలుదేరుతారు. ఎంతపోయినను అంతము తెలియకపోవడం వల్ల విష్ణుమూర్తి వెనుకకు తిరిగి బయలుదేరిన భాగానికి వస్తాడు. బ్రహ్మకు పైకి వెళ్ళే సమయం లో మార్గమధ్యం లో కామధేనువు క్రిందకు దిగుతూను, ఒక మొగలి పువ్వు(బ్రహ్మ, విష్ణువు ల సమరాన్ని చూస్తూ పరమేశ్వరుడు నవ్వినప్పుడు ఆయన జటాజూటం నుండి జారినదే ఆ మొగలి పువ్వు) క్రింద పడుతూనూ కనిపించాయి. ఆ రెంటిని చూసి బ్రహ్మ 'నేను ఆది చూశాను అని అసత్యము చెప్పండి. ఆపత్కాలమందు అసత్యము చెప్పడము ధర్మ సమ్మతమే" అని చెప్పి కామధేనువు తోను, మొగలి పువ్వుతోను ఒడంబడిక చేసుకొంటాడు. వాటి తో ఒడంబడిక చేసుకొన్న తరువాత బ్రహ్మ తిరిగి స్వస్థానానికి వచ్చి,అక్కడ డస్సి ఉన్న విష్ణువు ని చూసి, తాను ఆదిని చూశానని, దానికి సాక్ష్యం కామధేనువు, మొగలి పువ్వు అని చెబుతాడు. అప్పుడు విష్ణువు ఆ మాటను నమ్మి బ్రహ్మ కి షోడశోపచారా లతో పూజ చేస్తాడు.కాని,శివుడు ఆ రెండింటిని వివరము అడుగగా, బ్రహ్మ స్తంభం ఆది ని చూడడం నిజమేనని మొగలి పువ్వు చెపుతుంది. కామధేనువు మాత్రం నిజమేనని తల ఊపి, నిజం కాదని తోకను అడ్డంగా ఊపింది. జరిగిన మోసాన్ని తెలుసుకున్న శివుడు కోపోద్రిక్తుడైనాడు.మోసము చేసిన బ్రహ్మ ను శిక్షించడంకోసం శివుడు అగ్ని లింగ స్వరూపం నుండి సాకారమైన శివుడి గా ప్రత్యక్షం అవుతాడు. అది చూసిన విష్ణువు, బ్రహ్మ సాకారుడైన శివునకు నమస్కరిస్తారు. శివుడు విష్ణువు సత్యవాక్యానికి సంతసించి ఇకనుండి తనతో సమానమైన పూజా కైంకర్యాలు విష్ణువు అందుకొంటాడని, విష్ణువు కి ప్రత్యేకంగా క్షేత్రాలు ఉంటాయని ఆశీర్వదిస్తాడు.

బ్రహ్మకు శాపము

శివుడు బ్రహ్మ గర్వము అణచడానికి తన కనుబొమ్మల నుండి భైరవుడిని సృష్టించి పదునైన కత్తి తో ఈ బ్రహ్మ ను శిక్షించుము అని చెబుతాడు. ఆ భైరవుడు వెళ్లి బ్రహ్మ పంచముఖాల లో ఏ ముఖము అయితే అసత్యము చెప్పిందో ఆ ముఖాన్ని పదునైన కత్తి తో నరికి వేస్తాడు. అప్పుడు మహావిష్ణువు శివుడి వద్దకు వెళ్లి, పూర్వము ఈశ్వర చిహ్నం గా బ్రహ్మ కు ఐదు ముఖాలు ఇచ్చి ఉంటివి. ఈ మొదటి దైవము అగు బ్రహ్మ ను ఇప్పుడు క్షమించుము అన్నాడు. ఆ మాటలు విన్న శివుడు బ్రహ్మని క్షమించి, బ్రహ్మకు స్థానము, పూజ , అభిషేకము మున్నగునవి ఉండవు అని చెప్పాడు. నిన్ను అగ్నిష్టోమము, యజ్ఞములలో గురుస్థానము లో నిలబెడుతున్నాను అని విష్ణువుతో చెప్పాడు.

మొగలి పువ్వుకు శాపము

ఆతరువాత కేతకీపుష్పము వైపు చూసి , అసత్యము పల్కిన నీతో పూజలు ఉండకుండా ఉండు గాక అని అనగానే దేవతలు కేతకీపుష్పాన్ని దూరంగా ఉంచారు. దీనితో కలతచెందిన కేతకీపుష్పము పరమేశ్వరుడవైన నిన్ను చూసిన తరువాత కూడా అసత్య దోషము ఉండునా అని మహాదేవుడిని స్తుతించింది. దానితో ప్రీతి చెందిన శివుడు అసత్యము చెప్పిన నిన్ను ధరించడం జరగదు, కాని కేతకీ పుష్పాన్ని నా భక్తులు ధరిస్తారు. అదేవిధంగా కేతకీ పుష్పము ఛత్ర రూపము లో నాపై ఉంటుంది అని చెబుతాడు.

కామధేనువుకు శాపము

అసత్యాన్ని చెప్పిన కామధేనువును కూడా శివుడు శిక్షించదలచాడు. అసత్యమాడినందుకు పూజలు ఉండవని శివుడు కామధేనువుకు శాపమిచ్చాడు. తోకతో నిజం చెప్పాను కనుక క్షమించుమని కామధేనువు శివుని ప్రాధేయపడింది. భోలాశంకరుడు కనుక, కోపమును దిగమ్రింగి, " మొగము తో అసత్యమాడితివి కనుక నీ మొగము పూజనీయము కాదు; కాని సత్యమాడిన నీ పృష్ఠ భాగము పునీతమై, పూజలనందుకొనును" అని శివుడు వాక్రుచ్చెను. అప్పటి నుండి గోముఖము పూజార్హము కాని దైనది; గోమూత్రము, గోమయము, గోక్షీరము లు పునీతములైనవై, పూజా, పురస్కారములలో వాడబడుచున్నవి.

శివరాత్రి పర్వదినం

ఆ తరువాత బ్రహ్మ, విష్ణువు , దేవతలు శివుడిని ధూపదీపాలతో అర్చించారు. దీనికి మెచ్చి శివుడు అక్కడి వారితో "మీరీనాడు చేసిన పూజకు సంతసించితిని. ఈ రోజు నుండి నేను అవతరించిన ఈ తిథి శివరాత్రి పర్వదినముగా ప్రసిద్ధి చెందుతుంది.

ఈ రోజున ఉపవాసము చేసి భక్తితో నన్ను లింగ రూపముగా, సాకార రూపముగా ఎవరు అర్చిస్తారో వారికి మహాఫలము కలుగుతుంది" అని చెబుతాడు. తాను ఈ విధంగా అగ్నిలింగరూపము గా ఆవిర్భవించిన ప్రదేశము అరుణాచలముగా ప్రసిద్ధిచెంద గలదని చెబుతాడు.

జాగరణము

జాగరణము అనగా ప్రకృతిలో నిద్రాణమైయున్న శివశక్తిని, శివపూజా భజన లీలా శ్రవణాదులతో మేల్కొలిపి, తాను శివుడై, సర్వమును శివస్వరూపముగా భావించి, దర్శించుటయే నిజమైన జాగరణము. అప్పుడు శివపూజలో సాయుజ్యము, శివభజనలో సామీప్యము, శివభక్తులతో కూడి, శివ విషయములు ప్రసంగించుటలో సలోక్యము, శివధ్యానములో సారూప్యము సిద్ధించునని ఆదిశంకరాచార్యులు మాట ప్రత్యక్ష సత్యమగును. ఈ నాలుగింటిని శివరాత్రి నాడు ప్రత్యక్షముగా సాధించుటయే శివరాత్రి జాగరణము
 

Friday, May 23, 2014

లక్ష్మీదేవి పూజకు సంబంధించినవి

కొబ్బరి, అరటి, మామిడి,బంతి,తులసి,బిల్వ వృక్షాలలో లక్ష్మిదేవి నివసిస్తుంది. ప్రకృతి ఔదార్యానికి కొబ్బరి చెట్టు ప్రతీక. దానిని ప్రత్యేక పోషణలు అవసరం లేదు. ఇట్టే పెరిగి పోతుంది. చెట్టులోని ప్రతి భాగం ఉపయుక్తమైనది. అరటి చెట్టుకు ఎంతో ఆర్ధిక విలువలు ఉన్నాయి. అరటి ఆకులో భోజనాలు చేస్తాం. ఏ శుభకార్యాలు అయినా, పూజలు జరిగినా అరటిపండ్లు ఉండాల్సిందే. మామిడితోరణాలు ఇంటిగుమ్మాలకు కడతాం. వసంతంలో వచ్చే మామిడిపూత మన్మధునికి ప్రీతి. లక్ష్మి పుత్రుడు మన్మధుడు. బంతి పువ్వులను గుమ్మాలకు కట్టి లక్ష్మి దేవికి స్వాగతం పలుకుతాము. అలాగే తులసి చెట్టుతోను దేవికి బాంధవ్యముంది. తులసీ దళాలు లేకుండా విష్ణుమూర్తికి చేసే పూజ సంపూర్ణం కాదు. మారేడు పండులోనూ లక్ష్మిదేవి ఉంటుంది అంటారు. ఒకసారి లక్ష్మిదేవి శివుడికి వెయ్యి కలువ పువ్వులతో పూజ చేసుకుంటాను అని సంకల్పం చేసుకుంటుంది. శివుడు ఆమె భక్తిని పరీక్షించేందుకు ఒక పూవును తీస్కుంటాడు. అలాగ ఒక పువ్వు తక్కువయిన విషయాన్ని గమనించిన లక్ష్మి దేవి భూమి అంతా గాలించిన ఒక్క పువ్వు కుడా దొరకదు. అప్పుడు ఆ తల్లి తన ఒక స్తనాన్ని కలువపువ్వుగా సమర్పించదలుస్తుంది. ఆమె సాహసానికి ,భక్తికి ముగ్ధుడైన శివుడు అమ్మవారి స్థనాన్ని మారేడుపండుగా మార్చి,తనకి మారేడు పత్రాలతో పూజ చేస్తే ప్రీతి పొందుతాను అని ప్రకటిస్తాడు. అలాగే తమలపాకు,వక్కల్ని కూడా లక్ష్మీదేవి పూజకు సంబంధించినవి !!!!!!!!!!!!!

తిరుమల వేంకటేశ్వరుని ఐదు రూపాలు


తిరుమల వేంకటేశ్వరుని ఆలయంలో మూలవిరాట్టు కాకుండా, మరో నాలుగు మూర్తులు ఉన్నాయి. ఈ మూర్తులు వరుసగా - భోగ శ్రీనివాసమూర్తి, ఉగ్ర శ్రీనివాసమూర్తి, మూలమూర్తి, కొలువు శ్రీనివాసమూర్తి, శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వాములు. ఏయే రూపాల ప్రాధాన్యత ఏమిటో

మూలమూర్తి (ధ్రువబేరం)
నిత్యం లక్షలాదిమంది భక్తిప్రపత్తులతో దర్శించుకునే మూలవిరాట్టును ధ్రువబేరం అంటారు. ధ్రువ అంటే స్థిరంగా ఉండేది అని అర్ధం. ధృవబేరం అంటే నేలలో స్తంభం పాతుకున్నట్లు స్థిరంగా ఉండే విగ్రహమూర్తి. మూలవిరాట్టు అయిన ధ్రువబేరానికి తెల్లవారుజామున సుప్రభాతసేవ మొదలు, అర్ధరాత్రి ఏకాంతసేవ వరకూ రోజంతా ఆరాధనలు జరుగుతాయి. ఈ మూలవిరాట్టు సాలగ్రామమూర్తి. మూలమూర్తి శిరస్సు నుండి పాదం వరకూ ఎనిమిది అడుగుల ఎత్తులో ఉంటుంది. ''వీరస్థానక'' పద్ధతిలో నిలబడి ఉన్న మూలవిరాట్టు పక్కన శ్రీదేవి, భూదేవి విగ్రహాలు ఉండవు. నిత్యం లక్షలాదిమంది భక్తులు తిరుమలేశుని దివ్య మంగళ దర్శనం కోసం ఎదురుచూస్తారు కనుక ఈ మూలవిరాట్టును (ధృవబేరం) దర్శించుకోడానికి రెండు క్షణాల కంటే సమయాన్ని కేటాయించలేరు.

భోగ శ్రీనివాసమూర్తి (కౌతుక బేరం)
ఒక అడుగు ఎత్తులో ఉండే భోగ శ్రీనివాసమూర్తిని వ్యవహారంలో భోగ శ్రీనివాసుడు అంటారు. ఇంకోరకంగా కౌతుక బేరం లేదా పురుష బేరం అంటారు. నిత్యం జరిపే దీపారాధన, నైవేద్యం, అభిషేకం, ఏకాంత సేవలు భోగ శ్రీనివాస మూర్తికి జరిపిస్తారు. ఈ వెండి శ్రీనివాసుని విగ్రహాన్నిక్రీస్తుశకం 614లో పల్లవ మహారాణి సామవాయి పేరిందేవి ఆలయానికి సమర్పించినట్లు శాసనాల్లో ఆధారాలు లభించాయి. మహారాణి ఈ శ్రీనివాసమూర్తిని సమర్పించిన నాటి నుండి నేటివరకూ ఎన్నడూ ఆలయం నుండి విగ్రహాన్ని ఆలయం నుండి తొలగించలేదు. ఆగమ శాస్త్రాన్ని అనుసరించి మూలవిరాట్టుకు చేసే సేవలు భోగ శ్రీనివాస మూర్తికి అందుతాయి.

ఉగ్ర శ్రీనివాసమూర్తి (స్నపన బేరం)
ఉగ్ర శ్రీనివాసమూర్తిని స్నపన బేరం అంటారు. ఈ మూర్తి శ్రీదేవి, భూదేవి సమేతంగా ఉంటుంది. నిజానికి శ్రీనివాసమూర్తి రూపం 11వ శతాబ్దం వరకూ ఉత్సవ విగ్రహంగా ఉండేది. క్రీస్తుశకం 1330లో ఒకసారి ఉత్సవ విగ్రహంగా ఊరేగింపు జరుపుతుండగా అగ్నిప్రమాదం సంభవించింది. దాంతో, అది ఉగ్ర శ్రీనివాసుని రూపానికి సంకేతంగా భావించారు. అప్పటినుంచి శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప రూపాన్ని ఉత్సవ విగ్రహంగా రూపొందించారు. ఆవిధంగా అగ్ని ప్రమాదం జరిగినప్పటినుంచి ఉగ్ర శ్రీనివాస మూర్తిని సంవత్సరానికి ఒకసారి సూర్యోదయానికి ముందు సర్వ అలంకారాలతో సుందరంగా తీర్చిదిద్ది ఊరేగింపుకు తీసుకెళ్ళి, తిరిగి అంతరాలయానికి తీసుకొస్తారు.

శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి (ఉత్సవబేరం)
13వ శతాబ్దంలో ఉగ్ర శ్రీనివాసమూర్తిని ఊరేగింపుకు తీసికెళ్ళడం మానేసిన తర్వాత శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామిని ఉత్సవ వేడుకల్లో ఊరేగిస్తున్నారు. ఈ శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామిని ఉత్సవబేరం అంటారు. ఈ మూర్తి మూడు అడుగుల ఎత్తు ఉంటుంది. బ్రహ్మోత్సవాలతో సహా ప్రతి ఉత్సవంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామినే ఊరేగిస్తారు.

కొలువు శ్రీనివాసమూర్తి (బలిబేరం)
గర్భగుడిలో మూలవిరాట్టు పక్కన ఉండే మరొక చిన్న విగ్రహాన్ని కొలువు శ్రీనివాసమూర్తి అంటారు. ఆగమ పరిభాషలో బలిబేరం అంటారు. మూలవిరాట్టుకు తోమాలసేవ నిర్వహించిన తర్వాత కొలువు శ్రీనివాసుని బంగారు సింహాసనంపై ఉంచి పంచాంగ శ్రవణం చేస్తారు. తిరుమలలో ఆవేళ జరిగే ఉత్సవ వేడుకలు ఏమైనా ఉంటే వాటి వివరాలను తెలియజేస్తారు. శ్రీవారి హుండీలో గతరోజు వచ్చిన కానుకల వివరాలను, ఆదాయ, వ్యయాలను తెలియజేస్తారు.
 

ఉదయం లేవగానే

కరదర్శనం :- కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతి / కరమూలే స్థితాగౌరి ప్రభాతే కరదర్శనం // 
చేయి పైభాగాన లక్ష్మీ, మధ్యభాగమున సరస్వతి, చివరిభాగమున గౌరీదేవి వున్నందున ప్రాతః కాలమున ఈ శ్లోకం చదివి మన రెండు చేతులను కళ్ళకు అద్దుకోవలెను. 
లేదా
మూడుసార్లు శ్రీహరి, శ్రీహరి శ్రీహరి అని తలస్తూ కరదర్శనం చేసుకోవలెను)

భూప్రార్ధన :- సముద్ర వసనే దేవి పర్వతస్తన మండలే / విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్యమే //
పాదస్పర్శతో భూదేవిని బాధిస్తున్నందుకు క్షమాపణ చెప్తూ కాలిని నేలకు ఆన్చాలి.
లేదా
పాదస్పర్శ క్షమస్వమే, భూదేవి నమోస్తుతే అనైన ప్రార్ధించవచ్చును)

ప్రాతః స్మరణ :- బ్రహ్మ మురారి స్త్రిపురాంతకశ్చ, భాను శ్శశీ భూమిసుతో బుధశ్చ / గురుశ్చ శుక్ర శ్శని రాహు కేతవః, కుర్వంతం సర్వే మమ సుప్రభాతమ్ //
త్రిమూర్తులు, సూర్యచంద్రులు, నవగ్రహాలు నాకు మేలు చేయుదురుగాక!
లేదా
హరం హరిం హరిశ్చంద్రం హనూమంతం హలాయుధమ్ / పంచకం వై స్మరేన్నిత్యం ఘోరసంకటనాశనమ్ //

స్నాన విధి :- గంగే చ యమునే చైవ కృష్ణే గోదావరి సరస్వతి / నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు //
లేదా
యో సౌ సర్వగతో విష్ణు: చిత్ స్వరూపీ నిరంజనః / స ఏవ ద్రవరూపేణ గంగాంభో నాత్ర సంశయః //

(భాహ్యాభ్యంతరభేదేన శౌచం తు ద్వివిధం స్మృతమ్ / మృజ్జలాభ్యాం బహిశుద్ధి ర్భావశుద్ధి స్తదాన్తరమ్ //
బాహ్యాభ్యంతర భేదములచే శౌచం రెండువిధములుగా వుండును. జలముచే కలిగెడుశుద్ధి బాహ్యశుద్ది, నిర్మలభావము(భావశుద్ధి) చే కలిగెడుశుద్ధి అంతర శుద్ధి).

ఆత్మను పరమాత్మలో లయం చేయడానికి మన పూజావిధానం ఒక ఉతమోత్తమ మార్గం. దేవుని విగ్రహం లేదా చిత్రం విశ్వాత్మకు ప్రతిబింబం. విగ్రహం భూతత్వమైనది. అలానేసాంబ్రాణి ధూపం భూతత్వమైన వాసన కల్గివుంటుంది. ఇవి మూలాధారచక్రమును ఉత్తేజితం చేస్తుంది. అలానే తీర్ధ ప్రసాదాలు రుచి ద్వారా స్వాదిష్టానాన్ని ఉత్తేజితం చేస్తుంది. దీపం, హారతి ద్వారా జనించిన అగ్ని మణిపూరచక్రమును, గంధం, అగరబత్తిల ద్వారా వాయుతత్వమైన అనాహతచక్రమును, గంటానాదం ద్వారా విశుద్ధిచక్రం ఉత్తేజితం అవుతాయి. తద్వారా ఆజ్ఞాచక్రం, సహస్రారం జాగృతం అవుతాయి. ఇట్లా మనలోని నాడీకేంద్రాలను జాగృతం చేసుకోవడానికి పూజావిధానాన్ని ప్రాచీన మహర్షులు మనకందించారు. మంత్రాలు, ప్రార్ధనలు, సంకీర్తనలు, అర్చనలు, పూజలు ద్వారా మన షట్చక్రాలను మేలుకొల్పి కుండలినీశక్తిని పైకి నడిపి సహస్రారంలో గల పరమాత్మతత్వాన్ని ఆరాదిస్తున్నాం.

పూజావిధం :- చిత్రం, మృత్తిక, శిల, దారువు, లోహం.... దేనితో తయారైనదైనా దానిని భగవంతుని ప్రతిరూపముగా భావించి పూజిస్తాం. [ఈ రూపాలు మన ప్రగాడ విశ్వాసభావనతో ఏర్పరుచుకున్నవి]
{న తే రూపం న చాకారో నాయుధాని న చాన్పదమ్ / తధ్కాపి పురుషాకారో భక్తానాం త్వం ప్రకాశాసే //
భగవంతునికి ప్రత్యేకముగా ఒక్క రూపముగాని, ఒక్క ఆకారముగాని, ఆయుధముగాని (శంఖు,చక్ర,డమరు మొదలగు), వైకుంఠ కైలాసాది ప్రత్యేక స్థలములుగాని లేనప్పటికిని భక్తవత్సలగుటచేతను, పరమకరుణాస్వరూపులగుటచేతను భక్తులయొక్క భావమును అనుసరించి అనేకరూపములను ధరించుచున్నారు.
యే యధా మాం ప్రవద్యంతే తాంస్తదైవ భజామ్యహం ..... ఎవరు ఎలాంటి భావముతో నన్ను ఉపాసింతురో వారికాలాంటి భావముతో దర్శనమిత్తును.}

దీపస్తుతి :- దీపం జ్యోతి: పరబ్రహ్మ దీపం సర్వ తమోపహమ్ / దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే //
దీపజ్యోతే పరబ్రహ్మం. దీపజ్యోతే అన్ని తమో గుణాలని హరించేది. దీపం వల్లే సర్వం సాధ్యం. సంధ్యలో వెలిగే దీపానికి నమస్కారాలు. [దీపకాంతిలో తమోరజో గుణాలు హరిస్తాయి]

నమస్కారం :- పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవః / త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల //
తలవంచి రెండు చేతులు జోడించి హృదయం వద్దగానీ, భ్రూమధ్యంలో గానీ, నెత్తి పై అంటే సహస్రారంపై గానీ పెట్టి నమస్కరించడానికి కారణం ఏమిటంటే - మూడు ప్రదేశాలలో భగవంతుని భావన విశేషంగా ఉంటుంది. హృదయంలో ఆత్మరూపములో, భ్రూమధ్యంలో జీవరూపములో, సహస్రారంలో పరమాత్మరూపములో ఉంటుంది.
'న' అంటే లేదు, 'మ' అంటే నాది అయినటువంటిది అని అర్ధం. నమః అంటే నాదంటూ ఏదిలేదని అర్ధం. భగవంతున్ని నమష్కరించడం అంటే నాదంటూ ఏదిలేదని, ఉన్నదంతా నీదే (పరమాత్మదే) అని శరణాగతి భావమును తెలపడం.

పూజకు వినియోగించే పదార్దముల అంతరార్ధం :- కృష్ణభగవానుడు చెప్పిన పత్రం, పుష్పం, ఫలం, తోయంలకు అర్ధమేమిటంటే - పత్రం అంటే దేహం. ఈ శరీరమును వినియోగిస్తూ చేసే క్రియలను భక్తిభావముతో కృష్ణార్పణం చేయాలి.(ప్రారబ్ధకర్మనుండి విముక్తి కల్గుతుంది) పుష్పం అంటే హృదయం. పుష్పములా సున్నితముగా, సువాసనభరితంగా, స్వచ్ఛముగా వున్నా హృదయమును సమర్పించాలి. ఫలం అంటే కర్మఫలం. ఫలములో విత్తనములు వుంటాయి, అవి నాటితే తిరిగి చిగురిస్తాయి. అలానే కర్మల వలన జన్మించాల్సివస్తుంది. అలానే కర్మఫలాన్ని అనుభవించాల్సివస్తుంది. అలా కాకుండా త్రికరణశుద్ధిగా కర్మఫలాన్ని ఈశ్వరార్పణం చేస్తే కర్మబంధం తప్పుతుంది.(దీనివలన సంచిత, ఆగామి కర్మలనుడి విముక్తికల్గుతుంది) తోయమనగా భక్తిరసం. ఆరాధనతో, ఆర్తితో పరిపూర్ణ శరణాగతి భక్తిభావముతో మనస్సు ఉప్పొంగికార్చే ఆనందభాష్పాలను సమర్పించాలి.
కొబ్బరికాయ :- కొబ్బరికాయ కొడుతున్నామంటే మన అహంకారమును వీడుతున్నామని. కొట్టిన కొబ్బరిచెక్కలను భగవంతునికి సమర్పించడమంటే - లోపలున్న తెల్లనికొబ్బరిలా మన మనస్సును సంపూర్ణముగా భగవంతుని ముందు పరిచామని. తద్వారా నిర్మలమైన కొబ్బరినీరులా మన జీవితాలని వుంచమని అర్ధం. కొబ్బరి బయటిభాగం మన శరీరమని, లోపలభాగం మన మనస్సని, మూడుకళ్ళు ఇడా,పింగళ, సుషమ్ననాడులని కూడా పెద్దలు చెప్తారు. అలానే కొబ్బరికాయపై పీచును తమోగుణమునకు ప్రతీకగా, గట్టిగా ఉండే టెంక రజోగుణమునకు ప్రతీకగా, లోపల ఉన్న తెల్లని కొబ్బరిని సత్వగుణమునకు ప్రతీకగా విశీదకరిస్తూ, మనలో ఉన్న త్రిగుణములను బద్దలుకొట్టి పావనమైన అంతఃకరణమును కొబ్బరినీరుగా భగవంతునికి అర్పించడమనే అర్ధాని కొందరు చెప్తారు.
ధూపం :- సువాసనభరితమైన ధూపం మనలో వున్న చెడువాసనలను తొలగించాలని వెలిగిస్తాం.
హారతి స్తుతి :- ఆరోగ్యం ఆయుష్యం అనంతసౌఖ్యం
సంపత్సముర్ధ్యం శుభసన్నిధానం
కర్పూరదీవేన లభస్త్యదేహి
నీరాజనయే వేంకటనాధ నిత్యమ్.మనలోనికి
కర్మవాసనలన్నియు కర్పూరముల పూర్తిగా క్షయింపబడాలని. ఏ శేషములేకుండా భగవంతుని ముందు వెలిగించిన హారతి భగవంతునిలో కైకర్యం చెందినట్లుగా భక్తిభావంతో మనలోవెలుగుతున్నఆత్మ పరమాత్ముని యందు ఐక్యంకావాలని కోరుకోవడం. హారతిని కళ్ళకు అద్దుకోవడమంటే మన దృష్టి అంతర్ముఖం కావాలని.
గంట :- మనస్సు ఎన్నో విషయాలు (జ్ఞాపకాలు, ఆలోచనలతో) తో నిండి ఉంటుంది. వాటన్నింటిని విడిచి కొన్ని క్షణములైన దైవమందు మనస్సు నిల్పవలయునని ఉద్దేశ్యంతో గంటను పుజాసామగ్రిలో ఓ భాగంగా పూర్వీకులు ప్రవేశపెట్టారు. ఘంటారావం వినగానే అనేక విషయాలయందు తిరిగే మనస్సు ఆ నాదమందైక్యమై నాదం ఏకస్థాయికి వచ్చునట్లు మనస్సు కూడా ఏకస్థాయికి వచ్చును అని పెద్దలు చెప్తారు. ఘంటానాదం నిశ్చబ్ధ స్థితిలోకి తీసుకువెళ్ళి, మన మనస్సును నిజ తత్వమైన ఆత్మవైపు కాసేపైన మళ్ళిస్తుంది. శబ్దంలోనుంచి నిశ్శబ్ధం, శూన్యంలోకి వెళ్ళమని గంట సూచిస్తుంది.
నైవేద్య నివేదన శ్లోకం :- త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే /తేన త్వదంఘ్రి కమలే భక్తిం మే యచ్చ శాశ్వతీం
గోవిందా! నీ వస్తువులు నీకే సమర్పిస్తున్నాను. వీనితో నీ చరణకమలాలపై శాశ్వతమైన భక్తి కలుగునట్లు ప్రసాదించు.

ప్రదక్షిణ స్తుతి :- యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ / తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే //
ప్రదక్షిణ అనగా నేను అన్నివైపుల నుండి నిన్నే కాంచుతూ నిన్నే అనుసరిస్తూ ధ్యానిస్తున్నానని అర్ధం. 'ప్ర' అనగా పాపాల నాశనమని, 'ద' అనగా కోరికలు తీర్చమని, 'క్షి' అనగా మరు జన్మలో మంచి జన్మ ఇవ్వమని, 'ణ' అంటే అజ్ఞానం పారద్రోలి ఆత్మజ్ఞానమును ఇవ్వమనే అర్ధమును కొందరు చెప్తారు.
దివ్యమంగళకరమగు భగవద్విగ్రహంను దర్శిస్తూ నేతేన్ద్రియములు భక్తిత్వంలో లయించును. సుగంధ ధూపవాసనలచే ఘ్రానేన్ద్రియం లయించును. ఓంకారం, గంటానాదం, శంఖారావం, మంత్రోచ్చారణలయందు కర్ణేన్ద్రియములు లీనమగును. భాగావన్నామోచ్చారణల చేతను, తీర్ధాది ప్రసాదముల చేతను జిహ్వేంద్రియం లయించును. పరిమిళమిళిత శీతలదాయకమగు పసుపుకుంకుమ చందనాదులచే త్వగింద్రియం శాంతంనొంది పవిత్రభావాలతో పులకరించును. పంచేంద్రియములు ఇలా ఒకే ధ్యాసతో భక్తిభావంనందు లయమైనప్పుడే మనస్సు కూడా పూర్తిగా ఏకాగ్రతతో యందు లయించును.
సూర్య స్తుతి :- ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మామ భాస్కర / దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే //
లేదా
సప్తాశ్వరధ మారుడం ప్రచండం కశ్యపాత్మజమ్/ శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ //
లేదా
త్రైగుణ్యం చ మహాశూరం బ్రహ్మ విష్ణు మహేశ్వరమ్ / మహాపాపహారం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ //
లేదా
తులసి స్తుతి:- యన్మూలే సర్వతీర్ధాని యన్మధ్యే సర్వదేవతాః / యదగ్రే సర్వవేదాశ్చ తులసీం త్వాం నమామ్యహమ్ //
లేదా
ప్రసీద దేవదేవేశి ప్రసీద హరివల్లభే / క్షీరోదమాధనోద్భూతే తులసి త్వాం నమామ్యహమ్ //

నవగ్రహ స్తుతి :- ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయచ / గురు శుక్ర శనిభ్యశ్ఛ రాహవే కేతవే నమః //

గురు స్తుతి :- గురు బ్రహ్మా గురు విష్ణు: గురు దేవో మహేశ్వరః / గురు సాక్షాత్ పరంబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః //
లేదా
అఖండ మండలాకారం వ్యాప్తం యేవ చరాచరమ్ / తత్పదం దర్శితం యేవ తస్మై శ్రీ గురవే నమః //
లేదా
అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా / చక్షురున్మీలితం యేవ తస్మై శ్రీ గురవే నమః //

భోజనమునకు ముందు :- (ఏది భుజించినను భగవంతుని ప్రసాదముగానే స్వీకరించాలి)
అన్నపూర్ణే సదాపూర్ణే శంకరప్రాణవల్లబే / జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్ధం భిక్షాం దేహి చ పార్వతి //
లేదా
అన్నం బ్రహ్మరసో విష్ణు: భోక్తా దేవో మహేశ్వరః / ఇతిస్మరన్ ప్రభుం జానః దృష్టి దోషై: నలిప్యతే //
మరియు
బ్రహ్మార్పణం బ్రహ్మ హవిర్బ్రహ్మాగ్నౌ బ్రహ్మణా హుతమ్ / బ్రహ్మైవ తేవ గంతవ్యం బ్రహ్మకర్మసమాధినా //
మరియు
అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః / ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్ //

భోజనము తర్వాత :- అగస్త్యం కుంభకర్ణంచ శమ్యంచ బడబానలమ్ / ఆహారపరిణామార్ధం స్మరామి చ వృకోదరమ్ //
మరియు
విష్ణు: సమస్తేంద్రియ దేహదేహీ ప్రదానభూతో భగవాన్ యధైకః / సత్యేన తేనాత్త మశేష మన్నం ఆరోగ్యదం మే పరిణామ మేతు //

ప్రయాణం విధి :- జలే రక్షతు వారాహః స్థలే రక్షతు వామనః / అతవ్యాం నారసింహశ్చ సర్వతః పాతుకేశవః //
నీటిబాధనుంచి వరాహావతారం, భూ సంబంధమైన బాధలనుంచి వామనావతారం, అడవుల్లోని బాధలనుంచి నరసింహావతారం, అన్ని బాధలనుంచి అన్ని అవతారాలకి మూలమైన శ్రీహరి రక్షించుగాక!
లేదా
వనమాలీ గదీ శారజ్ఞి శంఖీ చక్రీ చ నందకీ / శ్రీమాన్ నారాయణో విష్ణు: వాసుదేవోభిరక్షతు //
లేదా
ఆపదా మపహర్తారం దాతారం సర్వసంపదామ్ / లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం //

కార్యసిద్ధి :- వినాయకం గురుం భానుం బ్రహ్మ విష్ణు మహేశ్వరాన్ / సరస్వతీం ప్రణమ్యాదౌ సర్వకార్యార్ధ సిద్ధయే //

స్మృతి సిద్ధి :- శ్రీదత్తో నారదో వ్యాసః శుకశ్చ పవనాత్మజః / కార్తవీర్యశ్చ గోరక్షో సప్తైతే స్మృతిగామినః //
(అనుకున్నది సిద్ధించడానికి, జ్ఞాపకశక్తి పెరగడానికి)

చంద్ర దర్శన స్తుతి :- క్షీరార్ణవ సముత్పన్న లక్ష్మీప్రియ సహోదర / మహేశమకుటాభాస్వన్ బాలచంద్ర నమోస్తుతే //

గోవు దర్శన స్తుతి :- గావో మే చాగ్రతో నిత్యం గావః పృష్ఠత ఏవ చ / గావో మే హృదయేచైవ గవాం మధ్యే వసామ్యహమ్ //
మరియు
మంగళం దర్శనం ప్రాతః పూజానం పరమం పదమ్ / స్పర్శనం పరమం తీర్ధం నాస్తి ధేనుసమం క్వచిత్ //

ఔషద విధి :- ధన్వంతరిం గురుత్మంతం ఫణిరాజం చ కౌస్తుభమ్ / అచ్యుతం చామృతం చంద్రం స్మరే దౌషధకర్మణి //
లేదా
శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరే / ఔషదం జాహ్నవీతోయం వైద్యో నారాయణో హరి: //
లేదా
అచ్యుతానంత గోవింద నామోచ్చారణ భేషజాత్ / నశ్యంతి సకలా రోగాః సత్యం సత్యం వదామ్యహమ్ //

శయనవిధి :- రామం స్కంధం హనుమంతం వైనతేయం వృకోదరం / శయనే యః స్మరేన్నిత్యం దుఃస్వప్నం తన్న నశ్యతి //
లేదా
అగస్త్యో మాధవశ్చైవ ముచుకుందో మహాబలః / కపిలో ముని రాస్తీకః పంచైతే సుఖశాయినః //
లేదా
హనుమా నంజనాసూను: వాయుపుత్రో మహాబలః
రామేష్ఠ: ఫల్గునసఖః పింగాక్షోమిత విక్రమః
ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకః
లక్ష్మణప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పహా
ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః
స్వాపకాలే పఠే న్నిత్యం యాత్రాకాలే విశేషతః
తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్.

కుంకుమ ధారణ :- కుంకుమస్త్రీ పురుషులు ధరించడం మన సనాతన ఆచారం. ఇది తప్పనిసరి. ఎందుకంటే - రెండు కనుబొమలకు మద్యభాగమైన నుదుటిస్థానం 'ఇడ' 'పింగళ' 'సుషుమ్న' అనే ప్రధాన నాడుల సంగమస్థానం. కుంకుమ ధరించడం పవిత్రతకు, అస్తికత్వానికి, ధార్మికత్వానికి పురుషులకు సంకేతమైతే, స్త్రీలకు ఐదవతనానికి, సౌభాగ్యానికి, స్థిరబుద్ధికి సంకేతంగా చెప్తారు. కుంకుమ మనిషిలోని మనోశక్తిని, త్యాగతత్వాన్ని, నిర్భయత్వాన్ని, సహృదయతను పెంపొందిస్తుంది. మనం బొట్టు పెట్టుకునే చోటే అజ్ఞాచక్రం ఉంటుంది. దానికి త్రివేణి సంగమమని, అమృతస్థానమని పేరు. ధ్యానానికి ఇది ముఖ్యస్థానం. ఈచోట కుంకుమధారణ వలన పుష్టి, భక్తి, ఐశ్వర్యం మొదలైనవి కలుగుతాయి.


ఆంజనేయుడికి ఇష్టమైన పుష్పాలు?

వైశఖమాసి కృష్ణాయాం - దశమ్యాం మందవాసరే!
పూర్వాభాద్రాభ్య నక్షత్రే - వైధ్రుతౌ హనుమా నభూతే||
ఆంజనేయ స్వామి వసంతఋతువు, వైశాఖ మాసం కృష్ణపక్షంలో, దశమి తిథి, శనివారం, పూర్వాభాధ్రా నక్షత్రంలో, వైధృతౌ మధ్యాహ్న కాలంలో అంజనీదేవికి జన్మించాడు. ఆంజనేయుడు అంజనాదేవి, కేసరుల ముద్దుబిడ్డ. సదా రామనామామృతపాలన సేవితుడై గంధమాధశైలి యందు వసించు చిరంజీవి. ఆంజనేయ నామమహిమ అనితరమైనది.

అలాంటి మృత్యుంజయుడైన ఆంజనేయుని పొన్నపువ్వు, మొగలి, పొగడ, నంధివర్ధనం, మందారం, కడిమి, గజనిమ్మ, పద్మం, నల్లకలువ, మద్ది, సువర్ణ పుష్పం, గౌరీ మనోహరం, ఎర్ర గన్నేరు, కనకాంబరం, ములుగోరిట, మెట్ట తామర, పొద్దు తిరుగుడు, మంకెన, బండికెరి వెంద, అడవిమల్లె, కొండగోగు దింటెన, సన్నజాజి, మల్లె, గులాబి, మోదుగ, సంపంగి, జిల్లేడు, చంధ్త్ర కాంత, సురపున్నాగ, కుంకుమ పువ్వు మొదలైన పుష్పాలు అంటే ఇష్టం.

అలాగే తులసి, మాచిపత్రి, ఎర్రకలువ, గోరింట, ఉత్తరేణి, పసుపు, అక్షింతలు, తిరుమారేడు, నేరేడు, తమలాపాకులు కూడా ఆంజనేయునికి ప్రీతికరమైనవి అని పైన వివరించవడిన పుష్పాలు, పత్రాలతో స్వామివారి పూజిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి అని పండితులు అంటున్నారు.

'శివం' అంటే మంగళం అని అర్థం

'శివం' అంటే మంగళం అని అర్థం. ఆదిదేవుడైన పరమేశ్వరుడు మంగళప్రదాత. ఆద్యంతాలు లేని జ్యోతిస్వరూపుడు. సృష్టిలోని ప్రతి అణువూ పరమేశ్వరుడే కొలువైవుంటాడు. పరిపూర్ణ పవిత్రత, పరిపూర్ణ జ్ఞానం, పరిపూర్ణ సాధనగల భక్తవత్సలుడు వేదాల్లో రుద్రునిగా కీర్తించబడ్డాడు.

ఇకపోతే.. శివ అంటే శ+ఇ+వ గా వర్గీకరించారు. 'శ' కారము పరమానందాన్ని, 'ఇ' కారము పరమ పురుషత్వాన్ని, 'వ' కారము అమృత శక్తిని సూచిస్తుంటాయి. 'శివౌ' అంటే పార్వతీ పరమేశ్వరులని అర్థం.

సూర్యుని నుంచి వెలుగును, చంద్రుని నుంచి వెన్నెలను, అగ్ని నుంచి వేడిని విడదీయలేని విధంగా శివశక్తులది అవినాభావ సంబంధం. నిత్యానంద స్వరూపుడైన శివుడు సృష్టి, స్థితి, లయ, తిరోభావ, అనుగ్రహాలనే జగత్కార్యాలను చక్కబెడుతుంటాడు.